మోడీపై 50శాతం చైనీయులకు పాజిటివ్ ఫీలింగ్

మోడీపై 50శాతం చైనీయులకు పాజిటివ్ ఫీలింగ్

 

చైనా ప్రత్యర్థిగా భావిస్తున్న ఇండియా ప్రధాని మోడీ అంటే అక్కడి వారు పాజిటివ్ గానే ఉన్నారట. ఈ విషయాన్ని చైనాలోని పాలక కమ్యూనిస్ట్ ఆధీనంలో నడుస్తున్న ‘ది గ్లోబల్ టైమ్స్’ వెల్లడించింది. ఇటీవల చేపట్టిన ఓ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో 50 శాతం మందికి పాజిటివ్ ఆలోచనే ఉందట.

భారత్, చైనా బోర్డర్ల మధ్య వివాదాలు చెలరేగిన సమయంలోనే ‘ది గ్లోబల్ టైమ్స్’, చైనా ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్(సీఐసీఐఆర్)లు చైనాలో 1960 మందిపై సర్వే నిర్వహించారు. అభిప్రాయ సేకరణలో భాగంగా వారందరితో మాట్లాడి తెలుసుకున్నారట.

సగానికంటే ఎక్కువ మంది భారత ప్రధాని నరేంద్ర మోడీపై పాజిటివ్ అభిప్రాయమే వ్యక్తం చేశారు. సర్వేల్లో పాల్గొన్న చైనీయుల్లో 53.5 శాతం మంది భారత్ అంటే సానుకూల అభిప్రాయం ఉందని చెప్పారు. వారిలో భారత ప్రధాని మోడీపై 50.7 శాతం సానుకూలత వ్యక్తంచేశారు.

లడఖ్ సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరగ్గా, ఆ తర్వాత సైనికాధికారులు, విదేశాంగ మంత్రుల స్థాయిలో సమావేశాలు జరిగాయి. భారత్‌లో చైనా యాంటీ సెంటిమెంట్, భారత్ సైనిక సామర్థ్యం వంటి అంశాలపైనా ఈ సర్వేలో చైనీయులు తమ అభిప్రాయాలు తెలిపారు.

భారత్ ఆర్థికపరంగా చైనాపై ఎక్కువగా ఆధారపడుతుందా అన్న ప్రశ్నకు 49.6 శాతం మంది అవునని చెప్పగా 27.1 శాతం మంది ఆ వాదనతో ఏకీభవించలేదు. 23.3 శాతం మంది దీనిపై స్పష్టమైన అభిప్రాయం చెప్పలేదు.

ప్రస్తుతం భారత్‌తో యాంటీ చైనా సెంటిమెంట్ రగులుతోందా అన్న ప్రశ్నకు సర్వేలో పాల్గొన్నవారిలో 70.8 శాతం మంది నుంచి అవుననే సమాధానం వచ్చింది. 15.2 శాతం మంది మాత్రం అలాంటిదేమీ లేదన్నారు.