510మంది వాలంటీర్లపై కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగం

కరోనా మహమ్మారిని నిరోధించాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే ఆయుధం. మెడిసిన్‌ అందుబాటులోకి వచ్చినా వ్యాప్తిని అరికట్టడం సాధ్యం కాదనేది వాస్తవం.. కరోనాకు వ్యాక్సిన్ అందించడం కోసం ప్రపంచవ్యాప్త

510మంది వాలంటీర్లపై కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగం

కరోనా మహమ్మారిని నిరోధించాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే ఆయుధం. మెడిసిన్‌ అందుబాటులోకి వచ్చినా వ్యాప్తిని అరికట్టడం సాధ్యం కాదనేది వాస్తవం.. కరోనాకు వ్యాక్సిన్ అందించడం కోసం ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు ఇప్పుడు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నారు. దేశాలన్నీ వ్యాక్సిన్‌ తయారీకి నడుం బిగించాయి. బ్రిటన్‌ అయితే రెండడుగులు ముందుకేసి ఏకంగా మనుషుల మీద కూడా ప్రయోగాలు మొదలుపెట్టేసింది.

అయితే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ తయారీని ఓ వార్‌లా భావిస్తున్నాయి అగ్రదేశాలు.. చైనా, అమెరికా, బ్రిటన్‌, జర్మనీతో పాటు భారత్‌లోనూ కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జోరుగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ఫార్మా విపణిలో కూడా పోటీ మొదలైంది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ కనుగొనేందుకు పోటీ పడుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు విరుగుడుగా వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు సై అంటున్నాయి.

ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో వ్యాక్సిన్‌ పరిశోధన చివరి దశకు చేరుకుందని అంటున్నారు. ఈ వ్యాక్సిన్‌ను ఇఫ్పటికే మనుషులపై ప్రయోగించడం మొదలు పెడుతున్నట్టు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆరోగ్య కార్యదర్శి మాట్‌ హాంకాక్‌ ప్రకటించారు. అన్ని కలిసివస్తే వ్యాక్సిన్‌ను సెప్టెంబర్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రొఫెసర్‌ సరహ్‌ గిల్బర్ట్‌ తెలిపారు.

వ్యాక్సిన్‌ బయటకు రావాలంటే సాధారణ పరిస్థితుల్లో అయితే తక్కువలో తక్కువ కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది. కానీ ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో అన్ని సంస్థలు పోటీ పడుతుండగా.. వ్యాక్సిన తయారీ కోసం ఇప్పటికే బ్రిటన్‌ ప్రభుత్వం 20 మిలియన్ పౌండ్లను ప్రకటించింది. అంతేకాదు లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ మరో 22.5 మిలియన్‌ పౌండ్ల నిధిని కేటాయించింది. మరోవైపు జర్మనీ సంస్థ బయోన్‌టెక్‌, అమెరికా సంస్థ ఫిజర్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను గ్రీన్‌-లైటింగ్‌ ట్రయల్స్‌లో భాగంగా మనుషులపై ప్రయోగించనున్నట్టు ఇప్పటికే వెల్లడించింది. పరీక్షలో వచ్చిన ఫలితాలను విశ్లేషించిన అనంతరం వ్యాక్సిన్‌కు ఆమోదం తెలుపుతామని జర్మనీ ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది.

బ్రిటన్‌లో ఆరోగ్యంగా ఉన్న 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న 510 మంది వాలంటీర్లపై ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ChAdOxl nCoV-19 పేరుతో తయారైన వ్యాక్సిన్‌ను కొందరిపై ప్రయోగిస్తారు. తేడాను తెలుసుకొనేందుకు మరికొందరికి కంట్రోల్‌ ఇంజెక్షన్‌ను ఇస్తారు. కనీసం రెండు మూడు వారాల పాటు ఈ ట్రయల్స్‌ కొనసాగుతాయి. ఫోర్త్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక పక్క ప్రయోగాలకు ఉపక్రమిస్తూనే… మరోపక్క భవిష్యత్‌ అవసరాల కోసం ఉత్పత్తిని కూడా పెద్ద సంఖ్యలో చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రెండో దశలో ప్రయోగాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో అన్ని వయసుల వాలంటీర్లపై వ్యాక్సిన్‌ను ప్రయోగిస్తారు. చింపాంజీలలో గుర్తించిన వైరస్‌తో తయారు చేసిన వ్యాక్సిన్‌ను వారిపై ఉపయోగిస్తారు. మూడో దశలో 18 ఏళ్లు నిండిన 5000 మంది వాలంటీర్లపై ప్రయోగాలు చేస్తారు. వారిలో సగం మందికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అందిస్తారు. కొద్ది నెలల్లోనే దీని ఫలితాలు వస్తాయని, అంతా విజయవంతంగా సాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నివారణకు తాము కనిపెట్టిన వ్యాక్సిన్ సెప్టెంబరులో అందుబాటులోకి వస్తుందని ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కోసం వివిధ కంపెనీలు, దాతలతో కలిసి పని చేస్తున్నారు. తాము కనిపెట్టిన వ్యాక్సిన్‌.. క‌రోనాపై సమర్థంగా పని చేస్తుందని చెబుతున్నారు.

మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఇతర టెక్నాలజీతో తయారు చేసిన వ్యాక్సిన్లు రెండు లేదా ఎక్కువ డోస్‌లు కావాలని, తాము తయారు చేసిన వ్యాక్సిన్ సింగిల్ డోస్ చాలని ఆక్స్‌ఫర్డ్‌ సైంటిస్టులు అంటున్నారు. క్లినికల్ ట్రయల్స్‌కు ముందే వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా ప్రారంభించారు. ఇందుకోసం ఏడు కంపెనీలు కలసి పని చేస్తున్నాయి. బ్రిటన్‌లో మూడు, యూరప్‌లో రెండు, చైనా, ఇండియాల్లో ఒక్కో కంపెనీ ఈ వ్యాక్సిన్‌ త‌యారీలో భాగస్వామిగా ఉన్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ ప్రతినిధులు చెప్పారు. బ్రిటన్‌లో రకరకాల కరోనా వ్యాక్సిన్ పరీక్షలు జరుగుతున్నాయి. అందులో ప్రధానమైనది ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో జరుగుతున్న పరీక్షలు దాదాపు చివరి అంకానికి చేరుకున్నాయి.

ప్రస్తుతం బ్రిటన్‌ దేశంలో పరిశోధన దశలో ఉన్న ఏదో ఒక వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌కు టీకాల ఉత్పత్తి సామర్థ్యం లేదని, టీకాల అభివృద్ధిలో మాత్రం మంచి స్థితిలో ఉందని అంటున్నారు. మే నెలలో పరిశోధన ఓ కొలిక్కి వస్తే ఆగస్టు మధ్య నాటికి ముగింపు దొరుకుతుందని చెబుతున్నారు. ఆ తర్వాత ఉత్పత్తి సవాళ్లు ఉంటాయి. ప్రస్తుత తొలి విడత ఇన్పెక్షన్ల సమయంలోనే టీకా సంగతి తేల్చేయాలని యూకే శాస్త్రవేత్తలు  పరుగులు తీస్తున్నారు. వారికి అన్ని విధాలా ప్రభుత్వం అండదండలు అందిస్తోంది. స్వయానా బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో అదే దేశం నుంచి వ్యాక్సిన్‌ విషయంలో ముందడుగు పడడం విశేషం.

కరోనా వ్యాక్సిన్‌ తయారీకి చైనా నిర్వహించిన తొలి దశ ప్రయోగ పరీక్షలకు సంబంధించిన కీలక సమాచారంతో బయో ఆర్కైవ్‌ వెబ్‌సైట్‌లో ఓ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. దీని ప్రకారం.. చైనా శాస్త్రవేత్తలు తొలుత ఎలుకలు, కోతులపై వ్యాక్సిన్‌ను ప్రయోగించారు. దీంతో కొవిడ్‌-19ను తిప్పి కొట్టేందుకు వాటిలోని రోగ నిరోధక వ్యవస్థ స్పందించి యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేసింది. కోతులకు 3 మైక్రోగ్రాములు, 6 మైక్రోగ్రాములు కలిగిన రెండు డోసుల వ్యాక్సిన్‌ను ఇవ్వగా.. వాటిలో కొన్నింటికి ఇన్ఫెక్షన్‌ నుంచి పూర్తి రక్షణ లభించింది. ఇంకొన్నింటికి పాక్షిక ఉపశమనం చేకూరింది. సాధారణంగా వైరస్‌లు దాడిచేస్తే వాటిని తిప్పికొట్టేందుకు యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. కానీ వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత కోతుల్లో ఇన్ఫెక్షన్‌ తగ్గడంతో పాటు యాంటీబాడీల ఉత్పత్తి పెరగలేదని గుర్తించారు. దీంతో టీకా పనితీరు బాగా ఉందనే నిర్ధారణకు వచ్చారు.

ఇప్పుడు కరోనా నిరోధ వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ల్యాబోరేటరీల్లో నిరంతర ప్రయోగాల్లో మునిగిపోయారు. వైరస్ జన్యువును విశ్లేషించి.. దానికి విరుగుడు తయారు చేయడంలో వారంతా తలమునకలయ్యారు. అయితే, ఎంత వేగంగా ప్రయోగాలు సాగించినా.. వ్యాక్సిన్ తయారీకి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో బ్రిటన్‌లో అడుగులు వేగంగా పడుతుండడం ఆనందించాల్సిన పరిణామమని ప్రపంచ దేశాలు అంటున్నాయి. అక్కడ ఏప్రిల్‌ 23 నుంచి మనుషులపై ప్రయోగించడం మొదలుపెట్టారు.