700 కి.మీటర్లు వెనక్కి నడక : పర్యావరణ పరిరక్షణ కోసం

  • Published By: madhu ,Published On : August 23, 2019 / 07:48 AM IST
700 కి.మీటర్లు వెనక్కి నడక : పర్యావరణ పరిరక్షణ కోసం

పర్యావరణాన్ని కాపాడండి..అంటూ ఓ వ్యక్తి 700 కిలోమీటర్లు వెనక్కి నడుస్తున్నాడు. విభిన్నరీతిలో సందేశమిస్తున్నాడు. అడవుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాను వెనక్కి నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 43 సంవత్సరాలున్న మోడీ బస్తోని ఇండోనేషియాకు చెందిన వాడు. తూర్పు జావా ఇతని స్వగ్రామం. అడవులు అంతరిస్తుండడంపై అతడిలో ఆందోళన నెలకొంది. దీంతో ప్రజల్లో అవగాహన పెంచాలని అనుకున్నాడు. సైకిల్, జీపు, ఇతర మార్గాల్లో కాకుండా వినూత్నంగా కార్యక్రమం నిర్వహించాలని, మాములుగా ముందుకు నడవడం కాకుండా వెనక్కి నడుస్తూ ప్రజల్లో అవగాహన పెంచాలని డిసైడ్ అయ్యాడు. జులై 18వ తేదీ నివాసం నుంచి బయలుదేరాడు.

దాదాపు 700 కిలో మీటర్లు లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒక అద్దాన్ని వీపుకు తగిలించుకున్నాడు. దాని సహాయంతో వెనక్కి నడుస్తున్నాడు. ఇలా చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని..కానీ భవిష్యత్ తరాల కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నాడు మోడీ బస్తోని. ఆగస్టు 17వ తేదీ నాటికి రాజదాని జకార్తకు చేరుకోవాలని ప్రణాలిక వేసుకున్నాడు. కానీ కాలి నొప్పి కారణంగా చేరుకోలేకపోయాడు.

నిర్ణయించుకున్న లక్ష్యాన్ని ఆగస్టు 23వ తేదీ శుక్రవారం కంప్లీట్ చేసి..దేశాధ్యక్షుడిని కలిసి అడవులకు జరుగుతున్న నష్టాన్ని..తద్వారా మానవ జీవనానికి జరిగే ముప్పును ఆయన దృష్టికి తీసుకరావాలని భావిస్తున్నట్లు వెల్లడిస్తున్నాడు. రోజుకు 20 నుంచి 30 కిలో మీటర్లు నడుస్తున్నట్లు..ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లలో రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపాడు. తనకు చాలా మంది సహాయం అందిస్తున్నట్లు..ఆహారం, నీరు, పండ్లు ఇచ్చారన్నాడు.