వారివల్లే మళ్లీ కరోనా కేసులు.. ఒకరిని పట్టించినా రూ.54వేలు ఇస్తాం!

  • Published By: sreehari ,Published On : April 16, 2020 / 03:19 AM IST
వారివల్లే మళ్లీ కరోనా కేసులు.. ఒకరిని పట్టించినా రూ.54వేలు ఇస్తాం!

కరోనా వైరస్ పుట్టింది చైనాలోని వుహాన్ సిటీలో.. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించింది. అతికష్టం మీద చైనా కరోనాను కంట్రోల్ చేయగలిగింది. కరోనా కేసులు తగ్గిపోవడంతో చైనా ఊపిరిపీల్చుకుంది. కానీ, అంతలోనే మళ్లీ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. కరోనా పూర్తిగా నియంత్రణలోకి రావడంతో అన్ని తెరుచుకున్నాయి. దాంతో విదేశాల నుంచి వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది. విదేశాల నుంచి వచ్చేవారి ద్వారా కరోనా కేసులు చైనాలో మళ్లీ పెరిగిపోతున్నాయి. ఈశాన్య ప్రాంతంలోని హిలోంగ్జియాంగ్ ప్రావిన్స్ లో రష్యా నుంచి వచ్చిన వారిలో 79 కేసులు నమోదు కావడంతో చైనా అధికారులు అప్రమత్తం అయ్యారు. 

విదేశాల నుంచి ఇతర మార్గాల్లో చైనాలోకి ప్రవేశించేవారి నుంచే ఈ వైరస్ మహమ్మారి మళ్లీ వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారిని గుర్తించే పనిలో పడ్డారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారి ఆచూకీ గుర్తించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ఇలా 79వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. అక్రమంగా చొరబడిన వారిని గుర్తించి వైద్య పరీక్షలు చేస్తే తప్ప పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. సరిహద్దుల్లో ఎంత నిఘా పెట్టినా విదేశీయులు అక్రమంగా చొరబడుతూనే ఉన్నారు. ఇక లాభం లేదని భావించిన చైనా అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించినవారిని గుర్తించి వారి ఆచూకీ చెప్పినవారికి పారితోషకం ఇస్తామని ప్రకటించారు. వారిని పట్టిస్తే 5వేల యువాన్లు (భారత కరెన్సీలో రూ.54వేలు నగదు) ఇస్తామని ప్రకటించారు.  

చైనాలో కరోనా ప్రభావం తగ్గినప్పటికీ.. ఇతర దేశాల్లో మాత్రం కరోనా విలయతాండవం చేస్తోంది. అమెరికా అల్లాడిపోతోంది. ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా సోకిన వారంత పిట్టల్లా రాలిపోతున్నారు. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండగా.. మరణాల సంఖ్య కూడా వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు పోరాడుతునే ఉన్నాయి. 

Also Read | కరోనా ఎఫెక్ట్.. వచ్చే విద్యా సంవత్సరం ఆలస్యం, రెండో శనివారం సెలవులు రద్దు