H1B వీసా కేసు..169మంది భారతీయుల పిటిషన్ కొట్టివేత

  • Published By: venkaiahnaidu ,Published On : September 17, 2020 / 08:54 PM IST
H1B వీసా కేసు..169మంది భారతీయుల పిటిషన్ కొట్టివేత

హెచ్‌1బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ కు ఊరట లభించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకు జూన్‌ 22న ట్రంప్‌ ప్రభుత్వం హెచ్‌1బీ, హెచ్‌4 సహా అన్ని రకాల వర్కింగ్‌ వీసాలను ఈఏడాది చివరి వరకూ నిలిపివేసిన విషయం తెలిసిందే.

అయితే, హెచ్‌1బీ వీసాల నిలిపివేతపై ట్రంప్‌ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ 169 మంది భారతీయులు కోర్టును ఆశ్రయించారు. వర్క్‌ వీసాలపై అమెరికాలో నివసించి ఇటీవలే భారత్‌కు తిరిగివెళ్లిన 169 మంది భారత జాతీయులు ఈ కేసు దాఖలు చేశారు. వీసా నియంత్రణలు ఏకపక్ష నిర్ణయమని వాదించిన వారు తమ వీసా దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.


అయితే వీసా నియంత్రణలను విధించకుండా అధికార యంత్రాంగాన్ని నిరోధించేందుకు వాషింగ్టన్‌లోని యూఎస్‌ డిస్ర్టిక్ట్‌ జడ్జి అమిత్‌ మెహతా నిరాకరించారు. 169 మంది భారతీయుల పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. వీసా నిలిపివేతను సవాల్‌ చేస్తూ దాఖలైన అభ్యర్ధనను తోసిపుచ్చడం ఇది రెండవసారి కావడం గమనార్హం. ఈనెల 4న కొందరు వీసా దరఖాస్తుదారులు దాఖలు చేసిన ఈ తరహా కేసును మెహతా కొట్టివేశారు.


కాగా, రెండు కేసుల్లోనూ అప్పీల్‌ చేసిన వారు అధ్యక్ష ఉత్తర్వుల ద్వారా ట్రంప్‌ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని ఆధారాలు చూపలేకపోయారని న్యాయమూర్తి పేర్కొన్నారు. మరోవైపు వీసా నిలిపివేతలపై ట్రంప్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అమెరికా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సహా పలు పారిశ్రామిక సంఘాల అభ్యర్ధనను ఓక్లాండ్‌లో మరో ఫెడరల్‌ న్యాయమూర్తి పరిశీలిస్తున్నారు