ఇంకా భయపెడుతోంది, కరోనా తొలి మరణానికి ఏడాది

ఇంకా భయపెడుతోంది, కరోనా తొలి మరణానికి ఏడాది

first death in China : ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొత్త స్ట్రెయిన్ రూపంలో కలవరపెడుతోంది. వూహాన్‌లో వెలుగుచూసిన వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఏడాది కాలంలో లక్షల మందిని బలితీసుకుంది. కరోనా తొలి మరణం నమోదయి 2021, జనవరి 11వ తేదీ సోమవారానికి సరిగ్గా ఏడాదవుతోంది. కొత్త వ్యాధి ఏంటో, దాని లక్షణాలు ఎలా ఉంటాయో..ఎంత వేగంగా వ్యాపిస్తుందో వంటి విషయాలపై సరైన నిర్ధారణ రాకముందే గత ఏడాది జనవరి 11న వూహాన్‌లో కరోనా బారిన పడి ఓ వ్యక్తి మరణించారు.

వూహాన్ లో ఓ మార్కెట్ :-
వూహాన్‌లోని ఓ మార్కెట్‌కు రెగ్యులర్ కస్టమర్ అయిన 61 ఏళ్ల వ్యక్తి వైరస్ కారణంగా చనిపోయినట్టు చైనా మీడియా అధికారికంగా ప్రకటించింది. ఈ వార్తతో అన్ని దేశాలూ ఉలిక్కిపడ్డాయి. చైనాలోని వూహాన్‌లో కొత్త వైరస్ వెలుగుచూసిందని మాత్రమే అప్పటిదాకా అనుకుంటున్న ప్రజలు కరోనా మరణం వార్త విని భయభ్రాంతులకు గురయ్యారు. అప్పటిదాకా కరోనా ప్రాణాంతకం అన్న సంగతి ఎవరికీ తెలియదు. కరోనా తొలి మరణం ప్రపంచానికి ప్రమాద ఘంటికలు మోగించింది. తొలి మరణం తర్వాత వూహాన్‌లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. వైరస్ లక్షణాలతో వూహాన్ ప్రజలు ఆస్పత్రులకు పరుగులు తీశారు. కరోనా సోకిందని తెలుసుకునేలోపే మృత్యువాత పడుతున్న ప్రజలతో అక్కడ దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.

చైనా దాటిన వైరస్ :-
వూహాన్ వెలుపలా కేసులు నమోదు కావడం మొదలయింది. వైరస్ చైనా దాటి విస్తరించింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు వూహాన్‌లో లాక్‌డౌన్ విధించింది చైనా ప్రభుత్వం. తర్వాత నెలల్లో ప్రపంచమంతా లాక్‌డౌన్ అమలయింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య దాదాపు 9 కోట్ల 7లక్షలకు చేరింది. కరోనా మరణాల సంఖ్య 19లక్షల 43వేలు దాటింది. ఏడాది కాలంలో ఓ వైరస్ 19లక్షల మందిని బలితీసుకుంది. వైరస్ వెలుగుచూసిన తొలిరోజుల్లో కరోనా మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ….తర్వాత పరిస్థితి మారిపోయింది. వూహాన్‌తో పాటు చైనాలో కరోనా మరణాలను నివారించగలిగినప్పటికీ….మిగిలిన దేశాల్లో వైరస్ మరణ మృదంగం మోగించింది. ఇటలీ, స్పెయిన్, అమెరికా వంటి దేశాలు కరోనా మరణాల్లో కొత్త రికార్డులు సృష్టించాయి. అమెరికాలో ఇప్పటికీ వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. ఆ దేశంలో రోజూ రెండు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి.

అమెరికా ఫస్ట్ ప్లేస్ :-
కరోనా మరణాలు అత్యధికంగా నమోదయిన దేశాల్లో అమెరికా మొదటిస్థానంలో ఉంది. ఆ దేశంలో 3లక్షల 83వేలమందికి పైగా వైరస్ బారిన పడి చనిపోయారు. తర్వాతి స్థానంలో బ్రెజిల్ ఉంది. మొదటి నుంచీ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న బ్రెజిల్‌లో మరణాల సంఖ్యా అధికంగానే ఉంటోంది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య రెండు లక్షలు దాటింది. కరోనా మరణాలు అధికంగా ఉన్న మూడో దేశం భారత్. దేశ జనాభా, వైరస్ కేసులతో పోలిస్తే…భారత్‌లో కరోనా మరణాల సంఖ్య తక్కువే అయినప్పటికీ….జాబితాలో మూడో స్థానంలో ఉంది. మన దేశంలో లక్షన్నరమందికి పైగా వైరస్‌కు బలయ్యారు.

పెరిగిన రికవరీ :-
ఏడాది కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి సగటున రోజుకు 5వేల 323మందికి పైగా చనిపోయారు. భారత్‌లో రోజుకు 413 మంది కరోనాతో చనిపోయారు. అమెరికాలో ఆ సంఖ్య వెయ్యి దాటింది. అయితే వైరస్ తీవ్రత ఎక్కవగా ఉన్న సమయంలో అన్ని దేశాల్లో రోజువారీ మరణాల సంఖ్య ఎక్కువగా ఉండగా….వ్యాప్తి తగ్గిన తర్వాత రికవరీల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా రికవరీల సంఖ్య 6 కోట్ల 48లక్షలు దాటింది.