పాక్ అదుపులో ఉన్న అభినందన్ పరిస్థితి ఏంటి?.. విడుదల చేస్తారా.. లేదా?

పాక్ అదుపులో ఉన్న అభినందన్ పరిస్థితి ఏంటి?.. విడుదల చేస్తారా.. లేదా?

భారత్‌పై దాడికి వచ్చిన యుద్ధ విమానాలను తరిమికొట్టేందుకు వెళ్లిన కమాండర్ అభినందన్‌ను పాక్ సైనికులు పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారుజాము జరిగిన దాడికి ప్రతిచర్యగా పాక్ బలగాలు ఈ దాడికి పాల్పడ్డాయి. భారత్‌కు యుద్ధ విమానాలతో ఎర వేసి పట్టుకోవడానికి ప్రయత్నించింది పాకిస్తాన్. వాళ్లను తరిమికొట్టే ప్రయత్నంలో పాక్ పన్నిన వ్యూహాన్ని పసిగట్టలేకపోయిన భారత్.. రెండు జెట్ విమానాలతో పాటు ఓ ఫైలట్ అభినందన్‌ను పాక్ బారిన పడకుండా కాపాడలేకపోయింది. 

నిబంధనల ప్రకారం..:
ఒకవేళ పాకిస్తాన్‌కు దొరికినప్పటికీ యుద్ధ ఖైదీపై ఎలాంటి ప్రతీకారచర్యలకు దిగకూడదు. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలను హింసించకూడదు. చెయ్యి చేసుకోకూడదు. పాక్ ఆర్మీ అందుకు విరుద్దంగా ప్రవర్తించి చిత్ర హింసలకు గురి చేసింది. రక్తం వచ్చేలా కొడుతూ.. వింగ్ కమాండర్ పట్ల అతి క్రూరంగా ప్రవర్తించింది. దీనిపై భారత్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఏం చేయాలి:
భారత యుద్ధ విమానాలను ప్లాన్ చేసి షూట్ చేసిన పాకిస్తాన్ బారి నుంచి.. యుద్ధ ఖైదీగా మారిన కమాండర్‌ను విడిపించుకోవడమే మన టార్గెట్. పాక్‌తో చర్చలు జరిపితేనే కానీ, మన కమాండోను విడిపించుకోవడం సాధ్యం కాదేమోననిపిస్తుంది. 

గతంలో ఇలాగే .. 
అది 1999వ సంవత్సరంలో పాకిస్తాన్‌తో భారత్ కార్గిల్ యుద్ధం జరుపుతున్న రోజులు. మే 27వ తేదీన శత్రువులైన పాక్ సైనికులను 17ఏల అడుగుల ఎత్తు నుంచి షూట్ చేయమని కంభంపాటి నచికేతాను హైకమాండ్ ఆదేశించింది. మిగ్ 27 యుద్ధ విమానంతో బయల్దేరాడు. అది 80మిమీ రాకెట్స్ ను విడుదల చేస్తూ.. పెను బీభత్సం సృష్టించగలదు. దురదృష్టవశాత్తు దాడి మధ్యలో ఉండగానే ఇంజిన్ ఫెయిల్ అయి ముంతడాలో సమీపంలో ఉన్న బటాలిక్ ప్రాంతంలో దిగాల్సి వచ్చింది.

నచికేతాతో పాటుగా మరో యుద్ధ విమానంలో మిగ్ 21లో పైలట్‌గా ఉన్న అజయ్ అహుజా సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ప్లైట్ దాదాపు కూలిపోతుందనుకున్న సమయంలో నచికేతా కిందకు దూకేశాడు. చేతిలో ఉన్న పిస్టల్ ఆఖరి బుల్లెట్ వరకూ శత్రువులను అంతుచూస్తూనే పరుగుపెట్టాడట. అవి ఖాళీ అయిన వెంటనే పాక్ ఆర్మీ కొట్టిన దెబ్బలకు చావు అంచుల వరకూ వెళ్లాడని ఇంగ్లీషు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 

‘పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ కమాడోర్(రిటైర్డ్) వచ్చేంతవరకూ నన్ను చితకబాదారు. ఇంకా చావడమే సులువేమో అనిపించింది. ఆ తర్వాత వారిని అదుపుచేయడంతో కొద్దిగా శాంతించారు. భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా చర్చలు జరిపి పాక్‌పై విడుదల చేయాలని ఒత్తిడి తెచ్చింది. మళ్లీ పాక్ సరిహద్దుల్లోకి రాననే  పూచీకత్తు మీద నన్ను విడుదల చేశారు. దాంతో 8 రోజులు కస్టడీ తర్వాత వాగాహ్ సరిహద్దు నుంచి భారత్‌కు పంపించారు. అప్పుడు నాకు జీవితం విలువేంటో అర్థమైంది’ అని తన అప్పటి పరిస్థితిని గుర్తుకు తెచ్చుకున్నాడు కంభంపాటి నచికేతా.

2019 ఫిబ్రవరి 27 బుధవారం ఉదయం పాక్‌ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చాయి. భారత ఆర్మీ పోస్టులపై దాడికి యత్నించాయి. వాటిని అడ్డుకునేందుకు శ్రీనగర్‌లో ఉన్న క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌లోని మిగ్‌లు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన మిగ్‌ 21 బైసన్‌ పాక్‌ భూభాగంలోకి ప్రవేశించి అక్కడ కూలిపోయింది. ఆ విమానంలో ఉన్న పైలెట్‌ అభినందన్‌ తమకు చిక్కినట్లు పాకిస్తాన్‌ ఒక వీడియో ద్వారా విషయం తెలియజేసింది.