Woman Delivers Baby : విమానంలోనే ప్ర‌స‌వించిన అఫ్ఘాన్ మ‌హిళ‌

తాలిబన్ల రాకతో అఫ్ఘానిస్తాన్‌లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల దురాఘతాలకు భయపడి అక్కడి ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.

Woman Delivers Baby : విమానంలోనే ప్ర‌స‌వించిన అఫ్ఘాన్ మ‌హిళ‌

Woman Delivers Baby

Woman Delivers Baby : తాలిబన్ల రాకతో అఫ్ఘానిస్తాన్‌లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల దురాఘతాలకు భయపడి అక్కడి ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లాపాప‌ల‌తో కొంద‌రు, నిండు గ‌ర్భంతో మ‌రికొంద‌రు.. ఇల్లూవాకిలి వ‌దిలి ప్రాణాలు అర‌చేతిలో పట్టుకుని దేశం వీడుతున్నారు. అఫ్ఘాన్ ప్రజలు భారీ సంఖ్యలో కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అక్కడికి వచ్చే విదేశాలకు చెందిన విమానాలు ఎక్కి ప్రాణాలు దక్కించుకుంటున్నారు. అమెరికాకు చెందిన మిలటరీ విమానాలు పెద్దఎత్తున అఫ్ఘాన్ శరణార్థులను తరలిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అఫ్ఘాన్ కు చెందిన ఓ నిండు గర్భిణి అమెరికా మిలటరీ విమానం ఎక్కింది.

జ‌ర్మ‌నీ వెళ్తున్న అమెరికా మిలటరీ విమానంలోనే ఆ మహిళ పండంటి బిడ్డను ప్ర‌స‌వించింది. కాబూల్‌ నుంచి జర్మనీ వెళుతుండగా విమానంలోనే మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. విమానంలో మ‌హిళ‌కు పురిటి నొప్పులు వ‌చ్చిన‌ట్లు యూఎస్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ వెల్ల‌డించింది. విమానం ల్యాండ‌వ‌గానే.. వైద్య సిబ్బంది విమానంలోకి వెళ్లి ఎయిర్‌క్రాఫ్ట్ కార్గో ప్రాంతంలో ఆ మ‌హిళ‌కు పురుడు పోశారు. పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఆ మ‌హిళ క్షేమంగానే ఉన్న‌ట్లు కూడా యూఎస్ ఎయిర్ మొబిలిటీ క‌మాండ్ తెలిపింది.

నిజానికి గాల్లో ఉన్న స‌మ‌యంలోనే ఆమెకు నొప్పులు రావ‌డంతో ప‌రిస్థితి విష‌మించేలా క‌నిపించింద‌ని, గాలి ఒత్తిడిని త‌గ్గించ‌డానికి పైల‌ట్లు విమానాన్ని త‌క్కువ ఎత్తులో తీసుకెళ్లార‌ని చెప్పింది. దీని కార‌ణంగా త‌ల్లి ప్రాణం నిలిచిన‌ట్లు వెల్ల‌డించింది. మ‌రోవైపు అఫ్ఘానిస్తాన్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ అమెరికా బ‌ల‌గాలు 17వేల మందిని వేర్వేరు దేశాల‌కు త‌ర‌లించిన‌ట్లు వైట్‌హౌజ్ వెల్ల‌డించింది.

అఫ్ఘానిస్తాన్‌ తాలిబన్ల వశమైనప్పట్నుంచి ప్రతిరోజు హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కాబూల్‌ ఎయిర్ పోర్టులో దృశ్యాలు అందరి గుండెలను తాకుతున్నాయి. తాలిబన్ల అరాచక పాలనకి భయపడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి కాబూల్‌ ఎయిర్ పోర్టుకి వేలాదిగా తరలివస్తూ ఉండడంతో వారిని అడ్డగించడానికి తాలిబన్లు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఈ కంచెకి ఒకవైపు అమెరికా, బ్రిటన్‌ సైనిక దళాలు, మరోవైపు మూటా ముల్లె, పిల్లాపాపల్ని చేతపట్టుకున్న అఫ్ఘాన్ ప్రజలు.. ఇక వారిని అడ్డగిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతున్న తాలిబన్లు.. ఈ దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని ఆవేదనకు గురి చేస్తున్నాయి.