కాబూల్ స్కూల్ లో బాంబు పేలుళ్లు..53మంది మృతి

అంతర్యుద్ధంతో నలిగిపోతున్న అఫ్గానిస్తాన్‌ మరోసారి ఉగ్రదాడులతో దద్దరిల్లింది.

కాబూల్ స్కూల్ లో బాంబు పేలుళ్లు..53మంది మృతి

Afghanistan

Afghanistan అంతర్యుద్ధంతో నలిగిపోతున్న అఫ్గానిస్తాన్‌ మరోసారి ఉగ్రదాడులతో దద్దరిల్లింది. అఫ్గనిస్తాన్ లో గత 20 ఏళ్లుగా ఉన్న అమెరికా, నాటోలు తమ దళాలను ఉపసంహరించుకుంటోన్న వేళ వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. అఫ్గాన్​ రాజధాని కాబుల్​లోని సయీద్ ఉల్ సౌహద బాలికల ఉన్నత పాఠశాల వద్ద శనివారం సాయంత్రం జరిగిన బాంబు దాడి ఘటనలో మృతుల సంఖ్య 53కి చేరింది. మరణించిన వారిలో ఎక్కువ మంది 11-15 ఏళ్ల వయసు విద్యార్థులే ఉన్నారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ఆదివారం ప్రకటించింది. ఈ ఘటనలో మరో 100 మందికిపైగా గాయపడినట్టు తెలిపింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కాబుల్​ పశ్చిమ ప్రాంతంలోని షియా పరిసరాల్లో రోజూలాగే విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నారు. ఆ సమయంలో ప్రవేశ ద్వారానికి వెలుపల మూడు పేలుళ్లు సంభవించాయి. బాలికలు స్కూల్ నుంచి ఇళ్లకు బయల్దేరుతుండగా మొదట కార్ బాంబు పేలింది. తర్వాత రెండు రాకెట్లను పేల్చారు. పేలుళ్లపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అయితే బాంబు పేలుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు…ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బందిపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. సిబ్బందిపైనా దాడి చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడానికి ప్రయత్నించగా ఆరోగ్య కార్యకర్తలపై కూడా భౌతిక దాడులకు దిగారు. చివరకి పోలీసుల సాయంతో గాయపడినవారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. బాంబు పేలుడు తర్వాత పాఠశాలలోని బాలికలు ఆర్తనాదాలు చేస్తూ బయటకు పరుగెత్తాని రహీమీ అనే స్థానిక వ్యక్తి తెలిపారు.

అయితే, ఈ బాంబు దాడులకు పాల్పడింది తామేనంటూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. కాగా, ఈ దాడులు తమపని కాదంటూ తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇలాంటి నీచమైన దాడులకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే పాల్పడతారని తాలిబన్ సంస్థ ఆరోపించడం గమనార్హం. అయితే.. ఇటీవల అదే ప్రాంతంలో షీతేస్​ మైనార్టీలపై దాడి చేసిన ఇస్లామిక్​ స్టేట్ ఉగ్రవాద సంస్థపై ఎక్కువగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.