అమ్మకడుపులో పసిగుడ్డులకు కాలుష్య కాటు : వాయు కాలుష్యంతో గర్భస్రావాలు..ఆందోళన కలిగిస్తున్న అధ్యయనం

అమ్మకడుపులో పసిగుడ్డులకు కాలుష్య కాటు : వాయు కాలుష్యంతో గర్భస్రావాలు..ఆందోళన కలిగిస్తున్న అధ్యయనం

Air pollution behind increased risk of pregnancy loss in India : వాయు కాలుష్యపు కోరలు గర్భంలో ఉండే శివులపాలిట శాపంగా మారుతోంది. అమ్మకడుపులో ఉండే పసిగుడ్డులకు వాయు కాలుష్యం పొగపెడుతోంది. ఈ వాయు కాలుష్యానికి ప్రతీ ఏటా దక్షిణ ఆసియాలో 3,49,681 గర్భ విచ్ఛిత్తి కేసులు నమోదవుతున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రతీ ఏటా 7 శాతం చొప్పున పెరుగుతున్నాయని వెల్లడైంది. ఇది భారత్ లోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.

అమ్మ కడుపులోంచి భూమి మీదికి రాకుండా గర్భస్థ శిశులు ఉసురు తీస్తోంది వాయు కాలుష్యం. గర్భ విచ్ఛిత్తిలకు కారణమవుతోంది. తల్లులకు కడుపు కోత మిగుల్చుతోంది. బిడ్డల పుట్టుకలపై పెను ప్రభావం చూపుతోంది. భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో 29శాతం అబార్షన్లకు కారణం వాయు కాలుష్యమేనని చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

2000–2016 మధ్య వాయు కాలుష్యం వల్ల ఏటా సగటున 3,49,681 అబార్షన్లు జరిగాయని శాస్త్రవేత్తలు లెక్క తేలింది. ఈ కాలంలో ఏటా జరుగుతున్న అబార్షన్లలో వాయు కాలుష్యం వల్ల అవుతున్న అబార్షన్లు 7 శాతం చొప్పున పెరిగాయని నిర్ధారించారు. డబ్ల్యూహెచ్ వో నిర్దేశాల ప్రకారం కాలుష్యకారకమైన పీఎం 2.5 పరమాణువులు ఒక ఘనపు మీటరు గాలిలో 10 మైక్రోగ్రాములకు మించి ఉండకూడదు.

దక్షిణాసియా దేశాల్లో అది 40 మైక్రోగ్రాముల మేర ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. 10 మైక్రోగ్రాములు దాటాక.. పెరిగే ప్రతి పాయింట్ కు 3 శాతం మేర అబార్షన్లు పెరుగుతున్నాయని తేల్చారు. పట్టణ ప్రాంతాల్లోని యువ తల్లులతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని పెద్ద వయసు మహిళలకే దీని ముప్పు ఎక్కువగా ఉందని గుర్తించారు.

భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లలో అబార్షన్లు జరిగిన 34,197 మంది మహిళల డేటా తీసుకుని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. మన దేశంలోనే ఎక్కువగా 77 శాతం మేర వాయు కాలుష్యంతో గర్భ విచ్చిత్తులు జరిగాయని తేల్చారు. తర్వాత పాకిస్థాన్ లో 12 శాతం, బంగ్లాదేశ్ లో 11 శాతం మేర అబార్షన్లు అయ్యాయని గుర్తించారు.