కరోనా ఎఫెక్ట్ : MWC 2020 ఈవెంట్‌‌ నుంచి అమెజాన్ డ్రాప్!

  • Published By: sreehari ,Published On : February 10, 2020 / 08:33 AM IST
కరోనా ఎఫెక్ట్ : MWC 2020 ఈవెంట్‌‌ నుంచి అమెజాన్ డ్రాప్!

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో స్పెయిన్ లోని బర్సిలోనాలో జరుగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2020 ఈవెంట్ నుంచి ప్రపంచ టెక్ దిగ్గజాలు తప్పుకుంటున్నాయి. ఇదివరకే సౌత్ కొరియన్ కంపెనీ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, స్వీడన్ టెలి కమ్యూనికేషన్ దిగ్గజం ఎరిక్సన్, గ్రాఫిక్స్ దిగ్గజం నివిడియాతో పాటు ఇప్పుడు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా MWC ఈవెంట్ నుంచి తప్పుకుంది.

కరోనా వైరస్ (2019-nCov) చైనాలోని వుహాన్ సిటీ నుంచి మొదలై ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో అన్నిదేశాల్లోనూ ముందస్తు చర్యలు చేపట్టగా వైరస్ భయం పట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కరోనావైరస్ వ్యాప్తి అలానే కొనసాగుతుండటంతో అమెజాన్ మెబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2020 ఈవెంట్లో ప్రదర్శన నుంచి తప్పుకుంటున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. లక్షణాలు కనిపించని కరోనా వైరస్ వ్యాప్తితో పరిశ్రమ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

ఎరిక్సన్ ప్రకారం.. కరోనా వైరస్ వ్యాప్తితో తమ ఉద్యోగుల విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది. వైరస్ ప్రభావం తగ్గిపోవడానికి కంపెనీ తగిన చర్యలు చేపడుతోంది. అంతర్గత ముప్పు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎరిక్సిన్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమ్ డబ్ల్యూసీ బర్సిలోనా 2020లో పాల్గొనడాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించింది.