అమెజాన్‌లో ఆవుపేడ పిడకలు..ఛీ టేస్టీగా లేవు..ఈసారన్నా శుభ్రంగా చేయమన్న కష్టమర్

అమెజాన్‌లో ఆవుపేడ పిడకలు..ఛీ టేస్టీగా లేవు..ఈసారన్నా శుభ్రంగా చేయమన్న కష్టమర్

Amazon Cow dung cakes : అమెజాన్. అతి పెద్ద ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం. అమృంతాంజనం నుంచి ఆవు పేడ పిడకల వరకూ అందుబాటులో ఉంటాయి. అటువంటి అమెజాన్ లో గత కొంతకాలంలో ‘ఆవుపేడ’తో చేసిన పిడకల్ని అమ్ముతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ కస్టమర్ ఆవుపేడ పిడకల్ని ఆర్డర్ చేసి కొనుకున్నాడు. మరి వాటిని కేకులు అనుకున్నాడో..బిస్కెట్లు అనుకున్నాడో తెలీదుగానీ తినేశాడు. తిన్న తరువాత కూడా అతనికి అవి పిడకలని తెలీలేదు. తాను తిన్నవాటిపై రివ్య్వూ ఇస్తూ.. ఛీ..టేస్ట్ అస్సలు బాగాలేదు. ఈ సారి వీటిని తయారు చేసేటప్పుడు కాస్త శుభ్రత పాటించి చేయండి అంటూ చెప్పుకొచ్చాడు..!

విదేశాల్లో ఉండే భారతీయుల కోసం ఆన్‌లైన్‌లో ఆవుపేడతో చేసిన పిడకల్ని ‘కౌ డంగ్ కేక్’ (ఆవు పేడ కేక్) పేరుతో అమ్ముతున్నారు. అవి పిడకలు అనే విషయం భారతీయులకు ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ కొంతమందికి అవి పిడకలనీ. తెలీదు. దీంతో ఓ కష్టమర్ ‘ఆవుపేడ పిడకల్ని’ కొత్త రకం కేకులేమో అనుకుని కొంతమంది ఆర్డర్ చేసి..వాటిని టేస్ట్ చూసి షాకవ్వుతున్నారు. ‘ఇదేంటీ ఇలాగున్నాయ్’ అంటూ వెర్రిముఖాలు పెడుతున్నారు. అలా ఓ కస్టమర్ కూడా ఆవుపేడ పిడకల్ని కొత్తరకం కేకులనుకున్నాడో ఏమా పాపం ఆర్డర్ చేసి తెప్పించుకుని తిన్నాడు.

డెలివరీ అయిన తరువాత గబగబా ఆ పిడకల్ని టేస్ట్ చూశాడు. ఆ తరువాత అతని పరిస్థితి చూడాలి..‘ఛీ ఇదేంటీ ఇలాగుంది టేస్టు..అస్సలు బాగాలేదు..ఏదో గడ్డి-బురద కలిసినట్లుగా ఉంది. ఇవి తయారు చేసినప్పుడు సరైన శుభ్రత పాటించలేదో ఏమో..ఈసారి చేసినప్పుడు నీట్ గా చేయండి’ అంటూ రివ్వ్యూ ఇచ్చాడు. ఆ కస్టమర్ ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డాక్టర్ సంజయ్ అరోరా అనే ట్విట్టర్ యూజర్.. అమెజాన్‌లో పిడకలు కొని రుచి చూసిన వ్యక్తి రివ్యూను పోస్ట్ చేశాడు. ఆన్‌లైన్ పెట్టిన ఆ పిడకలను కేవలం దేవుడి పూజ కోసమే వినియోగించాలని స్పష్టంగా రాసి ఉంది. మరి, కస్టమర్ అవేవీ పట్టించుకోలేదో ఏమో.. వాటిని రుచి చూసి షాకయ్యాడు. ఈ సందర్భంగా ఆ ఉత్పత్తికి ఒక స్టార్ వేయడమే కాకుండా నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.

అంతేకాదు ఇవి తిన్నాక నాకు మోషన్స్ పట్టుకున్నాయి. దయచేసి ఇవి తయారీ సమయంలో పరిశుభ్రత విధానాలు పాటించండి. టేస్ట్ గా ఉండేలా తయారు చేయండి అంటూ రివ్యూలో పేర్కొన్నాడు. ఇది చదివినవారంతా అతను తెలిసి తిన్నాడా? తెలియక తిన్నాడా? ..ఆ ప్రొడక్ట్ కింద వివరాలను చదవకుండా ఎలా కొన్నాడు? ఎలా తిన్నాడు? అనే అనుమానాల్ని వ్యక్తంచేస్తుంటే మరికొందరేమో..ఆ పిడకలను అతడు నిజంగానే తిన్నాడా? లేదా సరదా కోసం..పబ్లిసిటీ కోసం ఈ రివ్యూ పెట్టాడా ? అని కూడా అనే డౌటనుమానాలు వస్తున్నాయి.

కాగా..ఏదైనా ప్రొడక్ట్ రివ్యూ రాయాలంటే.. అది ఆ వ్యక్తి తప్పనిసరిగా దాన్ని కొనుగోలు చేస్తేనే సాధ్యమవుతుంది. దీన్నిబట్టి అతడు ఆ పిడకలను కొనుగోలు చేసిన తర్వాత ఆ రివ్యూ పెట్టాడని అర్థం చేసుకోవాల్సి ఉంది.కాకపోతే…అతను ఆ పిడకల్ని కొన్న విషయంలోను తిన్న విషయంలోనూ..అమెజాన్‌ను తప్పేమీ లేదు. ఎందుకంటే.. ఆ పిడకలు దేనికి ఉపయోగిస్తారనేది స్పష్టంగా డిస్క్రిప్షన్‌లో నోట్ చేశారు. ఆ ప్రొడక్ట్ ని కేవలం పూజలు, హోమాలు కోసమే వినియోగిస్తారని, 100 శాతం పేడతో వీటిని తయారు చేశారని అందులో పేర్కొన్నారు. అంతేకాదు వాటిని మండించడం ద్వారా గాల్లోని కలుషితాలు నాశనమవుతాయని కూడా నోట్ చేసి ఉంది.

ఇంత స్పష్టంగా ఉన్నా..వాటిని కొన్న సదరు కష్టమర్ వాటిని తినేవని ఎలా అనుకున్నాడో అర్థం కాదు. ఏది ఏమైనా ఈ రివ్వ్యూకు సంబంధించిన ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు జోకుల మీద జోకులేస్తున్నారు.