అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైంది!

  • Published By: venkaiahnaidu ,Published On : May 9, 2019 / 03:06 AM IST
అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైంది!

అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు రద్దయ్యేలా ఇరాన్‌ ప్రయత్నాలను ప్రారంభించింది.తమ అణు కార్యక్రమాలపై పరిమితులు విధించుకుంటామంటూ 2015లో అగ్ర రాజ్యాలకు ఇచ్చిన మాటను ఇక ఎంతమాత్రం  గౌరవించబోమని బుధవారం(మే-8,2019)ఇరాన్ సృష్టం చేసింది. అమెరికా తమపై విధించిన ప్రస్థుత ఆంక్షలను తొలగించే వరకు ఇదే విధానాన్ని పాటిస్తామని తెలిపింది. అణు పరీక్షల విషయమై అమెరికాతో పాటు బ్రిటన్‌, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, రష్యాలతో ఇరాన్‌ ఒప్పందం కుదుర్చుకొంది.

అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా హయాంలో కుదిరిన బహుపాక్షిక న్యూక్లియర్ డీల్ ప్రకారం శుద్ధి చేసిన యురేనియం, భార జలాలను ఎగుమతి చేసి ఇరాన్‌ తన దగ్గర ఉన్న నిల్వలను తగ్గించుకోవాలి. ఆ ఒప్పందం కారణంగానే అప్పట్లో ఇరాన్‌ పై ఉన్న ఆంక్షల్లో కొన్నింటిని ఎత్తివేశారు.అయితే మే-8,2018న ఈ న్యూక్లియర్ డీల్ నుంచి తప్పకుంటున్నట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించినట్లు ఇరాన్‌ అధ్యక్షుడు హస్సన్‌ రౌహాని గుర్తు చేశారు. తమ ఆర్థిక వ్యవస్థపై అమెరికా ఏకపక్ష ఆంక్షలు విధించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఆంక్షలు తొలగించేలా ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్న అగ్రరాజ్యాలు కృషి చేయాలని, ఇందుకు 60 రోజుల సమయం ఇస్తున్నామని, 60 రోజులలో తమ వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైతే మరిన్ని ఆంక్షల అమలు నుంచి కూడా వైదొలుగుతామని ఇరాన్ హెచ్చరించింది. తాము ఎంచుకున్న మార్గం యుద్ధం వైపు కాదని,దౌత్యానికి మార్గం అని ఇరాన్ అధ్యక్షుడు దేశప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో తెలిపారు.అయితే దౌత్యమార్గం కొత్త బాషతో,కొత్త లాజిక్ తో ఉండాలన్నారు.
 
 ఇరాన్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా మండిపడింది. ఇరాన్ తన ప్రత్యర్థులపై దాడులకు సిద్ధమవుతున్నదని ఆరోపించింది.పర్షియన్‌ గల్ఫ్‌ సముద్ర జలాల్లోకి యుద్ధ విమానాల వాహక నౌక అయిన ‘అబ్రహం లింకన్‌’ను పంపించనున్నట్టు ఇరాన్ ప్రకటన అనంతరం అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ ప్రకటించారు.బాంబులు ప్రయోగించే కార్యాచరణ బృందం కూడా వెళ్తుందని, అవసరమైతే అదనపు దళాలను పంపిస్తామని చెప్పారు. మధ్య ప్రాచ్యంలో ఉన్న అమెరికా దళాలపై ఇరాన్‌ దాడి చేసే అవకాశం ఉందన్న సమాచారం అందినందునే ఈ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అమెరికా అణ్వాయుధాలైన ‘బి-52’ బాంబులు పంపనున్నట్టు సమాచారం.

ఇరాన్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే… ఇరాన్ పై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ స్టీల్,కాపర్,ఐరన్,అల్యూమినియం సెక్టార్లపై ఆంక్షలు విధించే ఫైలుపై ట్రంప్ సంతకం చేశారు. ఇరాన్ ఎగుమతులలో చమురు తర్వాత స్థానం లోహ ఉత్పత్తులదే. ఇరాన్ కి చెందిన స్టీల్,ఇతర మెటల్స్ ను ఇతర దేశాలు తమ పోర్టుల్లోకి అనుమతించడాన్ని ఇక ఎంతమాత్రం సహించబోమని ట్రంప్ హెచ్చిరించారు.

యురేనియంను శుద్ధి చేయడం అంటే దాన్ని అణ్వాయుధాల తయారీకి ఉపయోగించడమే. గతంలో ఇరాన్‌ దగ్గర పది వేల కిలోల అత్యంత మేలు రకమైన శుద్ధి చేసిన యురేనియం నిల్వ ఉండేది. ప్రస్తుతం కేవలం 300 కిలోల సాధారణ రకం యురేనియం మాత్రమే ఉంది. భారజల రియాక్టరు ద్వారా తయారయ్యే ప్లుటోనియంను కూడా అణ్వాయుధాల్లో ఉపయోగిస్తారు.