Geo Thermal Power : జియో థర్మల్‌ విద్యుత్ ఉత్పత్తి.. భూమిపై మొట్టమొదటిసారి

మనిషి ఇప్పటివరకు జల విద్యుత్.. థర్మల్‌ విద్యుత్.. పవన విద్యుత్.. సౌర విద్యుత్.. టైడల్‌ విద్యుత్.. అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో మరో రకం విద్యుత్ ఉత్పత్తి కానుంది. అదే.. జియో థర్మల్‌ విద్యుత్తు.

Geo Thermal Power : జియో థర్మల్‌ విద్యుత్ ఉత్పత్తి.. భూమిపై మొట్టమొదటిసారి

geo thermal power

geo thermal power : మనిషి ఇప్పటివరకు జల విద్యుత్.. థర్మల్‌ విద్యుత్.. పవన విద్యుత్.. సౌర విద్యుత్.. టైడల్‌ విద్యుత్.. అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో మరో రకం విద్యుత్ ఉత్పత్తి కానుంది. అదే.. జియో థర్మల్‌ విద్యుత్తు. ఇప్పటివరకు వాడుతున్న అన్ని విద్యుత్తు రకాల్లో పలు పరిమితులు ఉన్నాయి. అంటే నీరు పుష్కలంగా ఉంటేనే జల విద్యుత్తు ఉత్పత్తి చేయగలం.. బొగ్గు లేదా గ్యాస్‌ ఉంటేనే థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి సాధ్యమవుతుంది. కానీ, జియో థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తికి ఇవేవీ అవసరం లేదు. ఉపరితలం నుంచి భూమి లోపలికి 20 కిలోమీటర్ల రంధ్రం చేసి, అక్కడ ఉండే అపరిమిత వేడిని బయటకు తీసుకురాగలిగితే చాలు. ఇది నిరంతరాయంగా ఉత్పత్తి చేయగలిగే కరెంటు.. భూమిపై మొట్టమొదటిసారి జియో థర్మల్‌ విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు అమెరికాకు చెందిన స్టార్టప్‌ సంస్థ క్వాయిస్‌ ఎనర్జీ సిద్ధమవుతోంది.  2024 నాటికి మొదటి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభిస్తామని సంస్థ సహ వ్యవస్థాపకుడు మాట్‌ హౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు.

భూమి ఉపరితలం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల లోతుకు ప్రత్యేకమైన డ్రిల్‌ యంత్రాలతో రంధ్రం చేసి అక్కడ ఉండే ఉష్ణాన్ని పైకి తెస్తామని హౌడ్‌ చెబుతున్నారు. ఈ టెక్నాలజీపై అమెరికాలోని ప్రఖ్యాత మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోని ప్రయోగశాలలో పరీక్షలు కూడా చేశారు. భూమిపై ఇప్పటివరకు అత్యంత లోతైన రంధ్రం రష్యాలో ఉంది. ఆ దేశంలోని పెచెంగ్సీ జిల్లాలో 7.6 మైళ్ల లోతు వరకు భూమి లోపలికి డ్రిల్‌ చేయగలిగారు. అయితే, ఈ రంధ్రం చేయటానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది. హౌడ్‌ చెప్తున్నట్టు 20 కిలోమీటర్లు రంధ్రం చేస్తే.. అంత లోపల ఉష్ణోగ్రత దాదాపు 500 సెంటీగ్రేడ్‌ ఉంటుంది. అంత వేడిని తట్టుకొని పనిచేసే డ్రిల్స్‌ ఇప్పటికీ అందుబాటులో లేవు. అందుకే డ్రిల్స్‌ స్థానంలో శక్తిమంతమైన వేవ్స్‌ను వాడాలని ఈ సంస్థ నిర్ణయించింది.

Solar Energy Cloth : అద్భుత ఆవిష్కరణ.. సౌర శక్తితో విద్యుత్తును తయారు చేసే వస్త్రం

మొదట ఉపరితలం నుంచి 3.5 కిలోమీటర్ల వరకు సాధారణంగానే డ్రిల్‌ చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేకమైన యంత్రాలతో వేవ్స్‌ను అత్యంత ఒత్తిడితో కూడిన గ్యాస్‌తో కలిపి లోపలికి పంపుతారు. ఆ ఒత్తిడికి కఠినమైన బసాల్ట్‌ శిలలు కూడా బూడిద అయిపోతాయి. అలా భూమిలోపల పాక్షిక ద్రవరూపంలో పదార్థం ఉండేవరకు రంధ్రం చేస్తారు. అక్కడే అపారమైన ఉష్ణ శక్తి నిల్వ ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ఉష్ణాన్ని పైకి రప్పించి, ఉపరితలంపై ప్రత్యేక ప్లాంట్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఒక్కో ప్లాంటు ద్వారా 100 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు వేసినట్టు హౌడ్‌ పేర్కొన్నారు.

జియో థర్మల్‌ విద్యుత్తుకు పరిమితులు ఉండవు. భూమిపై ఎక్కడైనా, ఏ సమయంలోనైనా కరెంటును ఉత్పత్తి చేయవచ్చు. చీకటైతే సోలార్‌ పవర్‌ ఉండదు. నదులు ఎండిపోతే జలవిద్యుత్తు ఉండదు. కానీ, ఏమీ లేకపోయినా జియో థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి ఆగదు. ఈ కరెంటు ఉత్పత్తికి భారీగా స్థలం కూడా అవసరం ఉండదు. కాబట్టి అడవులు, ప్రకృతి వనరులను ధ్వంసం చేయాల్సిన అవసరం రాదు. మనకు అవసరమైన దానికంటే ఎక్కువే ఉత్పత్తి చేయవచ్చని హౌడ్‌ అంటున్నారు. ముందుగా అమెరికాలోని కాలిఫోర్నియా, ఒరెగాన్‌, వాషింగ్టన్‌, ఊటా, కొలరాడో, నెవాడా ప్రాంతాల్లో డ్రిల్స్‌ మొదలుపెడుతామన్నారు. అయితే, జియో థర్మల్‌ విద్యుత్తుకు భూకంపాల లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు భూమి లోపలి రంధ్రాలు తట్టుకొని ఎలా నిలబడగలవనేదే సమస్యగా ఉంది.