భూమి అంతర్భాగంలో మరో కొత్త పొర దాగి ఉందంట.. ఇక పుస్తకాలు తిరగరాయాల్సిందే!

భూమి అంతర్భాగంలో మరో కొత్త పొర దాగి ఉందంట.. ఇక పుస్తకాలు తిరగరాయాల్సిందే!

Earth Inner most Core : భూమి ఉపరితలంపై వాతావరణంలో పొరలు ఉన్నట్టే.. భూమి అంతర్భాగంలోనూ విభిన్న పొరలు ఉంటాయని చిన్నప్పుడే చదువుకున్నాం.. భూమి బాహ్య ఉపరితలంపై ఐదు పొరలంటే.. భూమి అంతర నిర్మాణంలో నాలుగు పొరలు ఉంటాయని తెలుసు. అయితే ఇప్పుడు భూమి అంతర మధ్యభాగంలో మరో కొత్త పొర దాగి ఉందంట.. ఈ కొత్త పొరను చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా భూ అంతర నిర్మాణంలో 4 పొరలు మాత్రమే ఉన్నాయని పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం..
అవి.. భూపటలము (crust), భూప్రావారము (mantle), బాహ్యకేంద్ర మండలం (outer core), అంతర కేంద్ర మండలం (inner core) ఇప్పుడు ఆ నాలుగు పొరలకు మరో కొత్త పొర ఒకటి వచ్చి చేరింది.. అదే.. అంతర అత్యంత కేంద్ర మండలం (inner most core)గా పిలుస్తున్నారు సైంటిస్టులు. భూ ఉపరితలం మొత్తం భూపటలముపైనే ఆవరించి ఉంటుంది.

అలాగే భూప్రావారము అనేది.. భూపటలానికి బాహ్య కేంద్రానికి మధ్య ఒక రాతిలా ఉంటుంది. భూమి బరువులో 67శాతం, భూసాంద్రతలో 85శాతం ఉంటుంది. ఇక బాహ్య కేంద్ర మండలం అనేది ఒక ద్రవ్య పొర.. ఇందులో ప్రధానంగా ఇనుము, నికెల్ లోహాలు ఉంటాయి. భూమి అయస్కాంత క్షేత్రానికి మూలంగా చెప్పవచ్చు.

Another New Inner most Core in the center of earth's core

ఇక అంతర కేంద్ర మండలము.. భూమికి కేంద్ర బిందువు లాంటిది. ఘనరూపంలో బంతి మాదిరిగా ఉంటుంది. ఇందులో అంతరంగా మరో పొర ఉందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ (ANU) శాస్త్రవేత్తల బృందం తేల్చేసింది. అదే అంతర అత్యంత కేంద్ర మండలం.. ఇన్నర్ కోర్ లో మరొక కోర్ దాగి ఉందని, అచ్చం రష్యన్ బొమ్మలాగే ఉందని అంటున్నారు.

భూమి చరిత్ర ప్రారంభమైన రోజుల్లోనే ఈ లోపలి భాగం ఉద్భవించి ఉండొచ్చునని చెబుతున్నారు. ఇనుము నిర్మాణంలో మార్పులను సూచించే ఆధారాలను తాము కనుగొన్నామని పేర్కొన్నారు. దీని వివరాలు ఇప్పటికీ రహాస్యగానే ఉన్నాయని చెబుతున్నారు. పాఠ్య పుస్తకాల్లో కూడా నాలుగు పొరలకు బదులుగా ఐదు పొరలు ఉన్నాయని తిరగ రాయాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.