చైనాపై అరుణాచల్ ప్రదేశ్ భగ్గుమంటోంది… దేశం ఏకమవుతోంది!

  • Published By: sreehari ,Published On : September 8, 2020 / 08:22 PM IST
చైనాపై అరుణాచల్ ప్రదేశ్ భగ్గుమంటోంది… దేశం ఏకమవుతోంది!

ఇండో-చైనా సరిహద్దుల్లో రేగిన వివాదమే ఇంకా ఎటూ తేలలేదు. అప్పుడే.. అరుణాచల్‌ప్రదేశ్‌పైనా కాంట్రవర్శీ క్రియేట్ చేస్తోంది చైనా. అరుణాచల్‌ప్రదేశ్‌గా భారత్ పిలిచే ప్రాంతాన్ని తామెప్పుడూ గుర్తించలేదంటోంది. అంతేకాదు.. అదే ప్రాంతంలో అదృశ్యమైన ఐదుగురు భారతీయుల సమాచారం కూడా తమ దగ్గర లేదని చెబుతోంది డ్రాగన్ కంట్రీ. చైనా చేసిన వ్యాఖ్యలతో.. అరుణాచల్ ప్రదేశ్‌లో విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయ్.

లద్దాఖ్‌లోని భారత సరిహద్దుల్లో.. పట్టు కోసం విఫలయత్నం చేస్తున్న చైనా మరోసారి అరుణాచల్‌ప్రదేశ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. పాంగాంగ్ లేక్ దగ్గర కవ్విస్తూనే.. అరుణాచల్‌ప్రదేశ్‌పై మళ్లీ అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తోంది. ఎన్ని రకాలుగా వీలైతే.. అన్ని రకాలుగా ఇండియాను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. కానీ.. డ్రాగన్ కుయుక్తులకు.. భారత్ లొంగడం లేదు. చైనా కుట్రలను.. ఇండియా డబుల్ డోస్‌తో తిప్పికొడుతోంది. అందుకే.. కమ్యూనిస్ట్ కంట్రీకి దిక్కుతోచక.. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. సరిహద్దుల్లో పిచ్చి వేషాలేస్తోంది.



అరుణాచల్‌పైనా కన్నేసిన చైనా :
అరుణాచల్‌ప్రదేశ్‌గా భారత్ పిలిచే ప్రాంతాన్ని.. చైనా ఎప్పుడు గుర్తించలేదని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అరుణాచల్ ప్రదేశ్.. సౌత్ టిబెట్‌లో భాగమని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య చైనా సేనలు గత వారం ఐదుగురు భారతీయులను సరిహద్దుల దగ్గర నుంచి కిడ్నాప్ చేశాయనే వార్తలు వచ్చాయి.

అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ తాపిర్ గావో.. ఈ విషయంపై తొలుత ట్వీట్ చేశారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని.. భారత్-చైనా సరిహద్దుల్లో వేటకు వెళ్లిన ఐదుగురిని చైనా సైనికులు కిడ్నాప్ చేశారని తర్వాత వార్తలు వచ్చాయి. వేటకు వెళ్లిన వారిలో ఇద్దరు తప్పించుకు వచ్చి.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా.. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఐదుగురిని.. చైనా సైన్యం కిడ్నాప్ చేసిందని ఆరోపించారు.



అరుణాచల్.. సౌత్ టిబెట్‌లో భాగమని వ్యాఖ్యలు :
కిడ్నాప్‌కి గురైన రోజు.. మొత్తం ఏడుగురు సభ్యుల బృందం నాచోకి సమీపంలోని అడవుల్లోకి వేటకు వెళ్లారు. ఇందులో ఇద్దరు మాత్రమే తిరిగొచ్చారు. నాచోకి ఉత్తరాన 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ పాట్రోల్ జోన్, సెరా-7 ప్రాంతంలో.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తమను అడ్డగించినట్లు చెప్పారు. ఐదుగురిని కిడ్నాప్ చేయగా.. తాము పారిపోయి వచ్చినట్లు తెలిపారు.

లద్దాఖ్‌లో.. ఎల్ఏసీ వెంబడి చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న సమయంలోనే.. ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐతే.. అదృశ్యమైన ఐదుగురి సమాచారం కోసం భారత సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సందేశం పంపించింది. ఇండియన్ ఆర్మీ అడిగిన ప్రశ్నకు.. సరిహద్దుల్లో అదృశ్యమైన ఐదుగురు భారతీయుల సమాచారం తమ దగ్గర లేదని చైనా సైన్యం చెప్పింది.



అప్పర్ సుభాన్ సిరి అడవుల్లో అదృశ్యమైన ఐదుగురు వ్యక్తుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని.. అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు చెబుతున్నారు. వీరంతా.. ఇండియన్ ఆర్మీకి పోర్టర్స్, గైడ్స్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అదృశ్యమైన వాళ్లంతా.. సుబన్‌సిరి జిల్లాలోని నాచో గ్రామానికి చెందినవారు. భారత్-చైనా మధ్య సరిహద్దును తెలిపే మెక్‌మోహన్ రేఖకు.. భారత్ నుంచి నాచో గ్రామమే లాస్ట్ అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్. కొన్ని నెలల క్రితం కూడా చైనా ఆర్మీ.. ఇలాగే కొందరిని కిడ్నాప్ చేసిందని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్ అన్నారు. ఇప్పటికైనా.. డ్రాగన్ కంట్రీకి గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.

లద్దాఖ్, డోక్లాం తరహాలో.. :
అరుణాచల్ ప్రదేశ్‌లోనూ చైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తోంది. దురాక్రమణలకు పాల్పడుతోంది. ఇప్పటికే చైనా బలగాలు.. వాస్తవాధీన రేఖ దాటి భారత్ వైపు చొచ్చుకొచ్చాయని చెబుతున్నారు. లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నుంచి దృష్టి మళ్లించేందుకే.. చైనా సేనలు అరుణాచల్ ప్రదేశ్‌ను టార్గెట్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



బోర్డర్‌ని ఆనుకొని ఉన్న అరుణాచల్‌లో.. కొన్ని వందల కిలోమీటర్ల భూభాగానికి కాపలా లేదు. సరిహద్దు చివర్లో ఉన్న ప్రాంతాలకు చేరుకోవాలంటే.. నాచో పట్టణం నుంచి కాలినడకన చేరుకునేందుకు కనీసం 11 రోజుల పైనే పడుతుంది. ఆ ప్రాంతాలకు ఐటీబీపీ కాపలాగా ఉంటోంది. ఐతే.. ఇప్పటికే అక్కడ అదనపు బలగాలను మోహరించారు.

అరుణాచల్ ప్రదేశ్.. సౌత్ టిబెట్‌లో భాగమని చైనా చేసిన వ్యాఖ్యలను.. ఆ రాష్ట్ర స్టూడెంట్ యూనియన్స్ ఖండించాయ్. ఇకనైనా.. తమ వివాదాస్పద వైఖరికి ఫుల్‌స్టాప్ పెట్టాలని హెచ్చరించారు. భారతీయులుగా, బలమైన జాతీయ వాదులుగా తామెంతో గర్వపడుతున్నామన్నారు. ఎవరో విదేశీయులు వచ్చి తమను గుర్తించాల్సిన పనిలేదని చైనాకు కౌంటర్ ఇచ్చారు. లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రేపుతూనే.. అరుణాచల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. చైనా చిచ్చు రేపుతోంది.