భారత్ బోణీ : ఆసియా ఫుట్‌బాల్ టోర్నీ

  • Published By: veegamteam ,Published On : January 6, 2019 / 04:24 PM IST
భారత్ బోణీ : ఆసియా ఫుట్‌బాల్ టోర్నీ

అబుదాబి: ఆసియా ఫుట్‌బాల్ కప్‌లో భారత్ బోణీ కొట్టింది. గెలుపుతో గ్రాండ్‌గా టోర్నీని ప్రారంభించింది. 4-1 తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. 2019 జనవరి 6న అల్ నహ్యాన్ స్టేడియంలో థాయ్‌లాండ్‌తో భారత జట్టు తలపడింది. థాయ్‌లాండ్‌పై భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. స్టార్ స్ట్రైకర్ సునీల్ ఛత్రి రెండు గోల్స్ సాధించాడు. అనిరుధ్ తాపా, లాల్ పెకులా చెరో గోల్ కొట్టి ఘన విజయాన్ని అందించారు.  ఈ విజయంతో పాయింట్ల పట్టికలో గ్రూప్ ఏ టాపర్‌గా భారత్ నిలిచింది. ఆ తర్వాత బహ్రెయిన్, యూఏఈలు ఉన్నాయి. 1986లో మెర్‌డెకా కప్ తర్వాత థాయ్‌లాండ్‌పై భారత్‌కు ఇదే తొలి గెలుపు. అబుదాబిలో అంతర్జాతీయ మెన్స్ ఆసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ 17వ ఎడిషన్‌ జరుగుతోంది.
టార్గెట్ వరల్డ్‌కప్:
ప్రతి నాలుగేళ్లకు ఒకసారి భారీ ఎత్తున నిర్వహించే ఈ పోటీలకు ఈసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిధ్యం ఇచ్చింది. 2019 జనవరి 5 నుంచి ఫిబ్రవరి 1 వరకు టోర్నీ జరుగుతుంది. అబుదాబిలోని నాలుగు ప్రధాన నగరాల్లోని ప్లే గ్రౌండ్స్‌లో మ్యాచులు జరుగుతాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన కప్ కైవసం చేసుకునేందుకు ఆరు గ్రూపులుగా 24 జట్లు పోటీపడుతున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్‌లో ప్రస్తుతం భారత్ 97వ ర్యాంక్‌లో ఉంది. 2011లో గ్రూప్ స్టేజీ నుంచి వెనుదిరిగిన భారత్ ఈసారి అత్యుత్తమ ప్రదర్శనతో 2026లో జరిగే వరల్డ్‌కప్‌లో చోటు దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది.