తలలు తెగిపడ్డాయి..కాళ్లు, చేతులు నరికివేశారు

తలలు తెగిపడ్డాయి..కాళ్లు, చేతులు నరికివేశారు

Ecuador prison

Ecuador prison riots : ద‌క్షిణ అమెరికా -ఈక్వెడార్‌లోని మూడు జైళ్లు యుద్ధభూమిగా మారాయి. రక్తపుటేరులు పారాయి. డ్రగ్స్‌ బిజినెస్‌పై పట్టు కోసం గ్యాంగ్‌లు ఘర్షణకు దిగడంతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ గొడవల్లో సుమారు 75 మంది ఖైదీలు మరణించారు. ఈక్వెడార్ జైళ్లలో ఇంత భారీ స్థాయిలో హింస జరగడం ఆ దేశ చ‌రిత్రలో ఇదే తొలిసారి. జైళ్లలో జ‌రిగిన హింసాత్మక ఘ‌ర్షణ‌ల గురించి ఆన్‌లైన్‌లో వీడియోలు చ‌క్కర్లు కొడుతున్నాయి. సోష‌ల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలు అత్యంత భ‌యాన‌కంగా ఉన్నాయి. కొంద‌రు ఖైదీల త‌ల‌లు తెగిపడి కనిపిస్తున్నాయి. కొంద‌రు ఖైదీల కాళ్లు తీసేశారు. మరికొంద‌రి చేతుల్ని న‌రికేశారు. ఈ భయానక వీడియోలు వైరల్ కావడంతో ఈక్వెడార్ ప్రిజ‌న్ వ్యవ‌స్థపై తీవ్ర విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రైవ‌ల్ గ్యాంగ్‌లు హింసాకాండ సృష్టించిన‌ట్లు ప్రభుత్వం ప్రకటించింది. గుయాక్విల్ న‌గ‌ర జైలును సైనిక బ‌ల‌గాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. గాయపడ్డవారికి వైద్యం అందిస్తున్నాయి. పోర్ట్ న‌గ‌రం మంటాలో ఉన్న జైలులో లాస్ చోనిరాస్ గ్యాంగ్ దారుణానికి పాల్పడింది. డిటెన్షన్ సెంట‌ర్లలో ఆధిప‌త్యం కోసం రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దక్షిణ అమెరికాలో కొకైన్‌ సరఫరాపై పట్టుకోసం ఈ గ్యాంగ్‌వార్‌ జరిగినట్లు అనుమానిస్తున్నారు. కొలంబియా, పెరుల నుంచి ఈక్వెడార్‌కు డ్రగ్స్‌ వస్తోంది.