తండ్రి హెల్మెట్‌ చిన్నారికి పెట్టి అవార్డు అందించిన ప్రభుత్వం : అంత్యక్రియల్లో కంటతడి పెట్టించే దృశ్యం

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 04:00 AM IST
తండ్రి హెల్మెట్‌ చిన్నారికి పెట్టి అవార్డు అందించిన ప్రభుత్వం : అంత్యక్రియల్లో కంటతడి పెట్టించే దృశ్యం

ఆస్ట్రేలియాలోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపుచేస్తున్నక్రమంలో ఫైర్‌ఫైటర్   ఆండ్రూ ఓడ్వైర్‌ పై ఓ చెట్టు పడి మృతి చెందారు. అలా చనిపోయిన ఆండ్రూ ఓడ్వైర్‌కు అంతిమ సంస్కారాలలో ఓ దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. సిడ్నీలో 36 ఏళ్ల ఆండ్రూ ఓడ్వైర్‌కు అంతిమ సంస్కారాలు  నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆండ్రూ 19 నెలల కూమార్తె తండ్రి హెల్మెట్ పెట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన అందరి మనస్సులు ద్రవించిపోయాయి. ప్రజలంతా కంట తడిపెట్టుకున్నారు. ఆండ్రూ ఓడ్వైర్‌ వీరమరణానంతరం ఆ చిన్నారికి అధికారులు పురస్కారాన్ని అందించారు. 

ఈ సందర్భంగా అగ్నిమాపకదళం కమిషనర్ ఫిట్స్‌జసైమన్స్ ఆ చిన్నారితో మాట్లాడుతూ ‘మీ నాన్న చాలా గొప్ప వ్యక్తి..మహనీయుడు. మీ నాన్న మమ్మల్నందరినీ విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఎందుకంటే మీ నాన్న రియల్ హీరో కదా!’ అని అన్నారు. 

వివరాల్లోకి వెళితే ఆండ్రూ ఓడ్వైర్ విధులలో భాగంగా మంటలను ఆర్పుతున్న సమయంలో అతనిపై మండుతున్న చెట్టు పడిపోయింది. దీంతో అతను మృతి చెందాడు. న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన రూరల్ ఫైర్ సర్వీస్‌లో ఆండ్రూ ఓడ్వైర్ సీనియర్ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వేలమంది ఫైర్ ఫైటర్లు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ పాల్గొన్నారు.

ఆండ్రూ అంతిసంస్కారాల కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చర్చిలో జరిగిన ఈ కార్యక్రమాలకు ఆండ్రూ ఫోటోను తీసుకొచ్చారు. భారీగా వచ్చిన తోటి సిబ్బందితో చర్చి ప్రాంగణం నిండిపోయింది. అందరూ అశ్రునయనాలతో ఆండ్రూకు ఘనంగా నివాళులు అర్పించారు.