లాక్‌డౌన్ సడలించి దుకాణాలను ఓపెన్ చేసినా, కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు పెరగలేదు, శుభవార్త చెప్పిన ఆస్ట్రియా ప్రభుత్వం

  • Published By: srihari ,Published On : May 6, 2020 / 03:34 AM IST
లాక్‌డౌన్ సడలించి దుకాణాలను ఓపెన్ చేసినా, కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు పెరగలేదు, శుభవార్త చెప్పిన ఆస్ట్రియా ప్రభుత్వం

యావత్ ప్రపంచాన్ని కరోనా భయాలు కమ్మేసిన వేళ ఆస్ట్రియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లాక్ డౌన్ తర్వాత షాపుల తిరిగి ఓపెన్ చేస్తే కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తుందేమోనని అంతా భయపడుతున్నారు. కరోనా కేసులు పెరుగుతాయని అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రియా ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చే విషయం చెప్పింది. ఆ దేశంలో లాక్ డౌన్ తర్వాత షాపులు రీఓపెన్ చేసినా కరోనావైరస్ ఇన్ ఫెక్షన్లు వేగవంతం కాలేదని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మంగళవారం(మే 5,2020) చెప్పారు. ”కరోనా వైరస్ కట్టడికి 7 వారాల పాటు లాక్ డౌన్ అమలు చేశాము. మూడు వారాల క్రితం షాపులు రీఓపెన్ చేశాము. కరోనా ఇన్ ఫెక్షన్లు వేగవంతం కాలేదు. అయినా దీనిపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది” అని ఆస్ట్రియా ఆరోగ్యశాఖ మంత్రి అన్నారు.

సత్ఫలితాలు ఇచ్చిన లాక్ డౌన్:
ప్రపంచలోని అన్ని దేశాలపైనా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపింది. కరోనా బాధిత దేశాల్లో ఆస్ట్రియా కూడా ఉంది. కరోనా వైరస్ విజృంభించడంతో వెంటనే అలర్ట్ అయిన ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ముందుగా లాక్ డౌన్ అస్త్రం ప్రయోగించింది. ఏడువారాల క్రితం లాక్ డౌన్ విధించింది. బార్లు, రెస్టారెంట్లు, స్కూళ్లు, థియేటర్లు, నిత్యవసరాలు కాని అన్ని రకాల షాపులను బంద్ చేసింది. అంతేకాదు పబ్లిక్ గ్యాథరింగ్స్ పైనా నిషేధం విధించింది. లాక్ డౌన్ ఫలితాన్ని ఇచ్చింది. కరోనా కట్టడైంది. కేసులతో పాటు మరణాల సంఖ్యా తగ్గింది. ఆస్ట్రియా దేశంలో కరోనా కారణంగా 606మంది చనిపోయారు.

లాక్ డౌన్ ఆంక్షలు సడలించినా అదుపులోనే కరోనా:
కరోనా వైరస్ అదుపులోకి రావడంతో ఆస్ట్రియా ప్రభుత్వం ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఆంక్షలు సడలించింది. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన యూరప్ దేశాల్లో మొదటిది ఆస్ట్రియానే. పలు షాపులు, గార్డెన్ సెంటర్లను రీఓపెన్ చేసింది. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత పరిస్థితులను ప్రభుత్వం గమనిస్తూ వచ్చింది. ఇప్పుడు మూడు వారాలు అవుతోంది. షాపులు రీఓపెన్ చేసినా ఇన్ ఫెక్షన్లు వేగవంతం కాలేదని ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, అంతా స్థిరంగా ఉందని, చాలా బాగుందని ప్రభుత్వం తెలిపింది. రోజువారీ ఇన్ ఫెక్షన్ల శాతం 0.2శాతం కన్నా తక్కువగా ఉందంది.

త్వరలో బార్లు, రెస్టారెంట్లు, హోటల్స్ రీఓపెన్:
ప్రభుత్వం మే 1 నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చింది. సెలూన్లు రీఓపెన్ చేశారు. రానున్న రోజుల్లో బార్లు, రెస్టారెంట్లు, మ్యూజియంలు, హోటల్స్ రీఓపెన్ చేయడానికి అనుమతులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

కరోనా సునామీగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదే:
కాగా, ప్రజలందరూ కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ప్రభుత్వం కోరింది. షాప్స్ కి వెళ్లినప్పుడు, పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రభుత్వ భవనాలకు వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని కోరింది. ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండాలంది. స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ చాలా ముఖ్యం అని స్పష్టం చేసింది.

కరోనా ఇన్ ఫెక్షన్ల సెకండ్ వేవ్ సునామీగా మాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆస్ట్రియాలో 15వేల 586మంది కరోనా బారిన పడ్డారు. 13వేల 462మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తందా 606 మంది కరోనాతో చనిపోయారు. కేసులు, మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో ఆస్ట్రియా ప్రభుత్వం సక్సెస్ అయింది.

Also Read | కరోనాను గెలిచేందుకు యాంటీబాడీలను సృష్టించిన సైంటిస్టులు