తండ్రి బాటలో కొడుకు, ఎరిక్ ట్రంప్ అసత్య ప్రచారాలు

  • Published By: madhu ,Published On : November 6, 2020 / 04:47 PM IST
తండ్రి బాటలో కొడుకు, ఎరిక్ ట్రంప్ అసత్య ప్రచారాలు

‘ballot’ burning video shared by Eric Trump : యథా రాజా తథా ప్రజా అన్నారు పెద్దలు. సేమ్ ఇదే వర్తిస్తుంది అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ కు. ప్రస్తుతం అక్కడ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మరోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్న ట్రంప్ కు చేదు ఫలితాలు వస్తున్నాయి. బైడెన్ విజయం దిశగా ముందుకు దూసుకపోతున్నారు.



ఈ క్రమంలో…ఓటమిని అంగీకరించలేని స్వభావాన్ని తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్నాడు ఎరిక్. ట్రంప్ లాగే అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. మీడియాతో ప్రత్యర్ధి బైడెన్‌పై ట్రంప్‌ అర్ధంలేని నిందలతో తన అసహనాన్ని చూపిస్తుంటే.. ఆయన కొడుకు సోషల్ మీడియాలో వీడియోలతో అబద్ధాలను ప్రచారం చేసే పనిలో పడ్డాడు.



ఎరిక్‌ రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఓ వీడియో ఫేక్ అని తేలిపోయింది. డోనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన 80 బ్యాలెట్ పేపర్లను ఎవరో తగలబెడుతున్నారంటూ.. ఎవరో నెటిజన్‌ చేసిన ట్వీట్‌ను ఎరిక్‌ ట్రంప్‌ రీట్వీట్ చేశాడు. అది పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. గంట వ్యవధిలోనే లక్షల వ్యూస్ వచ్చిపడ్డాయి. రిపబ్లికన్ మద్దతుదారులు ఇది నిజమేనంటూ రీట్వీట్ల వర్షం కురిపించారు.



ఎరిక్‌ ట్రంప్ పోస్ట్ చేసిన వీడియో గురించి తెలుసుకున్న వర్జీనియా ఎన్నికల అధికారులు.. ఆ వీడియోపై నిజాలు తెలుసుకునే పనిలో పడ్డారు. చివరికి అది ఒక ఫేక్ వీడియోగా తేల్చి పారేశారు. శాంపుల్ బ్యాలెట్ పేపర్లను.. అఫీషియల్ బ్యాలెట్ పేపర్లుగా చూపిస్తూ ఫేక్‌ వీడియోను క్రియెట్ చేసినట్లు అధికారులు కుండబద్దలు కొట్టారు.



ఫేక్‌ వీడియో పోస్ట్‌ చేసిన ఎరిక్‌ ట్రంప్‌పై సోషల్ మీడియాలో డెమోక్రాట్లు విరుచుకుపడ్డారు. ఫ్యామిలీ అంతా అబద్ధాలు ఆడుతూందంటూ చురకలంటించారు. మరోవైపు ట్వీట్ చేసిన వ్యక్తి అకౌంట్‌ను సస్పెండ్ చేసింది ట్విట్టర్‌.