ఆ మార్కెట్ కు హ్యాట్సాప్ చెప్పండి:‘ప్లాస్టిక్ వద్దు అరిటాకే ముద్దు’

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 11:18 AM IST
ఆ మార్కెట్ కు హ్యాట్సాప్ చెప్పండి:‘ప్లాస్టిక్ వద్దు అరిటాకే ముద్దు’

ప్లాస్టిక్..ప్లాస్టిక్..ప్లాస్టిక్..ఎక్కడ చూసిన ప్లాస్టిక్ మయంగా మారిపోతోంది. ఈ ప్లాస్టిక్ భూతం రోజు రోజుకు పర్యావరణాన్ని కబళించేస్తోంది. ఎక్కడకు వెళ్లినా అక్కడికే తిరిగి రావాలనేది పెద్దల సామెత. అందుకే ఎక్కడైతే మనిషి మొదలయ్యాడో అక్కడికే రావాల్సిన అవసరం ఉందన విషయం ప్రకృతి వైపరీత్యాలు మనిషిని హెచ్చరిస్తుంటుంది. దీన్ని పట్టించుకోకుంటే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారక తప్పదు. అందుకే ప్లాస్టిక్ వద్దు ..అరిటాకే ముద్దు అంటోంది థాయిలాండ్‌లోని ఓ సూపర్ మార్కెట్. 
 

ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. (ఆ ప్రయత్నాలు చిత్తశుద్దితో చేస్తున్నాయా అనేది మాత్రం ప్రశ్నార్థకమే) కానీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ముందడుగు వేయాల్సిందే. ఇదిగో అటువంటి ముందుగు వేసింది థాయిలాండ్‌లోని ఓ సూపర్ మార్కెట్. ఆ మార్కెట్ లో ఎక్కడా చిన్న ప్లాస్టిక్ కవర్ కూడా దొరకదు. అన్ని ప్యాకింగ్ కు అరటి ఆకుల్లోనే ప్యాకింగ్ చేసి ఉంటాయి. 

థాయిలాండ్‌లోని చియాంగ్ మైకి చెందిన ఆ సూపర్ మార్కెట్‌లో ప్లాస్టిక్ కవర్లకు బదులు అరటి ఆకులనే వినియోగిస్తున్నారు. కూరగాయలు, పళ్లు, నిత్యావసర వస్తువులన్నీ అరటి ఆకులో పెట్టి ప్యాక్ చేస్తారు. ఆ సూపర్ మార్కెట్‌కు వెళ్లే కస్టమర్లు కూడా సూపర్ మార్కెట్ ప్లాస్టిక్ భూతంపై చేస్తున్న యుద్ధానికి సలామ్ చేస్తున్నారు. సూపర్ మార్కెట్ యాజమాన్యాన్ని ప్రశంసిస్తున్నారు. కొంతమంది వాటి ఫోటోలు తీసి తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలను నచ్చిన నెటిజన్లు వావ్.. అంటున్నారు. పర్యావరణం కోసం ఆ సూపర్ మార్కెట్ చేస్తున్న కృషికి ఫిదా అయిపోతున్నారు. మంచి ఎవరు ఎప్పుడు ఎక్కడ చేసిన అభినందించాల్సిందే. మరి మనం కూడా చెప్పేద్దాం శతకోటి హ్యాట్సాఫ్ లు. హ్యాట్యాఫ్ టూ సూపర్ మార్కెట్.
 

భూమిమీద ఉండే  ప్రతీ ప్రాణి జీవించేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఇచ్చింది ప్రకృతి. అదే పర్యావరణం..కానీ సౌకర్యాలపేరుతో ప్లాస్టిక్ కు అలవాటు పడిన మనిషి పర్యావరణానికి తీవ్రమైన హానికలిగిస్తు సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడు. ప్లాస్టిక్ అనేది వెయ్యి సంవత్సరాలు అయినా కూడా నాశనం కాదు. భూమిలో పాతినా కూడా అది భూమిలో కొన్ని వేల ఏండ్ల వరకు అలా ఉంటుంది. ప్లాస్టిక్ వల్ల ఎన్నో సమస్యలు. దాన్ని కాల్చినా దాని నుంచి వచ్చే పొగ వల్ల వాయు కాలుష్యం. సముద్రంలో పడేస్తే సముద్ర జీవులను నష్టం.. ఇలా ప్లాస్టిక్‌ను ఎక్కడ పడేసినా.. దాని వల్ల పర్యావరణానికి నష్టమే తప్ప ఇసుమంతైనా లాభం లేదు. ఈ విషయాన్ని వారు వీరు అనకుండా ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకుని..పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటా ప్లాస్టిక్ ను వదలకుంటే మనిషి భారీ మూల్యం చెల్లించక తప్పదనే విషయాన్ని గుర్తుంచుకోండి. తస్మాత్ జాగ్రత్త!! ప్లాస్టిక్ భూతం మింగేస్తుంది!!!