ప్రతి పౌరుడు ఓ వీధి కుక్కను దత్తత తీసుకోవాలన్న ప్రధాని

ప్రతి ఒక్కరు ఒక వీధి కుక్కను దత్తత తీసుకోండి. ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించండి.

  • Published By: veegamteam ,Published On : February 22, 2020 / 07:25 AM IST
ప్రతి పౌరుడు ఓ వీధి కుక్కను దత్తత తీసుకోవాలన్న ప్రధాని

ప్రతి ఒక్కరు ఒక వీధి కుక్కను దత్తత తీసుకోండి. ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించండి.

వీధి కుక్కలను దత్తత తీసుకోవడం ఏంటి.. ప్రజలను దేశ ప్రధాని కోరడం ఏంటి.. విడ్డూరంగా ఉంది కదూ.. కానీ ఇది నిజం. అయితే మన దేశంలో కాదులెండి.. భూటాన్ లో జరిగింది. ప్రతి పౌరుడు ఓ వీధి కుక్కను దత్తత తీసుకోవాలని భూటాన్ దేశ ప్రధాని కోరారు. దీనికి కారణం లేకపోలేదు. భూటాన్ రాజు జిగ్ మే కేసర్ 40వ పుట్టిన రోజు జరుపుకున్నారు. రాజు పుట్టిన రోజు కానుకగా.. ప్రతి పౌరుడు ఓ వీధి కుక్కను దత్తత తీసుకోవడంతో పాటు మొక్కను నాటాలని ఆ దేశ ప్రధాని లోటే అడిగారు. థింపూలోని స్టేడియంలో రాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని లోటే చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

”ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. వీధి కుక్కల దత్తత అంశాన్ని ప్రస్తావించారు. ప్రతి ఒక్కరు ఒక వీధి కుక్కను దత్తత తీసుకోండి. ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించండి. ఇలా వ్యక్తిగత కమిట్ మెంట్స్.. మన రాజుకి ఇచ్చిన గొప్ప కానుక అవుతుంది. ఏడాది వ్యవధిలో ఆర్థిక, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తాము”అని ప్రధాని చెప్పారు.

ప్రధాని వినూత్న ఐడియాకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మానవత్వంతో బతకాలని అనుకుంటున్న వారికి ఇది ఆదర్శంగా ఉంటుందని అన్నారు. ప్రధాని కోరినట్టుగా వీధి కుక్కలను దత్తత తీసుకుంటామని చెప్పారు. మూగ జీవాల పట్ల ప్రేమ చూపించడం మనిషిగా మనందరి బాధ్యత అంటున్నారు. కాగా, భూటాన్ లో పదేళ్లుగా వీధి కుక్కల సమస్య ఎక్కువగా ఉంది. పదేళ్ల కాలంలో వీధి కుక్కల జనాభా విపరీతంగా పెరిగింది. వాటి జనాబా నియంత్రణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లాభం లేకుండా పోయింది.

1