నల్లగా ఉండేవారి జీవితాలు విలువైనవే.. 

  • Published By: vamsi ,Published On : June 2, 2020 / 08:31 AM IST
నల్లగా ఉండేవారి జీవితాలు విలువైనవే.. 

అప్పుడప్పుడు క్రికెట్లో జాతివివక్ష వ్యాఖ్యలు వినిపించే సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం న్యూజిలాండ్‌లో ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ జోఫ్రా ఆర్చర్‌పై గుర్తుతెలియని ప్రేక్షకుడు ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టించింది. వెంటనే కివీస్‌ బోర్డు, ప్రభుత్వం అతనిపై కఠిన చర్యలు తీసుకుని ఆర్చర్‌కు క్షమాపణలు చెప్పాయి. 

అయితే అప్పటితో ఆ వివాదం ముగిసిపోగా.. అమెరికాలో ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవడంతో ఒక్కసారిగా చెలరేగిన జాత్యాహంకార ఆరోపణలు.. ఇప్పుడు ప్రపంచంలోని నల్లజాతి వారు అందరినీ ఏకం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ నల్లజాతీయులకు సపోర్ట్‌గా ఓ సందేశాన్ని తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. 

కెరీర్‌లో చాలాసార్లు జాతివివక్షను ఎదుర్కొన్నానని, జాత్యహంకారం ఫుట్‌బాల్‌లో మాత్రమే కాదు.. క్రికెట్‌ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదని వెల్లడించాడు. ‘నల్లగా ఉన్నవారి జీవితాలు కూడా విలువైనవే’ (Black Lives Matter) ప్రచారానికి అతడు మద్దతు ప్రకటించాడు.

ఈ క్రమంలోనే అంతర్జాతీయ టీ20 లీగుల్లో ఇలాంటి పరిస్థితులు చవిచూశానని అన్నాడు.”నేను ప్రపంచమంతా తిరిగాను. జాతి వివక్షను ఎదుర్కొన్నాను. ఎందుకంటే నేను నలుపు కాబట్టి. కొన్నిసార్లు సొంత జట్టులోనే నాకు చివరి ప్రాధాన్యత లభించేది. అందుకు కారణం కూడా నలుపే. అయితే నలుపు చాలా శక్తివంతమైనది. నలుపుగా ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది” అని చెప్పాడు. 

‘ఇతరుల జీవితాల్లాగే నల్లవారి జీవితాలూ విలువైనవే. వారి జీవితాలకు ఓ అర్థముంది. జాత్యాహంకారులారా.. నల్లవారిని తక్కువ స్థాయివారిగా భావించడం ఆపేయండి. నల్లజాతి వారూ ఆత్మవిశ్వాసంతో ఉండండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఆపేయండి’ అని గేల్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Read:  టిక్‌టాక్ పక్కనపెట్టి స్టీవ్‌స్మిత్‌, ఇతర ఆస్ట్రేలియా ఆటగాళ్లతో డేవిడ్ వార్నర్ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు