బ్లడ్ టెస్టు చాలు.. మీపై కరోనా తీవ్రత ఎంత ఉందో చెప్పేస్తుంది!

  • Published By: sreehari ,Published On : July 1, 2020 / 10:18 PM IST
బ్లడ్ టెస్టు చాలు.. మీపై కరోనా తీవ్రత ఎంత ఉందో చెప్పేస్తుంది!

కరోనా వైరస్ తీవ్రత మీపై ఎంతగా ఉందో అంచనా వేయొచ్చు అంటోంది కొత్త అధ్యయనం.. కరోనా సోకిన వారికి వెంటిలేటర్ అవసరమా? లేదా అనేది ఈ ఒక్క బ్లడ్ టెస్టుతో తేలిపోతుందని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా శాస్త్రవేత్తల లేటెస్ట్ స్టడీ వెల్లడించింది. కరోనాకు కచ్చితమైన చికిత్స అందుబాటులో లేదు. కరోనా సోకిన వారిలో లక్షణాలను బట్టే చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరోవైపు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాయి. అయితే కరోనా సోకిన వారిలో ముందుగానే వైరస్ తీవ్రత ఎంతగా ఉందో అంచనా వేయవచ్చునని సైంటిస్టులు అంటున్నారు.

కరోనా రోగుల రక్తాన్ని పరీక్షించడం ద్వారా వెంటిలేటర్ అవసరం అవుతుందా లేదో ముందే పసిగట్టవచ్చనని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా సైంటిస్టుల లేటెస్ట్ స్టడీలో పేర్కొంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న రోగుల్లో సైటోకైన్ స్ట్రామ్ ప్రభావాన్ని గుర్తించవచ్చు. రక్తంలో నిర్ధిష్ట సైటోకైన్ల స్థాయిని గుర్తించి వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయవచ్చనని పరిశోధనలో పాల్గొన్న మయూరేష్ అభ్యాంకర్‌ తెలిపారు. మధుమేహం ఉన్నవారిలో కరోనా వైరస్ ఎందుకు ఎక్కువ తీవ్రత ఎక్కువగా ఉంటుందో ఈ తాజా పరిశోధనతో తేలిందని అంటున్నారు.

కరోనా సోకిన రోగుల్లో నిశిత పర్యవేక్షణ ద్వారా వారిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చునని అభిప్రాయపడ్డారు. సైటోకైన్లను గుర్తించడం ద్వారా వైద్యులు మెరుగైన చికిత్సా విధానాన్ని అవలంభించే అవకాశం ఉందన్నారు. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో కరోనా సోకి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 57మందిపై పరిశోధనలు నిర్వహించారు. కరోనావైరస్ నిర్ధారణ 48గంటల్లోపే రోగుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షించారు.

కరోనా తీవ్రత పెరగడానికి సైటోకైన్స్ ఎలా కారణం అవుతుందో తెలుసుకోవడానికి పరిశోధన అవసరమని సైంటిస్టులు చెబుతున్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఫ్లూ వస్తే.. సైటోకైన్ ప్రోటీన్ల ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. కరోనా సోకితే ఈ పెరుగుదల స్థాయి మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపారు. దీని ప్రభావంతో ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి ప్రాణాపాయానికి దారితీస్తున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.