Turkey Fitness Model : వస్త్రధారణ వల్ల విమానం దిగిపోయిన ఫిట్‌నెస్ మోడల్

Turkey Fitness Model : వస్త్రధారణ వల్ల విమానం దిగిపోయిన ఫిట్‌నెస్ మోడల్

Fitness Model Deniz Saypinar

Turkey Fitness Model : ఆడవాళ్ల వస్త్రధారణ ఎక్కడున్నా చర్చజరుగుతూనే ఉంటుంది. మంచి బట్టలు వేసుకున్నా… కురచ బట్టలువేసుకున్నా…. ఒంటికి అతుక్కుపోయేవి వేసుకున్నా అంతా చర్చనీయాంశమే. ప్రముఖ టర్కీ ఫిట్‌నెస్ మోడల్ దెనిజ్ సెపినర్(26)కు తన వస్త్రధారణతో విమానంలో చేదు అనుభవం ఎదురయ్యింది.

తన దేశంలో వివక్ష ఎదురవుతుందనే ఆమె వెస్ట్రన్ దేశాలను వలస వెళ్లింది. అక్కడ తనకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఊహించని రీతిలో అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.

టర్కీ నుంచి అమెరికా వెళ్లిన దెనిజ్ సెపినర్ ఫిట్‌నెస్‌ మోడల్‌గా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు సంపాదించుకుంది. ఇంటర్నేషనల్‌ గా గుర్తింపు దక్కించుకున్న మొదటి టర్కీ బాడీ బిల్డర్‌ కూడా ఈమెనే.

ఈ క్రమంలో బికినీ మోడలింగ్‌ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు జులై 8న మియామీ నుంచి టెక్సాస్‌కు విమానంలో బయలు దేరింది. అయితే ఫ్లైట్‌ ఎక్కిన కొద్దిసేపటికి విమాన సిబ్బంది ఒకరు వచ్చి.. ‘మీరు దిగిపోవాలి’ అని కోరాడు. అతడి మాటలు విని ఆమె అది జోక్‌గా అనుకుందిట. దీంతో ‘మీ బట్టలు బాగోలేవు. మీ వల్ల ఇందులో ఉన్న ఫ్యామిలీస్‌ ఇబ్బంది పడతాయి. దిగిపోండి’ అని మరోసారి చెప్పాడట.

కావాలంటే తన టీషర్ట్‌తో కాళ్లను కప్పేసుకుంటానని ఆమె చెప్పినప్పటికీ.. వినకుండా ‘మీరు నగ్నంగా ఉన్నారు. దిగిపోవాల్సిందేనంటూ ఆమెతో దురుసుగా వ్యవహరించారట. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకుని ఆమె వాపోయింది. ‘ఆ మాట వినగానే నాకు భయం వేసింది… వణికిపోయా… వాళ్లసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు… నేనేం నగ్నంగా లేను కదా… రాత్రంతా ఒంటరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఉండిపోయా. నా దేశంలో స్వేచ్ఛ లేదనే ఇక్కడికి వచ్చా… కానీ, ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు’ అంటూ కన్నీళ్లతో వీడియోను పోస్ట్‌ చేసింది దెనిజ్‌.

ఫైనల్ ట్విస్ట్‌ ఏంటంటే…
అయితే దెనిజ్‌ దుస్తులు మరీ బికినీ తరహాలో కురచగా ఉన్నాయని, అందుకే ఆమెను దించేశామని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ వివరణ ఇచ్చింది. ‘ఫ్లైట్స్‌లో వెళ్లేవాళ్లకు కొన్ని రూల్స్‌ ఉంటాయి. ఎలా పడితే అలా బట్టలు వేసుకొస్తే.. మిగిలిన ప్రయాణికులు ఇబ్బంది పడతారు కదా. ఆమె వేషధారణ అసభ్యంగా ఉందని మా సిబ్బంది ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె మా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో ఆమెను విమానం దించేయాల్సి వచ్చిందని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ స్పష్టం చేసింది. ఈ వివరణ చూసిన నెటిజన్లు ఆమెకే నెగెటివ్‌ కామెంట్లు పెడుతున్నారు. దీంతో తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను కాసేపు ప్రైవసీలో పెట్టేసిందామె.