వికటించిన చైనా కరోనా వ్యాక్సిన్…ట్రయిల్స్ నిలిపేసిన బ్రెజిల్

  • Published By: venkaiahnaidu ,Published On : November 10, 2020 / 05:51 PM IST
వికటించిన చైనా కరోనా వ్యాక్సిన్…ట్రయిల్స్ నిలిపేసిన బ్రెజిల్

Brazil suspends Chinese-made COVID-19 vaccine trials కరోనా వైరస్‌ నియంత్రణకు చైనా అభివృద్ధి చేసిన ‘కరోనావ్యాక్’ వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​ను బ్రెజిల్ ప్రభుత్వం నిలిపేసింది. వ్యాక్సిన్ వికటించడంతో ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రెజిల్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో దుష్ప్రభావాలు కనిపించాయని తెలిపింది.



మొదట బ్రెజిల్​ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారో వ్యాఖ్యలతో కరోనావ్యాక్ టీకాపై వివాదం చెలరేగింది. వ్యాక్సిన్ సామర్థ్యంపై బ్రెజిల్​ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారో అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో…వ్యాక్సిన్​ ప్రయోగాలు ప్రమాదకరమని ప్రకటిస్తూ బ్రెజిల్ ఆరోగ్య శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.



‘కరోనావ్యాక్’ వ్యాక్సిన్ ​ను చైనా ఫార్మా సంస్థ సినోవాక్ అభివృద్ధి చేసింది. దీనిని బ్రెజిల్​లో బూటానన్​ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. అయితే, బ్రెజిల్ ఆరోగ్య శాఖ ప్రకటనపై బూటానన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ విషయంపై మంగళవారం మీడియా సమావేశం నిర్వహిస్తామని తెలిపింది.



కాగా, చైనా.. వ్యాక్సిన్ కోసంచేస్తోన్న ప్రయోగాల్లో ఇలా జరగటం ఇదే మొదటిసారి. వ్యాక్సిన్ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు బ్రెజిల్‌ కు చెందిన బయోమెడికల్ పరిశోధనా కేంద్రం బుటాంటన్‌ ఇన్‌స్టిట్యూట్‌ గత నెలలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇంతలోనే ఆ వ్యాక్సిన్ వికటించడం గమనార్హం.

అతి త్వరగా వ్యాక్సిన్‌ కనుగొనే ప్రయత్నాలను చైనా కొనసాగిస్తోంది. ఎన్నో నియమాలను సడలించి మరీ వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాతో పాటు పలు దేశాల వ్యాక్సిన్లు వికటిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.