Brazil : కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ కొనుగోలు ఒప్పందం రద్దు చేసిన బ్రెజిల్

కోవాగ్జిన్‌ (Covaxin) వ్యాక్సిన్ల కోసం భారత్‌ బయోటెక్ కంపెనీతో బ్రెజిల్‌ సర్కార్‌ కుదుర్చుకున్న ఒప్పందం రద్దయ్యింది. ఈ ఒప్పందంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సనారో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. దీంతో బ్రెజిల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్‌ దర్యాప్తు చేపట్టారు.

Brazil : కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ కొనుగోలు ఒప్పందం రద్దు చేసిన బ్రెజిల్

Brazil

Covaxin Deal : కోవాగ్జిన్‌ (Covaxin) వ్యాక్సిన్ల కోసం భారత్‌ బయోటెక్ కంపెనీతో బ్రెజిల్‌ సర్కార్‌ కుదుర్చుకున్న ఒప్పందం రద్దయ్యింది. ఈ ఒప్పందంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సనారో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. దీంతో బ్రెజిల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్‌ దర్యాప్తు చేపట్టారు. బ్రెజిల్‌ వ్యాక్సినేషన్‌ కోసం భారత్‌ బయోటెక్‌ సంస్థంతో ఫిబ్రవరిలోనే 324 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. 20 మిలియన్ల డోసులకు కుదుర్చుకున్న ఒప్పందం బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారోకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈ ఒప్పందంలో నియమ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు వినిపించాయి.

కోవాగ్జిన్ (Covaxin) టీకా కోసం ఎక్కుద ధర కోట్ చేయడానికి తోడు..అప్పటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, బ్రెజిల్‌ ఆరోగ్య నియంత్రణ సంస్థ అనుమతులు పొందని సంస్థతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకునేందుకు అత్యుత్సాహం కనబర్చారనే అనుమానాలు రేకెత్తాయి. దీనిపై ఇటీవలకాలంలో వివాదం చెలరేగడంతో వ్యాక్సిన్‌ కొనుగోలు కాంట్రాక్ట్‌ రద్దు చేసుకున్నట్లు బ్రెజిల్‌ హెల్త్ మినిస్టర్ మార్సెలో క్వీరోగా ప్రకటించారు. ఫెడరల్‌ కంప్ట్రోలర్‌ మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతుందన్నారు. కోవాగ్జిన్‌ డీల్‌లో బ్రెజిల్‌ అధ్యక్షుడు పాత్రపై నీలినీడలు కమ్ముకోవడంతో ఆ దేశ పార్లమెంటరీ కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ ప్రధానంగా దృష్టి పెట్టింది. దీన్నో కుంభకోణంగా సెనేటర్లు అనుమానిస్తున్నారు.

బొల్సనారో తన సన్నిహితులకు లబ్ధిచేకూర్చేలా లావాదేవీలు చేశారని ఆరోపణలున్నాయి. ఫైజర్‌, సినోవాక్‌ను కాదని కోవాగ్జిన్‌ కోసం ఎందుకు అత్యుత్సాహం కనబర్చారని ఆరోగ్యరంగ నిపుణులు, సెనేటర్లు ప్రశ్నించారు. రెండు కోట్ల టీకాలకు ఆర్డర్‌ ఇస్తే డెలివరీ కాకపోవడం కూడా బొల్సనారోను ఇరకాటంలో పడేసింది. వాక్సిన్‌ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు లేవంటోంది బ్రెజిల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ. వరుస ఆరోపణలు.. దర్యాప్తులో ఆరోగ్య శాఖ మరింత లోతైన విశ్లేషణ కోసమే డీల్‌ను నిలిపివేసినట్లు చెబుతోంది. డీల్‌లో ఎలాంటి కుంభకోణం జరగలేదని, తన పాత్రేమీ లేదని అధ్యక్షుడు బొల్సనారో ముందునుంచి వాదిస్తూ వస్తున్నారు.