బైడెన్ 100 డేస్ యాక్షన్ ప్లాన్

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 12:07 PM IST
బైడెన్ 100 డేస్ యాక్షన్ ప్లాన్

Busy Agenda For Joe Biden’s First 100 Days : అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ తన 100 డేస్‌ యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించారు. ఎన్నికల ప్రచారంలోనే తాను అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టే కార్యక్రమాలను ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే పనిచేస్తానని బైడెన్‌ ప్రకటించారు. అధికారంలోకి రాగానే కరోనా వైరస్‌, వాతావరణ మార్పు, వలస విధానంపై చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే తమ బృందం పనిచేస్తుందన్నారు బైడెన్.



కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి టెస్టింగ్‌లను పెంచడం, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ ఉత్పత్తులను పెంచడం, అమెరికన్లందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించడం లాంటి లక్ష్యాలను నిర్ధేశించుకున్నారు. దీనికి సంబంధించి నేషనల్ స్ట్రాటజీని రూపొందిస్తున్నామన్నారు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నుంచి వైదొలగాలని ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని కూడా బైడెన్ రద్దు చేయనున్నారు.



అమెరికాలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని తగ్గించడానికి లక్షలాది ఉద్యోగాలను సృష్టించడానికి బిల్డ్‌ బాక్‌ బెటర్‌ స్ట్రాటజీని రూపొందించనున్నారు బైడెన్‌. దీనికి కావాల్సిన 700 మిలియన్‌ డాలర్ల నిధులను సంపన్నులు, కార్పొరేట్‌ కంపెనీల నుంచి పన్నుల రూపంలో వసూలు చేయనున్నారు.. ఇక వాతావరణం విషయంలో పారిస్‌ క్లైమెట్‌ అగ్రిమెంట్‌లో మళ్లీ అమెరికా చేరనుంది. క్లీన్‌ ఎనర్జీ రివల్యూషన్‌ పేరుతో 2 ట్రిలియన్‌ డాలర్ల క్లైమెట్‌ చేంజ్ ప్లాన్‌ను కూడా అమల్లోకి తీసుకురానున్నారు. మొదటి వంద రోజులు ఈ అంశాలపై బిజిగా గడపనున్నారు .. కొత్త అధ్యక్షుడు జో బైడెన్.