Mask Fine : మాస్కు ధరిస్తే జరిమానా, ఆ కేఫ్‌లో వింత నిబంధన

మాస్కు ధరిస్తే ఫైన్ విధించే నిబంధన చూశారా? కనీసం విన్నారా? కానీ, అక్కడ అలానే జరిమానా విధిస్తున్నారు.

Mask Fine : మాస్కు ధరిస్తే జరిమానా, ఆ కేఫ్‌లో వింత నిబంధన

Mask Fine

Mask Fine : కరోనావైరస్ మహమ్మారి ముప్పుగా మారింది. ప్రాణాలు తీస్తోంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగలేదు. ఈ పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా మాస్కు ధరించడం తప్పనిసరి అయింది. ఈ మేరకు ప్రభుత్వాలు రూల్ కూడా తెచ్చాయి. మాస్క్ ధరించకుంటే మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు జరిమానాలు విధిస్తున్నాయి. కాగా.. మాస్కు ధరిస్తే ఫైన్ విధించే నిబంధన చూశారా? కనీసం విన్నారా? కానీ, అక్కడ అలానే జరిమానా విధిస్తున్నారు.

అమెరికా దేశంలోని కాలిఫోర్నియాలో ఫిడిల్‌హెడ్స్ కేఫ్ విస్తుపోయే నిబంధన అమలు చేస్తోంది. మాస్క్ ధరించి వచ్చే కస్టమర్లకు జరిమానా వేస్తోంది. బిల్లుపై అదనంగా 5 డాలర్లు వడ్డిస్తోంది. అంతేకాదు.. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాం అని గొప్పగా చెప్పుకోవడం కూడా తప్పే. అలాంటి వారికి కూడా ఫైన్ వేస్తారు.

నిజానికి అమెరికాలో మాస్క్ ధరించడం తప్పనిసరి కాకున్నా ముందుజాగ్రత్త చర్యగా కొందరు, భయంతో మరికొందరు మాస్కులు ధరిస్తున్నారు. చాలామంది వినియోగదారులు జరిమానా చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు కానీ, మాస్క్‌ తీసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. కాగా, ఇలా జరిమానాల రూపంలో వసూలైన మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు అందిస్తామని కేఫ్ యజమాని క్రిస్ కాస్టిల్‌మ్యాన్ తెలిపారు.

ఈ కేఫ్ కు వచ్చే కస్టమర్లలో చాలామంది.. ఈ నిబంధనను స్వాగతిస్తున్నారు. జరిమానా చెల్లించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జరిమానా రూపంలో తామిచ్చే డబ్బు అలా అయినా స్వచ్చంద సంస్థలకు చేరుతుందని, నిస్సహాయులకు ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఫిడిల్‌హెడ్స్ కేఫ్.. గతంలోనూ ఇలాంటి వింత నిబంధనలు తెచ్చి వార్తల్లోకి ఎక్కింది. ”మీ మాస్కుని చెత్త డబ్బాలో పడేయండి, మీ బిల్లులో 50శాతం రాయితీ పొందండి” అని గతంలో ఆఫర్ ఇచ్చింది.

దేశ జనాభాలో సగం మందికిపైగా టీకాలు వేయడం, పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని అమెరికా వంటి దేశాలు ప్రకటించాయి. పలు దేశాల్లో ప్రజలు ఇంతకుముందులానే వీధుల్లో స్వేచ్చగా తిరుగుతున్నారు.