Corona Currency Notes : కరెన్సీ నోట్లతో కరోనా వ్యాప్తి? ఊరటనిచ్చే విషయం తెలిపిన పరిశోధకులు

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా? అసలు నాణేలు, నోట్లపై వైరస్ ఎంతకాలం బతుకుతుంది? ఈ సందేహాలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Corona Currency Notes : కరెన్సీ నోట్లతో కరోనా వ్యాప్తి? ఊరటనిచ్చే విషయం తెలిపిన పరిశోధకులు

Corona Currency Notes

Corona Currency Notes : కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా? అసలు నాణేలు, నోట్లపై వైరస్ ఎంతకాలం బతుకుతుంది? కరోనా మొదలైనప్పటి నుంచి ఈ సందేహాలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరోనా తొలి వేవ్‌ రోజుల్లో ఏది ముట్టుకున్నా కొవిడ్ భయం ఉండేది. అందులో కరెన్సీ ఒకటి. కరెన్సీ నోటు, కాయిన్స్‌ ముట్టుకుంటే అవతలి వ్యక్తి నుంచి కరోనా సోకుతుందేమో అని భయపడే వారు. దీనిపై అప్పటినుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి అంశంపై జర్మన్ శాస్త్రవేత్తలు స్పష్టత ఇచ్చారు. జనాలకు ఊరటనిచ్చే విషయాలు తెలిపారు. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తితో పాటు నాణేలు, నోట్లపై వైరస్ ఎంతకాలం బతుకుతుంది అనే దానిపై జర్మనీకి చెందిన ఒక సంస్థ పరిశోధన నిర్వహించింది. ఈ పరిశోధనలో ఆసక్తికర, ఊరటనిచ్చే అంశాలు వెలుగుచూశాయి.

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి ప్రత్యేక పద్ధతి ఎంచుకున్నారు. కరెన్సీ నోట్లతో కొవిడ్‌ 19 ఇన్ఫెక్షన్‌ పూర్తిగా రాదని చెప్పలేమని, అయితే దాని తీవ్రత, అవకాశం తక్కువగా ఉందటుందని తేల్చారు. జర్మనీలోని ఆర్‌యూహెచ్‌ఆర్‌ బోచుమ్‌ వర్సిటీ, యురోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్ నిపుణులు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారు. ఆ నివేదికను జర్నల్‌ ఐ సైన్స్‌లో ప్రచురించారు.

ఈ పరిశోధన కోసం కొన్ని రోజులపాటు యూరో కాయిన్స్‌, బ్యాంక్‌ నోట్ల మీద రకరకాల ద్రావణాలతో పరీక్షలు నిర్వహించారు. అందులో కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ కారకాలు పెద్దగా కనిపించలేదట. ఈ పరీక్ష సమయంలో పరిశోధకులు ఆ నోట్లు,కాయిన్స్‌ను స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఉపరితలం మీద పెట్టారట. ఈ క్రమంలో సర్ఫేస్‌ మీద పది రోజులు ఉన్న కరోనా వైరస్‌ కారకాలు, నోట్ల మీద మూడు రోజుల్లోనే పోయాయని తేల్చారు. అదే కాయిన్ల మీద అయితే గరిష్ఠంగా ఆరు రోజులు ఉన్నాయట.

10 సెంట్ల కాయిన్‌ మీద ఆరు రోజులు, ఒక యూరో కాయిన్‌ మీద రెండు రోజులు, ఐదు సెంట్ల కాయిన్‌ మీద గంటసేపు మాత్రమే కరోనా వైరస్‌ కారకాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఐదు సెంట్ల కాయిన్‌ కాపర్‌తో చేయడం వల్లే అంత త్వరగా కరోనా వైరస్‌ కారకం పోయిందని తెలిపారు. మొత్తంగా కరెన్సీ నోట్లతో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంతవరకు డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించుకోవడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.