School Condoms : 5వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కండోమ్స్, కొత్త సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీపై తీవ్ర విమర్శలు

అమెరికాలోని చికాగో పబ్లిక్ స్కూల్స్ కు చెందిన ఎడ్యుకేషన్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. తల్లిదండ్రుల ఆగ్రహానికి గురైంది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

School Condoms : 5వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కండోమ్స్, కొత్త సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీపై తీవ్ర విమర్శలు

School Condoms

School Condoms: అమెరికాలోని చికాగో పబ్లిక్ స్కూల్స్ కు చెందిన ఎడ్యుకేషన్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. తల్లిదండ్రుల ఆగ్రహానికి గురైంది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చికాగోలోని పబ్లిక్ స్కూల్స్‌లో ఐదు, ఆపై తరగతుల విద్యార్థులకు ‘కండోమ్స్’ను అందుబాటులో ఉంచాలని బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఈ మేరకు బోర్డు పరిధిలోని 600 పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. చికాగో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ సహకారంతో కండోమ్స్‌ను పాఠశాలలకు ఉచితంగా సరఫరా చేయనున్నారు.

ఒకవేళ కండోమ్స్ అయిపోతే ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారమిచ్చి స్కూల్లే తెప్పించుకోవాల్సి ఉంటుంది. గత డిసెంబర్ లో చికాగో పబ్లిక్ స్కూల్స్‌ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఈ పాలసీని రూపొందించింది. ఈ విధానం ప్రకారం.. ప్రాథమిక పాఠశాలల్లో 250 వరకు, ఉన్నత పాఠశాలల్లో 1,000 వరకు కండోమ్స్‌ను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. విద్యార్థుల్లో లైంగిక వ్యాధులపై అవగాహన, అవాంఛిత గర్భాలను నిరోధించేందుకే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు సీపీఎస్ బోర్డు అధికారులు వివరించారు.

”ఈ పాలసీ వివాదాస్పదమైనప్పటికీ విద్యార్థుల ఆరోగ్య రీత్యా ఇది అవసరం. సమాజం చాలా మార్పులకు గురైంది. విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచకుండా సరైన జాగ్రత్తలు చెప్పకపోతే వారికి చెడు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యకర నిర్ణయాలు తీసుకుని.. కచ్చితమైన, స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకునే హక్కు యువతకు ఉంది. తద్వారా వారితో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారు” అని సీపీఎస్ అధికారి డాక్టర్ కెన్నెత్ అన్నారు.

సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా విద్యార్థులకు ‘ఆరోగ్యకర సంబంధాలు- సమ్మతి, శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం, కౌమార యుక్త వయసులో చోటు చేసుకునే భౌతిక మార్పులు, లైంగిక ధోరణులు, లైంగిక ఆరోగ్యం…’ తదితర అంశాలను బోధించనున్నారు. ఒకవేళ వీటిపై తల్లిదండ్రులకు అభ్యంతరం ఉంటే లిఖితపూర్వకంగా బోర్డుకు లేదా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయవచ్చు.

5వ తరగతి నుంచే విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచాలన్న పాలసీని కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదో తరగతి అంటే కేవలం 10 నుంచి 12 ఏళ్ల వయసు ఉంటుంది…చిన్నపిల్లలకు కండోమ్స్ ఇవ్వడమేంటని మండిపడుతున్నారు. ఇది సరైన నిర్ణయం కాదని… దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు.

తల్లిదండ్రుల వెర్షన్ ఇలా ఉంటే.. చికాగో విమెన్ హెల్త్ సెంటర్ డైరెక్టర్ స్కౌట్ బ్రాట్ మరో విధంగా స్పందించారు. నిజానికి ఈ పాలసీ ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. మొత్తంగా 5వ తరగతి నుంచే విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచాలన్న పాలసీ పెను దుమారం రేపుతోంది.