దెబ్బకు స్వరం మార్చిన చైనా..శత్రువులుగా కాదు మిత్రులుగా ఉండాలంటూ కొత్త పాట

  • Published By: venkaiahnaidu ,Published On : July 10, 2020 / 08:43 PM IST
దెబ్బకు స్వరం మార్చిన చైనా..శత్రువులుగా కాదు మిత్రులుగా ఉండాలంటూ కొత్త పాట

గతనెలలో జరిగిన గల్వాన్ ఘర్షణ అనంతరం భారత్ తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో డ్రాగన్ తోకముడిచినట్లు కనిపిస్తోంది. చైనాకు చెందిన 59 యాప్‌లపై విధించడం, ఆర్థిక మూలాలపై ప్రభావం చూపే పలు చర్యలకు భారత్ సిద్ధమవడంతో కమ్యూనిస్ట్ దేశం కాళ్ల బేరాలకు వచ్చింది. భారత్ తమకు మిత్ర దేశమేనని.. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని నీతి సూత్రాలు వల్లె వేస్తోంది. భారత్‌లో చైనా రాయబారి సన్ వీడాంగ్ శుక్రవారం (జులై 10) చేసిన వ్యాఖ్యలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.

భారత్‌-చైనాలు ప్రత్యర్థులుగా కాకుండా ఎల్లప్పుడూ భాగస్వాములుగా ఉండాలని చైనా రాయబారి సన్ వీడాంగ్ అభిప్రాయపడ్డారు. సరిహద్దు వివాదంపై కూడా ఇరు దేశాలు శాంతియుతంగా చర్చించుకుని ఓ కచ్చితమైన నిర్ణయానికి రావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు చైనా రాయబార కార్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలను చక్కబెట్టడంపై ఆయన ప్రసంగించారు.

చైనా-భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం బాధాకరమని, ఇరు దేశాలు శాంతిగా మెలగాలని కోరారు. భారత్-చైనా సంబంధాలను తిరిగి గాడిన పెట్టడానికి చర్చలు జరుపతున్నామని వీడాంగ్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు త్వరలోనే మెరుగు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గల్వాన్ లోయలో ఇటీవల నెలకొన్న పరిస్థితులు మళ్లీ నెలకొనకుండా ఇరుదేశాలు కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో శాంతియుతంగా ఉండాలని, చైనా అదే కోరుకుంటోందని, భారత్ కూడా అందుకు సహకరించాలని పేర్కొన్నారు. భారత్-చైనాలు పరస్పరం యుద్ధం చేస్తే అది శత్రవులకు బలాన్ని చేకూరుస్తుందని, పక్కనున్న చిన్న చిన్న దేశాలకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంత గాడి తప్పాయని, అయితే పరిస్థితులు త్వరలో చక్కబడతాయన్న నమ్మకం తమకుందని అయన అన్నారు.

ఇండియా-చైనా శత్రువులు కాదని.. చిరకాల మిత్రులని వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని అన్నారు. భేదాభిప్రాయాలను పక్కనబెట్టి స్థిరమైన, సుదీర్ఘమైన సంబంధాల కోసం ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని వీడాంగ్ పేర్కొన్నారు. ఇండియా, చైనా ఒకరినొకరు సానుకూల దృక్పథంతోనే చూస్తున్నాయని చెప్పుకొచ్చారు. సంఘర్షణల్లో పడకుండా.. సమస్యను సరైన దారిలో పరిష్కరించుకోగలిగే సత్తా, పరిజ్ఞానం ఇరుదేశాలకూ ఉన్నాయని చెప్పారు. పరస్పర సహకారం ఇరు దేశాలకూ లబ్ధి చేకూరుస్తుందన్నారు. ఒకరికొకరు నొచ్చుకునే చర్యలకు దిగితే ఇరు దేశాలూ ఆర్థికంగా, వాణిజ్య పరంగా నష్టపోయే ప్రమాదం ఉందని వీడాంగ్ అభిప్రాయపడ్డారు.