China Pakistan : తాలిబన్లను చేరదీయడం వెనుక చైనా, పాకిస్తాన్ ప్లానేంటి ?

అమెరికా ఇలా ఎగ్జిట్‌ అయిందో లేదో చైనా అలా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా శత్రువుతో డ్రాగన్‌కు స్నేహం కుదిరింది. అటు మరో కుట్రదారు పాక్‌ కూడా తాలిబన్‌లకు బహిరంగంగానే మద్దతు పలుకుతోంది.

10TV Telugu News

China Pakistan : అమెరికా ఇలా ఎగ్జిట్‌ అయిందో లేదో చైనా అలా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా శత్రువుతో డ్రాగన్‌కు స్నేహం కుదిరింది. అటు మరో కుట్రదారు పాక్‌ కూడా తాలిబన్‌లకు బహిరంగంగానే మద్దతు పలుకుతోంది. తాలిబన్లను మిలిటెంట్లుగా చూడొద్దని… వాళ్లుకూడా సాధారణ పౌరులేనని స్టేట్‌మెంట్‌లు ఇస్తోంది. రావణకాష్టంగా మారిన దేశంలో శాంతి స్థాపన జరగాలని దేశాలన్నీ కోరుకుంటుంటే… చైనా, పాక్‌ మాత్రం అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. తాలిబన్లను మానవతావాదులుగా చిత్రీకరిస్తున్నాయి.

ఆసియాలోనే అత్యంత వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది అఫ్ఘానిస్తాన్‌. ఆసియాలోని వాణిజ్య రవాణాకు ఈ దేశమే ప్రధాన కేంద్రం. అంతేకాదు భౌగోళికంగా సెంట్రల్‌ దక్షిణాసియా దేశాల మధ్య మినరల్స్‌, ఖనిజ సంపద ఉన్న దేశం. మొన్నటి వరకు అగ్రరాజ్యం అమెరికా అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినా.. ఇప్పుడు చైనా తాలిబన్లకు స్నేహ హస్తం అందించినా.. వీటన్నింటి వెనక ఇదే అసలు సిసలు కారణం. ఆ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఖనిజ సంపదను సొంతం చేసుకోవాలన్నదే ఈ దేశాల వ్యూహం. అమెరికా ప్లాన్‌ A వర్కవుట్‌ కాలేదు. అందుకే ఇప్పుడు చైనా ప్లాన్‌ Bతో అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో తాలిబన్లతో తమకు ముప్పు వాటిల్లకుండా చూసుకుంటూనే.. అక్కడి ఖనిజ సంపద, ఇతర వనరులను దోచుకునేందుకు స్కెచ్‌ వేస్తోంది. ఇప్పుడు సడన్‌గా తాలిబన్లను చేరదీయడం వెనుక అసలు కారణం ఇదే !

బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌, చైనా పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ఈ రెండు ప్రాజెక్ట్‌లను డ్రాగన్‌ కీలకంగా చూస్తోంది. ఐతే ఇప్పటికప్పుడు అఫ్ఘాన్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు చైనా తొందర పడడం లేదు. ఆ దేశంలో సంక్షోభం ముగిసిపోయి పూర్తిగా అధికారం తాలిబన్ల చేతుల్లోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టే అవకాశం కన్పిస్తోంది. ఇదంతా దీర్ఘకాలిక ప్రణాళికలో భాగం. 2000 సంవత్సరం ఆరంభం నుంచి చైనా కొన్ని ప్రాజెక్ట్‌లపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ముఖ్యంగా ఆసియాలో తమ ప్రాబల్యం పెంచుకునేందుకు పాక్ సహా పలు దేశాల్లో రోడ్లు, ఇతర ప్రాజెక్ట్‌ల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టింది. ఇప్పుడు అఫ్ఘాన్‌లోని సహజ వనరులపై చైనా కన్ను పడింది. ఆ దేశం నుంచి అమెరికా వెనుదిరగడం చైనాకు బాగా కలిసొచ్చింది.

ఇప్పుడు అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే పనిలో పడింది. జిన్జియాంగ్‌ ప్రావెన్స్‌ను అభివృద్ధి చేయడానికి పాక్‌ ద్వారా ఆర్థిక ప్రోత్సహాకాలు పెంచడానికి చైనా పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌ను బాగా ఉపయోగపడుతుంది. ఐతే అఫ్ఘాన్‌ విషయంలో అమెరికాలా తప్పు చేయాలని చైనా అనుకోవడం లేదు. కేవలం తన స్వప్రయోజనాలు మాత్రమే చూసుకోవాలనుకుంటోంది. ఆ దేశం రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చాలని అనుకోవడం లేదు. అఫ్ఘాన్‌లో ఇస్లామిక్‌ శక్తులను ప్రోత్సహించడం మొదలుకొని స్థిరమైన పెట్టుబడులు పెట్టడం, రాజకీయ సంక్షోభం నుంచి ప్రయోజనాలు పొందడం ఆ దేశాన్ని తమకు వ్యూహాత్మక భూమిగా మార్చుకోవడం.. ఇలా చైనా మదిలో చాలా ప్లాన్లే ఉన్నాయి.

ఇక మరో కుట్రదారు పాకిస్తాన్‌. ఈ దేశానికి అమెరికా, చైనాకు ఉన్నన్ని తెలివితేటలు లేవు. ఎప్పుడూ పక్క దేశాలపై పడి ఏడ్వడం తప్ప పాక్‌ నేతలకు మరేం తెలియదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం తప్ప దేశాన్ని అభివృద్ధి చేసుకోవడం అస్సలు తెలియదు. అలాంటి ఉగ్రవాదుల చేతిలో చాలా సార్లు చావుదెబ్బలు తిన్నా పాక్‌కు బుద్ధి రాలేదు. ఇంకా అదే ఉగ్రవాదాన్ని పట్టుకుని వేలాడుతూ భారత్‌ను ఇబ్బందుల పాలు చేయాలని కుట్రలు పన్నుతోంది. ఇప్పుడు పాక్‌కు తాలిబన్ల రూపంలో మరో అవకాశం దొరికింది. నిజానికి తాలిబన్ల మూలాలు పాక్‌లోనే ఉన్నాయి.

సరిహద్దుల్లో అఫ్ఘాన్‌ ప్రభుత్వ దళాలకు వ్యతిరేకంగా పాక్‌ సైన్యం అడుగులు వేస్తోంది. తాలిబన్లకు మద్దతు పలుకుతూ అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తోంది. పాక్‌ సైన్యం తాలిబన్లకు సహకరిస్తోందని అఫ్ఘాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ఆరోపించారు. సరిహద్దు ప్రాంతమైన స్పిన్‌ బొల్డాక్‌లో తాలిబన్లపై దాడులకు దిగితే ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్థాన్‌ వైమానిక దళం హెచ్చరిస్తోందని అన్నారు. దానికి బలాన్నిచేకూర్చేలా పాక్‌ ప్రధాని వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

తాలిబన్లకు పాక్ ఆర్థిక సాయం చేస్తోందా అని ఓ అమెరికన్‌ న్యూస్‌ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు తడబడుతూనే కొన్ని అబద్ధాలు మరికొన్ని నిజాలు చెప్పేశారు. పాక్‌ ప్రభుత్వం తాలిబన్లకు సాయం చేస్తుందన్నది వట్టి ఆరోపణలు మాత్రమేనని.. దమ్ముంటే తమపై ఆరోపణలు చేసిన వాళ్లు అవి నిరూపించాలని అన్నారు. పాక్‌లో సుమారుగా 30 లక్షల మంది అఫ్ఘాన్‌ శరణార్థులు ఉన్నారని అన్నారు. తాలిబన్లను మిలిటెంట్లుగా చూడొద్దని… వారు కూడా సాధారణ పౌరులేనంటూ… ఆఖర్లో ఇమ్రాన్‌ తన మనసులో మాటను బయటపెట్టారు. అఫ్ఘాన్‌లో మారణహోమం సృష్టిస్తున్న రాక్షసులను సాధారణ పౌరులతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్‌ అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. దీనికీ చైనాతో పాకిస్తాన్ ఉన్న దోస్తీనే కారణమన్న వాదన వినిపిస్తోంది.

10TV Telugu News