అవినీతి తిమింగళం : చైనా కమ్యూనిస్టు పార్టీ నేత ఇంట్లో 13.5 టన్నుల బంగారం

  • Edited By: madhu , October 3, 2019 / 03:21 AM IST
అవినీతి తిమింగళం : చైనా కమ్యూనిస్టు పార్టీ నేత ఇంట్లో 13.5 టన్నుల బంగారం

చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్లు అవుతోంది. అక్టోబర్ 1న ఆ దేశం ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు జరుపుకొంది. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ నేత అవినీతి బయపటడడం సంచలనం సృష్టిస్తోంది. ఇతని వద్ద బయటపడిన అవినీతి, అక్రమాలు చూసి కళ్లు బైర్లు కమ్ముతున్నాయంట. రూ. 4 వేల 500 కోట్ల విలువైన 13.5 టన్నుల బంగారం, రూ. 2.65 లక్షల కోట్లు..విలువైన సంపదను గుర్తించారు అక్కడి అవినీతి నిరోధక శాఖ అధికారులు. 

చైనాలో ఉన్నతాధికారి, కమ్యూనిస్టు నేత జాంగ్ కీ (58) నివాసంలో ఇటీవలే అవినీతి అధికారులు సోదాలు జరిపారు. టన్నుల కొద్ది బంగారం బిస్కెట్లు కుప్పలు కుప్పలుగా బయటపడ్డాయి. గుట్టల కొద్దీ బంగారాన్ని పోగేశాడు. కిలోలు కాదు క్వింటాళ్లు కాదు.. టన్నుల కొద్దీ గోల్డ్‌ను దాచేశాడు. ఇందుకోసం తన నివాసంలో ఓ నేలమాళిగనే నిర్మించాడు. ఎవరికీ తెలియకుండా దాచిన ఈ భారీ బంగారం గుట్టు గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంట్లో తనిఖీలు చేయడంతో వారి కళ్లు బైర్లు కమ్మాయి.

బంగారాన్ని తూకం వేసిన అధికారులు ఆ మొత్తాన్ని ఏకంగా 13.5 టన్నులుగా తేల్చారు. దీనివిలువ చైనా కరెన్సీలో 268 బిలియన్ యువాన్లుగా నిర్ధారించారు. బ్యాంకు ఖాతాను సోదా చేశారు. రూ. 2.65 లక్షల కోట్ల అవినీతి సొమ్ము బయటపడింది. లంచం కింద విలాసవంతమైన విల్లాలను పలువురు నుంచి భారీగా తీసుకున్నట్లు గుర్తించారు. బంగారాన్ని వ్యక్తి లెక్కిస్తున్న ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది. దీనిని చైనా బ్యాన్ చేసింది. 

తూర్పు చైనాలో జాంగ్ జన్మించారు. 1983లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. మైవాన్ ప్రావిన్స్‌లోని సాన్యా సిటీ డిప్యూటి మేయర్‌గా, డాంగ్జో సిటీ మేయర్‌గా పనిచేశారు. పార్టీ హైకో సిటీ సెక్రటరీగా పనిచేశారు. 2012లో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అధికారంలోకి వచ్చాక..అవినీతికి వ్యతిరేకంగా కఠిన చట్టాలు తీసుకొచ్చారు. దీంతో అవినీతి పరుల భరతం పడుతున్నారు అధికారులు. గత ఏడు సంవత్సరాలుగా అవినీతికి పాల్పడిన 53 మంది అధికారులు పట్టుబడ్డారు. జాంగ్‌తో పాటు 17 మంది అవినీతి పరులను పట్టుకున్నారు. 
Read More : ఏ నేరం చేసిందో : పక్షిని అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టిన పోలీసులు