China Taliban : తాలిబన్లతో చైనా దోస్తీ

చైనా బుద్ధిలో ఏమాత్రం మార్పులేదు. అదే జిత్తులమారితనం, అదే కుట్రకోణం. అఫ్ఘాన్‌లో తాలిబన్ల రాక్షసకాండను ప్రపంచమంతా వ్యతిరేకిస్తుంటే... డ్రాగన్‌ మాత్రం భేష్‌ - శభాష్‌ అంటోంది.

China Taliban : తాలిబన్లతో చైనా దోస్తీ

China

China Taliban : చైనా బుద్ధిలో ఏమాత్రం మార్పులేదు. అదే జిత్తులమారితనం, అదే కుట్రకోణం. అఫ్ఘాన్‌లో తాలిబన్ల రాక్షసకాండను ప్రపంచమంతా వ్యతిరేకిస్తుంటే… డ్రాగన్‌ మాత్రం భేష్‌ – శభాష్‌ అంటోంది. తాలిబన్లకు స్నేహ హస్తం అందించి దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ హత్తుకుంటోంది. అటు అఫ్ఘాన్‌లో బలపడేందుకు తాలిబన్లు డ్రాగన్‌ సాయం కోరుతున్నారు. ఇటు తాలిబన్లను శత్రు దేశాలపై అస్త్రంగా వాడుకోవాలని చైనా చూస్తోంది. ఇలా ఒకరి అవసరం ఒకరికి ఉంది. ఇంతకీ అఫ్ఘాన్‌లో అంతర్యుద్ధానికి చైనా ఆజ్యం పోస్తోందా ? తాలిబన్లను చేరదీయడం వెనుక డ్రాగన్‌ అసలు ప్లానేంటి ?

అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితి అంతకంతకు దిగుజారుతోంది. అమెరికా, నాటో దళాల ఉపసంహరణ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఎక్కడ చూసిన రక్తపాతమే కన్పిస్తోంది. బాంబుల మోతలతో ఆ దేశం దద్దరిల్లుతోంది. ఇప్పటికే దాదాపుగా 85 నుంచి 90 శాతం భూభాగం తమ చేతుల్లోనే ఉందని తాలిబన్‌ నేతలు ప్రకటిస్తున్నారు. తాలిబన్లను ఎదుర్కోలేక అఫ్ఘాన్‌ ప్రభుత్వ బలగాలు చేతులెత్తేస్తున్నాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా, అమెరికా లాంటి దేశాలు సలహాలు ఇస్తున్నా.. అక్కడ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. అఫ్ఘాన్‌లో ఎవరి జోక్యాన్ని తాము సహించేది లేదని తాలిబన్ నేతలు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే అఫ్ఘాన్‌ సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకుని దేశాన్ని రావణకాష్టంలా మారుస్తున్నారు. ఇలాంటి సమయంలో చైనా చర్య ప్రపంచ దేశాలను నివ్వెర పోయేలా చేసింది. డ్రాగన్‌ జిత్తులమారితనం మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది.

అఫ్ఘాన్‌లో తాలిబన్ల రాక్షసకాండను అన్నీ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ చైనా, పాక్‌ లాంటి దేశాలు మాత్రం తాలిబన్ల భుజం తట్టి ప్రోత్సహిస్తున్నాయి. రీసెంట్‌గా చైనా తాలిబన్లతో చేతులు కలిపింది. దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ వారికి స్నేహహస్తం అందించింది. అఫ్ఘాన్‌లో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న డ్రాగన్‌ సరైన సమయంలో అదును చూసి తాలిబన్లకు దగ్గరైంది. అఫ్ఘాన్‌ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో చైనా ఎంట్రీ ఇచ్చింది. ఆ దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్‌ వేస్తోంది. అందులో భాగంగానే తాలిబన్‌ నేతలను చైనాకు ఆహ్వానించింది. డ్రాగన్‌ ఇన్విటేషన్‌తో తొమ్మిది మందితో కూడిన తాలిబన్ల బృందం చైనాలో పర్యటించింది. రెండు రోజుల పాటు ఈ పర్యటన సాగింది. చైనా విదేశాంగ శాఖమంత్రితో జరిగిన భేటీలో ఓ ఒప్పందం కూడా కుదిరింది.

విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమైన ముల్లా బరదర్ అఖుండ్ నాయకత్వంలోని తాలిబన్ ప్రతినిధులు.. అఫ్ఘాన్‌లో తమ విస్తరణ కోసం సహకరించాలని కోరారు. తాలిబన్లకు పూర్తిగా తమ మద్దతు ఇస్తున్నట్లు చైనా ప్రకటించింది. దీనికి బదులుగా అఫ్ఘాన్‌ దేశాన్ని చైనాకు వ్యతిరేకంగా ఎవరూ వినియోగించుకోకుండా చూడాలన్న హామీని తీసుకుంది. అఫ్ఘాన్‌లో తాలిబన్ల ఆధిపత్యం పెరిగితే తమకే ముప్పని చైనా భావిస్తోంది. ఎందుకంటే ఉఘర్ వేర్పాటువాద ఉద్యమానికి ఆ దేశం వేదికగా మారుతుందన్నది డ్రాగన్‌ టెన్షన్‌. అందుకే భవిష్యత్తులో తాలిబన్లు శత్రువులుగా మారకుండా ఇప్పుడే వారిని మిత్రులుగా మార్చుకుంది. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్న సమయంలో చైనా లాంటి పెద్ద దేశం మద్దతు తాలిబన్లకు అవసరంగా మారింది. అందుకే చైనా పిలిచిన వెంటనే తాలిబన్లు చేయి అందించారు.

తాలిబన్ల బృందం చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యితో పాటు చైనా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్, ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలకు సంబంధించిన చైనీస్ స్పెషల్ రిప్రజెంటేటివ్‌తో కూడా చర్చలు జరిపినట్లు తెలిపింది. ఇరు దేశాల రాజకీయ, ఆర్థిక, భద్రత సంబంధిత సమస్యలపై ప్రధాన దృష్టితో ఈ చర్చలు సాగినట్లు ప్రకటించింది. తాలిబన్లతో శత్రుత్వం పెట్టుకోవడం కంటే స్నేహం చేయడమే బెటరని చైనా భావిస్తోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. తాలిబన్లను అస్త్రంగా వినియోగించుకుని శత్రు దేశాలకు పైకి ప్రయోగించాలన్నది ఫ్యూచర్‌ ప్లాన్‌గా కన్పిస్తోంది. ఇక ఇప్పటికిప్పుడు హడావుడిగా తాలిబన్లకు స్నేహహస్తం అందించడం వెనుక మరో కారణం ఉంది. చైనాలో వనరులు సమృద్ధిగా ఉండే ప్రాంతం జిన్జియాంగ్ ప్రావిన్స్‌కు అఫ్ఘానిస్తాన్‌తో దాదాపు 8 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. జిన్జియాంగ్‌లో వేర్పాటువాద సంస్థ ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ పనిచేస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ లో మారుతున్న పరిస్థితులు గమనిస్తున్న చైనా ప్రధానంగా.. తాలిబన్లు అక్కడ అధికారం హస్తగతం చేసుకుంటే.. జిన్జియాంగ్‌లో పరిణామాలు మారే అవకాశముంది. ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఒక చిన్నఇస్లామిక్ వేర్పాటువాద సంస్థ. దీన్ని అమెరికా తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇది స్వతంత్ర తూర్పు తుర్కిస్తాన్ స్థాపించాలని కోరుకుంటోంది. జిన్జియాంగ్ ప్రాంతంలో చైనాలో మైనారిటీలైన వీగర్ ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఐతే తాలిబన్లు ఇస్లామిక్‌ సంస్థకు మద్దతు ఇస్తే జిన్జియాంగ్‌లో పరిస్థితులు దారుణంగా మారుతాయి. అందుకే ముందుజాగ్రత్తగా చైనా వారితో చేయి కలిపింది. చైనా వీగర్ వేర్పాటువాద ఫైటర్లు జిన్జియాంగ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ లోకి రావడానికి ఇక తాము అనుమతించమని తాలిబన్ల నుంచి హామీ తీసుకుంది.

అఫ్ఘాన్‌లో శాంతి నెలకొనాలని అన్నీ దేశాలు కోరుకుంటుంటే… చైనా మాత్రం ఆ దేశం పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాలని కోరుకుంటోంది. ఎందుకంటే అష్రఫ్‌ ఘనీ సర్కారు కొనసాగితే డ్రాగన్‌ ఆటలు అక్కడ సాగవు. అందుకే అక్కడి సంక్షోభాన్ని తగ్గించకుండా మరింత ఆజ్యం పోసేలా ప్రయత్నాలు చేస్తోంది చైనా. అఫ్ఘాన్‌లో అభివృద్ధి కోసం మరిన్ని పెట్టుబడులు కూడా పెడతామని చైనా సంకేతాలు పంపుతోంది. ఇప్పటికే పలు చిన్న దేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టి వాటిని గుప్పిట్లో పెట్టుకుంది డ్రాగన్‌. అభివృద్ధి, ఆర్థిక సాయం పేరుతో చిన్న దేశాలను తాము ఏం చెబితే అదే వినేలా చేసుకుంటోంది.

అఫ్ఘాన్‌ విషయంలోనూ అలాంటి పాచికే పారుతుందని చైనా భావిస్తోంది. కానీ ఇక్కడ ఓ విషయాన్ని చైనా మర్చిపోతోంది. తాలిబన్లతో వ్యవహారం అంత తేలిగ్గా ఉండదు. తమను పెంచి పోషించిన అమెరికానే చావు దెబ్బ తీశారు తాలిబన్లు. ఒసామా బిన్ లాడెన్‌తోపాటు అమెరికాలో సెప్టెంబరు 11 దాడులకు కారణమైన ఇతర అల్‌ఖైదా నాయకులకు తాలిబన్లు ఆశ్రయం ఇచ్చారు. అప్పటికి మేల్కొన్న అగ్రరాజ్యం 20 ఏళ్ల పాటు పోరాడినా.. ఎలాంటి ప్రయోజనం లేక చివరకు అఫ్ఘాన్‌ నుంచి వెనుదిరుగుతోంది. ఇప్పుడు చైనా- తాలిబన్ల దోస్తీ ఎంతవరకూ సాగుతుందన్నదే ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.