భారత్ తో ఉద్రిక్తతలు నడుమ టిబెట్ లో చైనా భారీగా పెట్టుబడులు

  • Published By: venkaiahnaidu ,Published On : September 5, 2020 / 07:56 PM IST
భారత్ తో ఉద్రిక్తతలు నడుమ టిబెట్ లో చైనా భారీగా పెట్టుబడులు

భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టిబెట్ ‌కు సంబంధించి చైనా నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది. టిబెట్‌ లో… 1 ట్రిలియన్ యువాన్ల (146 బిలియన్ డాలర్లు) కు పైగా పెట్టుబడి పెట్టేందుకు చైనా సిద్ధమైంది. కొత్త మరియు గతంలో ప్రకటించిన ప్రాజెక్టులతో సహా టిబెట్ ‌లో మౌలిక సదుపాయాల పెట్టుబడిని(infrastructure investment) వేగవంతం చేయడానికి చైనా..ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు భద్రతను పెంచే బీజింగ్ ఉద్దేశాన్ని ఇది సూచిస్తుంది.

గత వారం, టిబెట్ భవిష్యత్ గవెర్నెన్స్ (పాలన)పై జరిగిన సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో… టిబెట్ ప్రాంతంలో ఐక్యతను మెరుగుపరచడానికి, చైతన్యం నింపడానికి మరియు బలోపేతం చేయడానికి మరిన్ని ప్రయత్నాలు అవసరమని చైనా అధ్యక్షుడు జి జిన్ ‌పింగ్ చెప్పారు. త్వరలో సిచువాన్-టిబెట్ రైల్వేతో సహా అనేక పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు ప్రజా సౌకర్యాలు పూర్తవుతాయని జిన్ ‌పింగ్ తెలిపారు.

రైలు సదుపాయం

టిబెట్‌ లోని రెండవ అతిపెద్ద నగరమైన షిగాట్సేతో ఖాట్మండును టిబెట్-నేపాల్ రైల్వేతో కలుపుతూ ముందుకు సాగాలని కూడా చైనా కోరుకుంటుంది. నేపాల్ మరియు చైనా మధ్య 2018 లో సంతకం చేసిన అనేక ద్వైపాక్షిక ఒప్పందాలలో ఇది ఒకటి.

చైనా లోతట్టు ప్రావిన్సుల నుండి టిబెట్‌ ను మరింత సులభంగా చేరుకోవడానికి హై-స్పీడ్ రైల్ నెట్‌వర్క్‌ను నిర్మించాలని బీజింగ్ చాలాకాలంగా లక్ష్యంగా పెట్టుకుంది మరియు చైనాలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే రైల్వేలను నిర్మించడానికి లేదా మెరుగుపరచడానికి లేదా విస్తరించడానికి యోచిస్తున్నట్లు సమాచారం. రాబోయే 15 ఏళ్లలో దేశ రైల్వే నెట్‌వర్క్‌ను మూడింట ఒక వంతు విస్తరించే ప్రణాళికలను చైనా గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.