China: సీక్రెట్‌గా చైనా హైపర్ సోనిక్ మిస్సైల్ టెస్టు.. షాక్‌లో ప్రపంచ దేశాలు

చైనా మరోసారి దూకుడును ప్రదర్శించింది. న్యూక్లియర్ క్యాపబుల్ సరికొత్త హైపర్ సోనిక్ మిస్సైల్‌ని టెస్టు చేసింది. దిగువ భూ కక్ష్యలో పయనిస్తూ భూమి మొత్తాన్ని చుట్టేసింది.

10TV Telugu News

China: చైనా మరోసారి దూకుడును ప్రదర్శించింది. న్యూక్లియర్ క్యాపబుల్ సరికొత్త హైపర్ సోనిక్ మిస్సైల్‌ని టెస్టు చేసింది. దిగువ భూ కక్ష్యలో పయనిస్తూ భూమి మొత్తాన్ని చుట్టేసింది. ఆ తర్వాత కిందకు దిగి శరవేగంగా లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. కొద్దిలో గురితప్పినా.. డేంజరస్ మిస్సైల్ డిజైనింగ్ లో డ్రాగన్ చాలావరకూ పట్టు సాధించినట్లు తెలిసిపోయేది. ఈ రంగంలో చైనా పురోగతి అమెరికా నిఘా వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

అంచనాలను మించి ముందడుగు వేసిన డ్రాగన్ గురించి తెలుసుకుని షాక్ అయ్యాయి. ఆగష్టులోనే జరిగిన ఈ పరీక్ష గురించి చైనా అత్యంత సీక్రెట్ గా ఉంచింది. పరీక్షలో చైనా ప్రయోగించిన అస్త్రం.. నిర్దేశిత లక్ష్యానికి 32కిలోమీటర్ల దూరంలో పడింది. చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇది జరగడం గమనార్హం.

ధ్వనితో పోలిస్తే కనీసం ఐదు రెట్లు వేగం (గంటకు 6వేల 200కిలోమీటర్లు)తో దూసుకెళ్లే అస్త్రాలను హైపర్ సోనిక్ క్షిపణులుగా పేర్కొంటారు. రాకెట్ సాయంతో వీటిని ప్రయోగిస్తారు. సాధారణ బాలిస్టిక్ క్షిపణులు నింగిలోకి లేచి.. అంతరిక్షంలోకి దూసుకెళ్లి.. తిరిగి భూమి దిశగా దూసుకొస్తాయి. నిర్దేశించిన లక్ష్యంపై పడతాయి. ఆర్చి ఆకారంలో వీటి పయనం సాగుతుంది.

…………………………………..: పెట్రోల్ కంటే విమాన ఇంధనం ధరలే తక్కువ!

హైపర్ సోనిక్ అస్త్రం మాత్రం తక్కువ ఎత్తుకే (భూ దిగువ కక్ష్యకు) చేరుకుంటుంది. ఆ తర్వాత ఎలాంటి శక్తి అవసరం లేకుండానే వేల కిలోమీటర్ల పాటు గ్లైడర్ లా పయనిస్తూ నిర్దేశించిన లక్ష్యంపైకి దూసుకెళుతుంది. దీన్ని హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ అంటారు. చాలా వేగంగా టార్గెట్ పై విరుచుకుపడగలవు. క్రూజ్ క్షిపణులూ వీటిలో ఉంటాయి. తమ యాత్ర మొత్తం స్వీయ ఇంజిన్ సాయంతోనే పయనిస్తుంటాయి.

బాలిస్టిక్ క్షిపణులకు భిన్నంగా హైపర్ సోనిక్ అస్త్రాలను మార్గ మధ్యలో నియంత్రించి కోరుకున్న రీతిలో వాటిని పయనాన్ని నిర్దేశించొచ్చు. వాటి గమనాన్ని పసిగట్టడం, వాటి నుంచి రక్షణ పొందడం మాత్రం చాలా కష్టమైన వ్యవహారమే. బాలిస్టిక్ క్షిపణుల తరహాలో ఇవి కూడా అణ్వస్త్రాలను మోసుకెళ్లగలవు.