15సెకన్లలోనే పక్క వ్యక్తికి సోకుతున్న కరోనా వైరస్

  • Published By: venkaiahnaidu ,Published On : February 6, 2020 / 05:36 PM IST
15సెకన్లలోనే పక్క వ్యక్తికి సోకుతున్న కరోనా వైరస్

చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. ఈ వైరస్ సోకిన పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ చైనాలో ఓ డాక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. చైనా రెండు రోజుల క్రితం పుట్టిన 30గంటల్లోనే పసికందుకు ఈ వైరస్ సోకడం అందరినీ షాక్ కు గురిచేసింది. యూఎస్,యూకే సహా ఈ వైరస్ ఇప్పటికే 26 దేశాల్లోకి ప్రవేశించింది. భారత్ లోకి కూడా కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. కేరళలో ముగ్గురుకి కరోనా వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్థారించారు. 

అయితే ఒకరి నుంచి ఒకరికి కరోనా వైరస్ సోకడానికి కేవలం 15సెకన్లు మాత్రమే పడుతుందని చైనా అధికారులు చెబుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తితో 15సెకన్లు మాట్లాడిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు తెలిపారు. కేవలం 15సెకన్లు చాలు వైరస్ సోకడానికి అనే వార్త ఇప్పుడు అందరినీ మరింత టెన్షన్ పెడుతోంది. గత నెల చివర్లో చైనాలోని జెజియాంగ్‌ ఫ్రావిన్స్(రాష్ట్రం)లో 56 ఏళ్ల వ్యక్తి కూరగాయల మార్కెట్‌ను సందర్శించినట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా తెలిసిందే. ఆ సమయంలో ఆ వ్యక్తికి వైరస్ లక్షణాలు లేవు. అయితే అంతకుముందు 14 రోజులలో వైరస్ సోకిన వక్తులతో అతను సమయం గడపలేదు,మాట్లాడలేదు. అతను తన ఊరు దాటి బయటికి కూడా ప్రయాణించలేదు. అయితే గత నెల చివర్లో మార్కెట్ కు వెళ్లిన అతను ఏమీ కొనుగోలు చేయడానికి మళ్లీ బయలుదేరే ముందు 15 సెకన్ల పాటు మార్కెట్ స్టాల్‌లో ఒక మహిళ పక్కన నిలబడ్డాడు.

ఆ మహిళకు అప్పటికే వైరస్ ఉన్నట్లు తేలింది. ఇద్దరూ ముసుగు ధరించలేదు. మంగళవారం ఆ వ్యక్తికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తూర్పు చైనాలోని తీరప్రాంత నగరమైన నింగ్బోలోని జియాంగ్‌బే హెల్త్ కమిషన్ ఈ వివరాలను వెల్లడించినట్లు చైనీస్ స్టేట్ మీడియా రిపోర్ట్ చేసింది. అయితే ఆ వ్యక్తికి వైరస్ సోకడానికి మార్కెట్ మాత్రమే ఆధారమని స్థానిక హెల్త్ కమిషన్ ఎలా నిర్ధారించిందో అస్పష్టంగా ఉంది. అయితే హాంగ్జౌ సిటీలోని ఒక వ్యక్తి కూడా నగరంలోని ఆసుపత్రిలో వైరస్ సోకిన రోగితో కేవలం 50 సెకన్లు గడిపిన తరువాత వ్యాధి బారిన పడ్డాడు. ఇక్కడ కూడా మళ్లీ వైరస్ సోకిన రోగులతో అతనికి ముందస్తు సంబంధం లేదు మరియు అతను సిటీ దాటి బయట ప్రయాణించలేదు.

జెజియాంగ్‌లో బుధవారం రెండవసారి వేగంగా కరోనా వైరస్ కేసు నమోదైంది. మరోవైపు నింగ్బో మరియు జెజియాంగ్ ప్రావిన్స్‌లోని మరో మూడు నగరాల్లో తీవ్రమైన ప్రయాణ ఆంక్షలను ప్రకటించారు జెజియాంగ్ అధికారులు. చైనాలోని చాలా నగరాల్లో ప్రజలు ఇప్పటికే ఇళ్ల నుంచి బయటకు రావట్లేదు. పలుచోట్ల నగరాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. పలు సిటీలను పక్క ఊర్లతో సంబంధం లేకుండా బంద్ చేసేశారు అధికారులు. 

ఇప్పటివరకు చైనాలో ఈ వైరస్ బారిన పడి 560మంది అధికారికంగా ప్రాణాలు కోల్పోయారు. అనధికారికంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య వేలల్లోనే ఉండవచ్చిన కొన్ని ఇంగ్లీష్ పత్రికలు కథనాలు ప్రచురించాయి. మరోవైపు చైనాలో అన్ని జంతువుల అమ్మకాలపై నిసేధంపై విధించినట్లు చైనా అధికారులు తెలిపారు. ఇప్పటికే అమెరికా కరోనా వైరస్ ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్పీ గా డిక్లేర్ చేసింది.