ఇదేం రూల్ రా బాబూ : ఉద్యోగులు రోజుకి ఒక్కసారే టాయిలెట్‌కు వెళ్లాలి..అంతకుమించి వెళితే ఫైన్..

ఇదేం రూల్ రా బాబూ : ఉద్యోగులు రోజుకి ఒక్కసారే టాయిలెట్‌కు వెళ్లాలి..అంతకుమించి వెళితే ఫైన్..

chinese company fines employees  use toilet more than once per day : ఒక ఉద్యోగి ఎంత తక్కువ లెక్కేసుకున్నా ఆఫీసులో 8 గంటలు పనిచేయాలి. ఆ 8 గంటల్లో టాయ్ లెట్ కు కనీసం రెండు మూడు సార్లన్నా వెళ్లాల్సి వస్తుంది. కానీ చైనాలోని ఓ కంపెనీలో మాత్రం ఉద్యోగులు ‘‘రోజుకు ఒకే ఒక్కసారి’’మాత్రమే టాయ్ లెట్ కు వెళ్లాలని అంతకు మించి వెళితే ‘ఫైన్’’వేస్తామంటోంది. పాపం ఇక ఆ ఉద్యోగుల పరిస్థితి తలచుకుంటేనే బాధేస్తుంది కదూ..మరీ శాడిజం మరీ అన్యాయం కాకపోతే..అని అనిపిస్తోంది కదూ..

దీనికి సదరు కంపెనీ ఏమంటోందో తెలుసా..టాయిలెట్‌లో కూర్చొని టైంపాస్ చేద్దామంటే కుదురదు. ఏ ‘పని’ అయినా సరే ఒక్కసారే కంప్లీట్ చేసుకుని రావాల్సిందే..లేదంటే మళ్లీ వెళదామనుకుంటే మాత్రం ఫైన్ తప్పదంటోంది. పనిచేయడానికి బద్దకించే ఉద్యోగుల కోసమే ఈ రూల్ పెట్టామని ఆ సంస్థ సమర్థించుకుంటోంది. మామూలు ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉన్నా..పాపం ‘డయాబెటీస్’ ఉన్నవారి పరిస్థితి మరీ బాధాకరం..వారికి నిజంగా ఈ రూల్ నరకమనే చెప్పాలి!.

చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని డోంగ్గువాన్‌లో గల అన్పు ఎలక్ట్రిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సంస్థ ఉద్యోగులకు కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. తమ సంస్థలోని ఉద్యోగులు రోజులో ఒకే ఒక్కసారి టాయ్ లెట్ కు వెళ్లాలని అంతకంటే ఎక్కువసార్లు టాయిలెట్ వాడితే 20 యువాన్ (3 యూస్ డాలర్లు, ఇండియా కరెన్సీ అయితే రూ.227) జరిమానా చెల్లించాలని నిబంధన పెట్టింది. ఈ నిబంధన ఇష్టం లేని కొంతమంది ఉద్యోగులు సంస్థ నోటీసును సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

ఈ నిబంధన అమల్లోకి వచ్చాక ఆ సంస్థ సుమారు ఏడుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకుందట. ఈ నిబంధనపై సోషల్ మీడియాలో రచ్చ జరగడంతో ఆ కంపెనీ సమాధానం ఇస్తూ.. ‘‘కొంతమంది ఉద్యోగులు పని తప్పించుకోవటానికి టాయిలెట్ పేరుతో సమయం వృథా చేస్తున్నారని..స్మోకింగ్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారనీ..తెలిపింది. అటువంటి సిబ్బంది కోసమే ఈ నిబంధన అమల్లోకి తేవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది.

దీంతో మాకు వేరే దారి లేక ఇటువంటి రూల్ పాస్ చేశామని తెలిపింది. ఉద్యోగులు పని చేయడానికి బద్దకిస్తున్నారు. పనులు చేయని ఉద్యోగుల్ని ఎంతగా హెచ్చరించినా వాళ్లు ఏమాత్రం ఖాతరు చేయటం లేదు..దీంతో ఈ రూల్ పెట్టాల్సి వచ్చింది’’ అని సంస్థ మేనేజర్ కావో ఓ టీవీ చానెల్‌కు తెలిపారు. పనులు చేయకుండా టాయిలెట్‌లో టైంపాస్ చేసే సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించడం కంటే.. ఆ నిబంధన పెట్టడమే మంచిదని తమకు అనిపించిందని పేర్కొన్నారు. దీంతో వారిలో మార్పు వస్తుందని తాము ఆశిస్తున్నామని తెలిపారు.

ఈ రూల్ అతిక్రమించే ఉద్యోగి నుంచి నేరుగా జరిమానా తీసుకోబోమని..ఆ జరిమానాను వారికిచ్చే జీతం నుంచి కట్ చేస్తామని తెలిపారు. అయితే, ఒకసారి కంటే ఎక్కువ సార్లు టాయిలెట్‌ను వాడుకోవాలనే ఉద్యోగి తమ బాస్ అనుమతి తీసుకుని జరిమానా నుంచి తప్పించుకోవచ్చని కావో వివరించారు. కానీ, మరీ స్కూల్ పిల్లాడిలా బాస్‌ను పదే పదే టాయిలెట్‌కు వెళ్తామని అడిగితే ఏం బాగుంటుంది చెప్పండి!! దీంతో సదరు ఉద్యోగులు టాయ్ లెట్ కు వెళ్లటం తగ్గించుకునే అవకాశముంటుందని భావిస్తోందా సంస్థ.

కాకపోతే ఈ రూల్ పాపం డయాబెటిస్ ప్రాబ్లం ఉన్నవారి విషయంలో కాస్త ఏమన్న సడలింపులు ఇచ్చిందో లేదో మాత్రం తెలియరాలేదు.