కరోనాను మొదట కనుగొన్న డాక్టర్.. ఆ వైరస్‌కే బలైపోయాడు!

  • Published By: venkaiahnaidu ,Published On : February 6, 2020 / 07:30 PM IST
కరోనాను మొదట కనుగొన్న డాక్టర్.. ఆ వైరస్‌కే బలైపోయాడు!

వ్యాక్సిన్ లేని ప్రాణాంతక కరోనా వైరస్‌ను మొదటిసారిగా గుర్తించిన డాక్టర్ లీ వెన్లియాంగ్(34)ఇప్పుడు అదే వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. వృత్తి రీత్యా కంటి వైద్య నిపుణుడైన లీ వెన్లియాంగ్ కరోనా అనే వైరస్ పురుడు పోసుకుందనే విషయాన్ని మొదటగా గుర్తించాడు. అయితే ఈ వైరస్ బారిన పడి చైనాలోని వుహాన్‌ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం(ఫిబ్రవరి-6,2020) లీ వెన్లియాంగ్ మృతి చెందినట్లు చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ తెలిపింది.

మొదటగా వూహాన్ సిటీలో ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిని గతేడాది డిసెంబర్ లో మొదటగా గుర్తించింది లీ వెన్లియాంగ్. చైనా సహా ప్రపంచవ్యాప్తంగా 2003లో 800మంది ప్రాణాలు తీసిన సార్స్(SARS) తరహా వైరస్ విజృంభిస్తోందని ఆయన తొలిసారిగా తాను చదువుకున్న మెడికల్ స్కూల్ ఆలమ్నీ జర్నల్‌లో రాశారు. ఇదే విషయాన్ని వుయ్ చాట్ ద్వారా కొన్ని మెడికల్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. తాను పనిచేస్తోన్న హాస్పిటల్ లో చేరిన ఏడుమంది రోగులను పరిశీలించిన తరువాత ఈ విషయాన్ని తాను ధృవీకరించినట్లు లీ వెన్లియాంగ్ ఈ జర్నల్‌లో తెలిపాడు.

లీ వెన్లియాంగ్ అరెస్ట్

అయితే  ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి లీ వెన్లియాంగ్ తప్పుడు సమాచారాన్ని సృష్టించాడనే కారణంతో ఆయనను వుహాన్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రజారోగ్యంపై సోషల్ మీడియా ద్వారా వదంతులను వ్యాపింపజేస్తున్నారంటూ పోలీసులు వెన్లియాంగ్‌పై కేసు నమోదు చేశారు. ఆ తరువాత నిజం తెలిసి ఆయనను వదిలి వేశారు. గత నెల 12వ తేదీన అనారోగ్యానికి గురయ్యారు వెన్లియాంగ్. ఆయనను పరీక్షించగా.. కరోనా వైరస్ పాజిటీవ్‌గా తేలింది. వ్యూహోన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఆయన గురువారం కన్నుమూశారు.

హాస్పిటల్ లో భార్య
వెన్లియాంగ్ భార్య గర్భంతో ఉన్నారు. ప్రస్తుతం ఆమె వుహాన్‌లోనే చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అదే సమయంలో- భర్త మరణించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. వెన్లియాంగ్, ఆయన భార్య తల్లిదండ్రులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారికి సంబందధించిన రిపోర్ట్ ఇంకా అందాల్సి ఉంది. కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమనే విషయాన్ని తమ కుమారుడు ముందుగానే గుర్తించాడని, అయినప్పటికీ..అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేకపోయారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చైనా వ్యాప్తంగా 28 వేల మందికి పైగా కరోనా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన వారికి పరీక్షలను నిర్వహిస్తున్నారు. వాటి రిపోర్ట్ లు ఇంకా అందాల్సి ఉంది. చైనాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యకు అడ్డుకట్ట పడట్లేదు. గురువారం నాటికి 580 మంది మరణించినట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Read Also: ఆ 7 వారాల్లో చైనాలో ఏం జరిగింది?