Chinese Nuclear Warheads : అంచనాలను మించి..అణ్వాయుధాలను భారీగా పెంచుకుంటున్న చైనా

చైనా సైనిక ఆధునీకరణ విస్తృతంగా కొనసాగుతోంది. చైనా తన అణుశక్తిని చాలా వేగంగా విస్తరిస్తున్నట్లు సమాచారం. ఒక సంవత్సరం క్రితం అమెరికా అధికారులు అంచనా వేసినదానికంటే

Chinese Nuclear Warheads చైనా సైనిక ఆధునీకరణ విస్తృతంగా కొనసాగుతోంది. చైనా తన అణుశక్తిని చాలా వేగంగా విస్తరిస్తున్నట్లు సమాచారం. ఒక సంవత్సరం క్రితం అమెరికా అధికారులు అంచనా వేసినదానికంటే చాలా వేగంగా చైనా తన అణుశక్తిని విస్తరిస్తోందని బుధవారం పెంటగాన్(అమెరికా రక్షణశాఖ ప్రధానకార్యాలయం)విడుదల చేసిన ఓ రిపోర్ట్ లో పేర్కొంది.

బుధవారం పెంటగాన్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. రాబోయే ఆరేళ్లలో చైనా అణు వార్‌హెడ్‌ల సంఖ్య 700కి పెరిగే అవకాశముంది. 2030 నాటికి ఈ సంఖ్య 1,000కు చేరే అవకాశముంది. పెంటగాన్ నివేదిక డిసెంబరు 2020 వరకు సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. అయితే ప్రస్తుతం చైనా వద్ద ఈ రోజు నాటికి ఎన్ని ఆయుధాలు ఉన్నాయో నివేదికలో పేర్కొనలేదు. అయితే ఒక ఏడాది క్రితం పెంటగాన్ ఈ సంఖ్య 200లోపు ఉంటుందని మరియు ఈ దశాబ్దం చివరి నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

PLA(పీపీల్స్ లిబరేషన్ ఆర్మీ-చైనా ఆర్మీ) యొక్క అభివృద్ధి చెందుతున్న సామర్థ్యాలు మరియు భావనలు…బలమైన శత్రువుపై పోరాడి, గెలిచే చైనా సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూనే ఉన్నాయని, ఇది యునైటెడ్ స్టేట్స్‌కు ఒక హెచ్చరికే అని నివేదిక పేర్కొంది. అన్ని యుద్ధ రంగాలలో గాలి, భూమి, సముద్రం, అంతరిక్షం మరియు సైబర్‌స్పేస్‌లో అమెరికాను సవాలు చేయాలనే ఉద్దేశ్యంతో చైనా ఆర్మీ పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని రిపోర్ట్ తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో తైవాన్ హోదాకు సంబంధించి చైనా ఉద్దేశాల పట్ల తాము మరింత అప్రమత్తంగా ఉన్నామని అమెరికా రక్షణ అధికారులు తెలిపారు.

యునైటెడ్ స్టేట్స్ మరియు రష్యా దశాబ్దాలుగా కలిగి ఉన్న భూమి, సముద్రం మరియు వాయు ఆధారిత క్షిపణుల కలయిక – అణు త్రయం అని పిలువబడే దానిని చైనీయులు ఇప్పటికే ఏర్పాటు చేసి ఉండవచ్చని నివేదిక పేర్కొంది. అమెరికా మిలటరీ ఆపరేషన్స్ లో”జోక్యం చేసుకోగల”, యునైటెడ్ స్టేట్స్‌ కు వ్యతిరేకంగా చైనా సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వగల విదేశీ స్థావరాల నెట్‌వర్క్‌ను చైనా అనుసరిస్తోందని పెంటగాన్ నివేదిక పేర్కొంది. కాగా, 2049 నాటికి చైనా..ప్రపంచ సైనిక శక్తిగా మారాలని యోచిస్తోందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఇక, చైనాతో పోల్చి చూస్తే అగ్రరాజ్యం అమెరికా వద్ద 3,750 అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే మొన్నటివరకు వాటి సంఖ్య పెంచే ఆలోచనలో లేని అగ్రరాజ్యం ఇప్పుడు తన అణు విధానాన్ని సమగ్రంగా సమీక్షిస్తోంది.

ALSO READ Earthquake : మూడు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

ట్రెండింగ్ వార్తలు