తన ప్రేమను కాదన్న ప్రియుడికి, ప్రియురాలు ఇచ్చిన గిఫ్టు

  • Published By: murthy ,Published On : May 20, 2020 / 12:05 PM IST
తన ప్రేమను కాదన్న ప్రియుడికి, ప్రియురాలు ఇచ్చిన గిఫ్టు

ప్రేయసి ప్రియులన్నాక ఒకరి కొకరు పువ్వులు, బొకేలు, సందర్భాను సారంగా గ్రీటింగ్  కార్డులు ఇచ్చి పుచ్చుకోవటం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఒక వేళ ఆ ప్రేమ బ్రేక్ అప్ అయితే  కన్నీళ్ళతో ప్రియుడు చేసిన మోసాలు గురించి వివరించే ఆడపిల్లల్ని చూశాము. ప్రియుడి ఇంటి ముందు టెంట్ వేసుకుని కూర్చుని దీక్షలు చేసి న్యాయపోరాటాలు చేసిన యువతులను చూశాము…. కానీ చైనా కు  చెందిన జావో అనే యువతి వీటన్నిటికంటే భిన్నంగా ప్రవర్తించింది.   

తూర్పు చైనా లోని జిబోలో నివాసం ఉండే జావో తన ప్రేమకు బ్రేకప్ చెప్పిన ప్రియుడిపై విభిన్నంగా కక్ష తీర్చుకుంది. తన ప్రియుడి ఇంటికి 1000 కిలోల ఉల్లిపాయలు పంపించింది. నువ్వు బ్రేకప్ చెప్పాక …నేను  3రోజులు బాగా ఏడ్చా…ఎంతో కుంగి పోయా… ఇప్పుడు నీ వంతు అంటూ  ఉల్లిపాయలతో సందేశం పంపి తన  ఆవేశాన్ని వెళ్లగక్కింది.  దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

జావో తన ప్రియుడితో ఏడాది పాటు ప్రేమలో  ఉంది. ఒకరోజు ఆమె ప్రియుడు  బ్రేకప్ చెప్పాడు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. దాదాపు 3 రోజుల పాటు శోకసంద్రంలో మునిగి పోయింది.  ఆబాధ నుంచి వెంటనే తేరుకుని ..తన ప్రియుడి గురించి వాకబు చేసింది. తన ప్రేమకు బ్రేకప్ చెప్పాక ప్రియుడు కన్నీటి బొట్టు కూడా రాల్చలేదని తెలుసుకుంది. ప్రియుడ్ని కూడా బాధ పెట్టాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా 1000 కిలోల ఉల్లిపాయల్ని  అతడి ఇంటి ముందు డెలివరీ చేయించింది. 

అతడ్ని కలవకుండా….అతడికి తెలియకుండా ఇంటి గుమ్మం ముందు ఉల్లిపాయలు డెలివరీ చేయాలని బాయ్ కు చెప్పింది. బాయ్ ఉల్లిపాయలు డెలివరీ చేయగానే….నేను మూడు రోజులు ఏడ్చా….ఇప్పుడు నీ వంతు అంటూ తన ప్రియుడికి ఒక మెసేజ్ పంపించింది. మెసేజ్ చూసుకున్న ప్రియుడు ఇంటి  వద్దకు వచ్చి అక్కడున్న ఉల్లిపాయలు చూసి ఖంగు తిన్నాడు. ఇంటిముందున్న ఉల్లిపాయలను అయోమయంతో చూస్తున్న ఫోటోలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

కాగా ఈ  ఘటనపై  బోయ్ ఫ్రెండ్ స్పందిస్తూ …జావోకు పొగరెక్కువ….తను ఎక్కువ డ్రామా చేస్తోందనన్నాడు. బ్రేకప్ తర్వాత నేను ఒక కన్నీటి బొట్టు రాల్చలేదని అందరికీ  చెప్పింది. నేను ఏ మాత్రం  బాధ పడటంలేదని చెప్పింది..నేను అంత చెడ్డవ్యక్తినా అంటూ వాపోయాడు.