సౌత్ కొరియన్ సినిమా రికార్డు : పారాసైట్ పై ప్రశంసల జల్లు

  • Published By: madhu ,Published On : February 10, 2020 / 08:11 PM IST
సౌత్ కొరియన్ సినిమా రికార్డు : పారాసైట్ పై ప్రశంసల జల్లు

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ చిత్రంపైనే మాట్లాడుకుంటున్నారు. సినిమాలో ఏముంది ? అభిమానులు ఆకట్టుకోవడానికి పెద్ద పెద్ద స్టార్స్ ఏమయినా ఉన్నారా ? అనే తెగ చర్చ జరుగుతోంది. ఎందుకంటే సినిమా ప్రపంచంలో పెద్ద అవార్డుగా భావించే ఆస్కార్..దక్షిణ కొరియా సినిమాకు లభించడమే ఇందుకు కారణం. ఆ భాషలో రూపొందిన ‘పారాసైట్’ సినిమా ఆస్కార్‌ అవార్డుల పంట పండించుకుంది. నాలుగు కేటగిరీల్లో నాలుగు అవార్డులను సొంతం చేసుకుని అందరీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లేతో పాటు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగాల్లో ఆస్కార్ అవార్డులను ఎగురేసుకపోయింది. 

ఏ కేటగిరీలోనూ ఆస్కార్ అవార్డును అందుకోలేదు దక్షిణ కొరియా. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా నాలుగు అవార్డులు రావడం పట్ల సౌత్ కొరియన్ ప్రపంచం ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. సౌత్ కొరియన్ తొలి సినిమాగా ‘పారాసైట్’ రికార్డు సృష్టించింది. 92 సంవత్సరాల చరిత్రలో..ఒక విదేశీ సినిమా ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలవడం ఇదే మొదటిసారి. అవార్డులు రావడం పట్ల..సోషల్ మీడియాలో అభినందన వెల్లువ వ్యక్తమౌతోంది. దీనిపై ప్రెసిడెంట్ స్పందించారు. అభినందనలు తెలియచేస్తూ..కార్యాలయం నుంచి ట్వీట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల హృదయాలను గెలుచుకున్నారంటూ తెలిపింది.

 
సినిమా రిలీజ్ కాగానే కలెక్షన్ల వర్షం కురిసింది. అప్పుడే చిత్రానికి అవార్డులు రావడం ఖాయమని తెగ ప్రచారం జరిగింది. కానీ ఏకంగా నాలుగు అవార్డులు వస్తాయని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఈ సందర్భంగా దర్శకుడు జోన్ బోన్ హో మాట్లాడుతూ…బెస్ట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నందుకు..గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు, అవార్డుల కోసం ఎప్పడు స్క్రిప్ట్ రాయలేదని..కేవలం సినిమా కోసమేనని తెలిపారు. సౌత్ కొరియాకు దక్కిన మొదటిసారి ఆస్కార్ అంటూ..ట్రోఫిని పైకెత్తి ఆనందం వ్యక్తం చేశారు జోన్ బోన్ హో.
 

కథేంటీ ? 
ఓ పేద కుటుంబంలో నలుగురు వ్యక్తులు నివాసం ఉంటుంటారు. కడుపు నిండా భోజనం తినడానికి అవస్థలు పడుతుంటారు. ఉద్యోగాల కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో ఓ ధనిక కుటుంబం ఇంట్లో పనికి చేరుతారు. అయితే..తామంతా ఒకే కుటుంబం అనే విషయాన్ని వారికి చెప్పరు. అంతకన్నా ముందు..పనిచేస్తున్న వారిని వెళ్లగొడుతాడు యజమాని. యజమాని కుటుంబం విహార యాత్రకు వెళుతుంది. దీంతో ఆ నలుగురు ఇంట్లో ఉన్న వస్తువులు వాడుతూ..తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు వీరిపై నిఘా పెట్టి..ఆరా తీస్తారు.

ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులని తెలుస్తుంది. యజమాని కుటుంబం..తిరిగి స్వగ్రామానికి చేరుకుంటారన్న సమాచారం వీరికి తెలుస్తుంది. తాము మోసం చేశామని యజమానికి తెలిస్తే..ఉద్యోగాలు పోవడం పక్కా. ఈ భయంతో వాళ్లేం చేశారు ? ఆ తర్వాత ఏం జరిగింది ? అనే పరిణామాల మధ్య సినిమా రూపొందింది. సమాజంలో నెలకొన్న కఠోర పరిస్థితులకు తగిన వినోదం అల్లించి..సినిమా రూపొందించారు దర్శకుడు.