అమెరికాలో కరోనా విలయతాండవం, రోజుకు 3 వేల మంది మృతి

  • Published By: madhu ,Published On : December 11, 2020 / 07:43 AM IST
అమెరికాలో కరోనా విలయతాండవం, రోజుకు 3 వేల మంది మృతి

Corona in America : అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి కోవిడ్ ధాటికి అగ్రరాజ్యంలో రోజుకు 3 వేల మందికి పైగా ప్రాణాలు విడుస్తున్నారు. ప్రాణాంతక కరోనా ప్రభలిన నాటి నుంచి ఈ వారం రోజుల్లోనే ఎక్కువ మరణాలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. వచ్చే నాలుగు వారాల్లో సుమారు 24 వేల మంది కరోనాతో మత్యువాత పడే అవకాశం ఉందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా గత రెండు వారాల్లోనే కొత్త కరోనా కేసుల సంఖ్య 18 శాతం పెరిగింది.



ఓవైపు మహమ్మారి అంతకంతకూ ఉధృతమవుతున్న వేళ కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో ఐసీయూ బెడ్స్‌ కొరత ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాంతక వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కోవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కరోనా నిరోధక వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేంతవరకు మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా అమెరికాలో ఇప్పటివరకు సుమారు 2,88,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు.



ఇప్పటి వరకు కోటీ 50 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడగా..2 లక్షల 86 వేల 249 మంది మృతి చెందారని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.
ఫైజర్, మోడెర్నా టీకాలు తుది ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో..ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ సమావేశం కానుంది. ఈ సంవత్సరం నాటికి 20 మిలియన్ల అమెరికన్లకు, జనవరి చివరి నాటికి 50 మిలియన్ల మందికి, మొదటి త్రైమాసికం కల్లా 100 మిలియన్ల మందికి టీకాలు వేయడానికి తగినన్ని డోసులు కలిగి ఉండేలా సిద్ధమౌతున్నామని ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి అలెక్స్ అజార్ మీడియాకు తెలిపారు.