కరోనా : 492 మంది మృతి..స్మశానంలా వుహాన్

  • Published By: madhu ,Published On : February 5, 2020 / 09:49 AM IST
కరోనా : 492 మంది మృతి..స్మశానంలా వుహాన్

కరోనా వైరస్ చైనాను అల్లకల్లోలం చేస్తోంది. మృతుల సంఖ్య, వైరస్‌తో ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నా వైరస్ మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఈ వ్యాధి బారినపడి మరణించిన వారి సంఖ్య 492కి చేరింది. 2020, జనవరి 04వ తేదీ మంగళశారం ఒక్కరోజే చైనాలో 65మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటు ఈ మహమ్మారి బారిన పడి ఆసుపత్రుల పాలైన వారి సంఖ్య 24 వేల 5వందలు దాటింది. ఇందులో 3వేల 2వందల మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. 

వణికిస్తోంది
ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ వణికిస్తోంది. చైనాను మరింత కుదిపేసిన కరోనాపై ఆ దేశం యుద్ధానికి దిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి మకావులోని 41 కాసినోలను 15 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించింది. మకావు నివాసితుల ఆరోగ్యం కోసం దీనిని మూసివేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మకావు ప్రాంతంలో 10 మంది న్యుమోనియ తరహా అనారోగ్యంతో బాధపడుతున్నారని .. అధికారులు తెలిపారు. వారిలో నగరంలోని అత్యంత రద్దీగా ఉండే జూదం స్థావరాలలో ఒకటైన గెలాక్సీ క్యాసినోలో హోటల్ ఉద్యోగి కూడా ఉన్నారు. 

14 రోజుల్లో మరణం
కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలో తెలియక చైనా తలపట్టుకుంటోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న ప్రతి 50మందిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారిక  లెక్కల ప్రకారం వైరస్ సోకిన తర్వాత 14రోజుల్లోనే మరణం సంభవిస్తున్నట్లు తేల్చారు. ఇటు కరోనా వైరస్ 28 దేశాలకు పాకింది. చైనా తర్వాత జపాన్, థాయ్‌లాండ్, సింగపూర్‌, దక్షిణకొరియా, హాంకాంగ్‌ల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. జపాన్‌లో 33మందికి ఈ  వ్యాధి సోకినట్లు తేలింది. హాంకాంగ్‌ నుంచి ఇటీవల వచ్చిన ఓ నౌకలో 10మందికి వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. సింగపూర్‌లో కొత్తగా ఆరుగురు దీని బారిన పడ్డారు. అయితే వీరిలో ఇద్దరు మాత్రమే చైనాకు వెళ్లివచ్చిన వారు. దీంతో వైరస్ వేగంగా విస్తరిస్తోందన్న  ఆందోళన సింగపూర్‌ను వెంటాడుతోంది.

స్టేడియం ఆస్పత్రి 
కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు పదిరోజుల్లోనే ఓ ఆసుపత్రిని నిర్మించిన చైనా ప్రభుత్వం .. ఇప్పుడు ఓ స్టేడియాన్ని కూడా తాత్కాలిక ఆసుపత్రిగా మార్చేసింది. మూడు బిల్డింగ్‌లను 3వేల 4వందల పడకల ఆసుపత్రిగా సిద్ధం చేశారు. ఇక వైద్యుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇళ్లకు కూడా వెళ్లలేని పరిస్థితి. వేలమంది ఆసుపత్రుల పాలవడంతో రోజుకు 20గంటల పాటు సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వైరస్ దెబ్బకు చనిపోతున్న వారిలో 80శాతం మంది 60 ఏళ్లు దాటిన వారే.  

స్మశానాన్ని తలపిస్తున్న వుహాన్ సిటీ
కరోనా వైరస్ బయటపడ్డ వుహాన్ సిటీ ప్రస్తుతం స్మశానాన్ని తలపిస్తోంది. ఆ నగరం ఇప్పుడు పూర్తిగా దిగ్బంధంలో ఉంది. ఆ నగరంలోకి వైద్యులు, అధికారులు తప్ప మరెవరికీ ఎంట్రీ లేదు. నగర దారులు పూర్తిగా మూసుకుపోయాయి. ఎవరూ బయటకు వచ్చే అవకాశాలు లేవు. దీంతో అసలు నగరంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. 

ఎవరూ బయటకు రావొద్దు
ఇళ్లలోంచి ఎవరూ కూడా బయటకు వచ్చేందుకు అనుమతించడం లేదు. పక్కింటివారితో మాట్లాడటానికి కూడా వీలు లేదు. రెండ్రోజులకోసారి ఇంటినుంచి ఒకరు మాత్రమే బయటకు రావచ్చు. అదికూడా నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి మాత్రమే. అయినా కూడా జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. దీంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.