లక్ష్మణుడి కోసం హనుమంతుడు తీసుకొచ్చిన ‘సంజీవని’లాంటి హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం ఎగబడుతున్న ప్రపంచ దేశాలు

  • Published By: sreehari ,Published On : April 8, 2020 / 09:29 AM IST
లక్ష్మణుడి కోసం హనుమంతుడు తీసుకొచ్చిన ‘సంజీవని’లాంటి హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం ఎగబడుతున్న ప్రపంచ దేశాలు

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ (Covid-19) మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ పోరాటం చేస్తున్నాయి. కరోనా వైరస్ కు ఇప్పటివరకూ ఎలాంటి మందు లేదు. వ్యాక్సీన్ రావాలంటే మరో 12 నుంచి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియక వైరస్ ప్రభావిత దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఒకవైపు పిట్టల్లా రాలిపోతున్న జనం.. లక్షల్లో నమోదు అవుతున్న కేసులతో అమెరికా సహా స్పెయిన్, ఇటలీ దేశాలు విలవిల లాడిపోతున్నాయి. కరోనా వైరస్ ను నివారించే అసలైన వ్యాక్సీన్ ఇప్పట్లో వచ్చేలా లేదు. ఇలోగా కరోనాను నివారించగల సామర్థ్యం ఒక ఔషధానికే ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్ అనే మెడిసిన్ ఒక్కటే కరోనా నివారణ పోరాటంలో ఇదే గేమ్ చేంజర్‌గా గట్టిగా విశ్వసిస్తున్నాయి. 

 

హనుమంతుడి తీసుకొచ్చిన సంజీవనిని మాకూ ఇవ్వండి

రామాయణంలో హనుమంతుడు హిమాలయ పర్వతాల నుంచి తీసుకొచ్చిన సంజీవనితో పోలుస్తున్నాయి. వాస్తవానికి హైడ్రాక్సీక్లోరోక్విన్ అనేది మలేరియా నివారణ ఔషధం.. ప్రస్తుతం ఇది భారతదేశంలోనే అందుబాటులో ఉంది. అందుకే కరోనా బాధిత దేశాలన్నీ తమ కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్ సరఫరా చేయాలని అభ్యర్థిస్తున్నాయి. రోజురోజుకీ ఈ హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని సరఫరా చేయాలంటూ అభ్యర్థించే దేశాల సంఖ్య పెరిగిపోతోంది.

పురాణ కథలో రామాయణంలో మూర్ఛపోయిన లక్ష్మణుడి కోసం సంజీవని పర్వతాన్ని హిమాలయాల నుంచి హనుమంతుడు తీసుకొచ్చి ప్రాణాలు నిలిపినట్టు అందరికి తెలుసు.. అనారోగ్యంతో ఉన్నవారిని జీసస్ ఆరోగ్యవంతులని చేశాడు. బార్టియేయుకు తిరిగి దృష్టిని ప్రసాదించాడు. ఇప్పుడు కరోనా వైరస్ బాధితుల పట్ల హైడ్రాక్సీక్లోరోక్విన్ అనేది సంజీవనిగా భావిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ డ్రగ్ కోసం బ్రెజిల్ దేశం కూడా భారతదేశానికి ‘సంజీవని’ లేఖ రాసింది. Covid-19 గేమ్ చేంజర్.. హైడ్రాక్సీక్లోరోక్విన్ (HCQ) మెడిసిన్ తమ దేశానికి కూడా సరఫరా చేయాల్సిందిగా లేఖలో కోరింది. (మోడీ గ్రేట్,చాలా మంచోడు…స్వరం మార్చిన ట్రంప్)

ప్రజలందరి మేలు కోసం సంయక్త బలగాలు, ఆశీర్వాదాలతో భారత్‌, బ్రెజిల్ దేశాలు ఈ ప్రపంచ (Covid-19) మహమ్మారి సంక్షోభాన్ని అధిగమించాలి. దయచేసి మా అభ్యర్థనను అంగీకరించండి. మీరు ఇచ్చే భరోసాయే అత్యున్నత గౌరవంగా మేం భావిస్తాం’ అని బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో ప్రధాని మోదీకి లేఖ రాశారు. COVID-19 తో పోరాటంలో మలేరియా నిరోధక ఔషధంగా విస్తృతంగా వినియోగిస్తున్న HCQ ఒక “గేమ్ ఛేంజర్” అని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ HCQ డ్రగ్ తమకు కావాలంటూ ట్రంప్ భారత్ ను అభ్యర్థించారు. భారతదేశంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతులపై నిషేధం విధించారు. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమకు ఈ సంజీవనిని సరఫరా చేయకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్‌ హెచ్చరించారు. పొరుగు దేశం నేపాల్‌, శ్రీలంక సహా ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థనలు వస్తుండటంతో HCQ  ఎగుమతులపై నిషేధాన్ని భారత్ పాక్షికంగా సడలిచింది. మనదేశంలో కూడా కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో దేశ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా భారత్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ తగినంత నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. మనదేశానికి సరిపోయేంతగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఉంచుకుని మిగతా మొత్తాన్ని ప్రపంచ దేశాలను ఎగుమతి చేస్తామని భారత్‌ ప్రకటించింది.

అమెరికాకు భయపడే భారత్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతులపై నిషేధాన్ని తొలగించిందన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. కరోనాతో అల్లాడిపోతున్న దేశాలకు మానవతాదృక్పథంతో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతి చేస్తామని భారత్ ప్రకటించింది. బ్లూమ్ బర్గ్ రిపోర్టు ప్రకారం.. HCQ అగ్రశ్రేణి సరఫరాదారు అహ్మదాబాద్‌కు చెందిన Cadila Healthcare అనుబంధ సంస్థ అయిన Zydus Pharmaceuticals Incగా ఉంది. భారత ఫార్మా కంపెనీలు అమెరికాకు దాదాపు సగానికి పైగా HCQ సరఫరాను అందించనున్నాయి.