Breaking News : కరోనాకు కారణం చైనాయే..ఇజ్రాయల్ నిపుణుడు

  • Published By: madhu ,Published On : January 30, 2020 / 04:01 AM IST
Breaking News : కరోనాకు కారణం చైనాయే..ఇజ్రాయల్ నిపుణుడు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. ఎలా పుట్టిందన్న దానిపై భిన్న కథనాలున్నాయి. ఓ మాంస విక్రయశాల నుంచి వచ్చిందని, పాముల నుంచి సోకిందని, గబ్బిలాల వల్లే వ్యాప్తి చెందిందని.. రకరకాల వాదనలు వినిపించాయి. కానీ… కచ్చితమైన ఆధారం దొరకలేదు. అయితే… అవన్నీ అవాస్తవాలేనన్న మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్‌ దానంతట అది ప్రబలింది కాదనే కథనాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ…  ప్రాణాంతక వైరస్ జంతుమాంసం మార్కెట్‌ నుంచి వ్యాపించలేదా? దీనికి చైనాయే అసలు కారణమా? ఆ దేశం చేస్తున్న కుతంత్రం బెడిసికొట్టిందా? అంటే.. ఇజ్రాయిల్‌కు చెందిన మైక్రోబయాలజిస్టు, మాజీ సైనిక నిఘా అధికారి అవుననే సమాధానమిస్తున్నారు.

వుహాన్ సిటీలో బయో వెపన్స్ :-
కరోనా వ్యాప్తి చెందిన వుహాన్‌ సిటీలోనే చైనా బయో వెపన్స్‌ తయారు చేస్తోందంటున్నారు ఇజ్రాయిల్‌‌కు చెందిన  రిటైర్డ్ మిలిటరీ ఇంటలిజెన్స్ ఆఫీసర్ డేనీ షోహమ్. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలోనే వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ లాబోరేటరీ ఉండటం అనుమానాలకు తావిచ్చింది. ఈ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటకు లీకైందనే వార్త చక్కర్లు కొడుతోంది.

 

ల్యాబ్‌లో వైరస్ అభివృద్ధి : –
ఈ ల్యాబ్‌లో వైరస్‌లపై పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ రిఫరెన్స్‌గా ఇది పనిచేస్తుంది. ఇక్కడ ఎబోలా, నిఫా, సార్స్‌ లాంటి ప్రమాదకర వైరస్‌లపై ప్రయోగాలు చేపట్టారు. కానీ చైనా దీనిని స్వప్రయోజనాలు పొందేందుకు వాడుతోందని డేనీ షోహమ్ తెలిపాడు. ఆ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ను అభివృద్ధి చేశారని.. ప్రమాదవశాత్తు ఆ వైరస్ బయటికి వచ్చి ఆ దేశాన్నే కాటేసిందని స్పష్టం చేశాడు.

చైనాలో జీవాయుధాల తయారీ :-
యుద్ధ వ్యూహాల్లో భాగంగా చైనా..  వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో జీవాయుధాలను తయారు చేస్తోంది. నిజానికి రసాయనిక, జీవాయుధాల తయారీపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉంది. వాటివల్ల శత్రు దేశ సైనికులకే కాదు… సామాన్యులకు కూడా ముప్పు ఉంటుంది. కానీ కొన్ని దేశాలు తమ బయోలాజికల్‌ వార్‌ఫేర్‌లో భాగంగా రహస్యంగా ఈ తరహా వైరస్‌లను తయారు చేస్తున్నాయనే అనుమానం ఉంది. చైనా కూడా ఇలాగే చేస్తోందని.. డేనీ షోహమ్ చెబుతున్నారు.

 

శాంపిళ్లు లీక్ ? :-
ఆయనే కాదు.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన కూడా గందరగోళంగా ఉందని అంటోంది చైనాకు చెందిన ఓ న్యూస్ ఛానెల్. కరోనాపై చైనా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్న ఆ ఛానెల్‌… జిన్‌పింగ్ ఏదో దాస్తున్నారని, బయో వెపన్‌పై తొందరలోనే నిజాన్ని బయటపెడతారని సంచలన వార్తలను ప్రసారం చేసింది. మరోవైపు… కెనడాలో పనిచేసే చైనా వైరాలజీ నిపుణులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కొన్ని శాంపిళ్లను చైనాకు పంపించారని.. అది లీకవడం వల్లే ఈ వైరస్  వ్యాప్తి చెందిందన్న మరో వాదన కూడా ఉంది.  `

 

భారత్‌ను దెబ్బతీయడం కోసమే : –
భారత్‌ను దెబ్బతీయడం కోసమే చైనా ఈ జీవాయుధాన్ని తయారు చేసిందని… కానీ అది లీకై డ్రాగన్‌కే ముప్పుగా పరిణమించిందనే కథనాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. కెనడా నుంచి కరోనా వైరస్‌ను చైనా తస్కరించిందనడానికి, జీవాయుధాలు తయారు చేస్తోందనడానికి తగిన ఆధారాలేవీ లేవు. అంతేకాదు.. కరోనా… చైనా జీవాయుధం అనడానికి కూడా ఎలాంటి ఆధారాలు కూడా లేవు. కానీ బయో సైన్స్‌లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతుండటం, నైతికతకు కట్టుబడి ఉండకపోవడం.. ఆ దేశం పట్ల అనుమానాలకు తావిస్తోంది. కరోనా వైరస్ విషయంలో చైనా నోరు మెదపకపోవడం కూడా ఆ అనుమానాలను మరింతగా పెంచుతున్నాయి.

 

170 మంది మృతి : –
ఇదిలా ఉంటే…ఈ వైరస్ వల్ల ఇప్పటికే  చైనాలో 170 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఈ మహమ్మారి ఎక్కడ తమ దేశంలోకి ప్రవేశిస్తుందోనని ప్రపంచదేశాలు కూడా వణికిపోతున్నాయి. వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. 

 

ఆందోళనలో భారతీయులు :- 
మరోవైపు… కరోనా వైరస్ కాటుకు బలవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో చైనాలోని భారతీయులు ఆందోళనలో ఉన్నారు. దీంతో.. వారందరినీ వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే.. చైనాకు రెండు విమానాలను పంపించింది. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా.. ఆ దేశ దౌత్య అధికారులతో చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసింది.