కరోనాకు ప్లాస్మా చికిత్స.. యూకే ప్రభుత్వం యోచన

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని శత్రువుతో యావత్ ప్రపంచం పోరాటం చేస్తోంది.

  • Published By: veegamteam ,Published On : April 21, 2020 / 03:20 AM IST
కరోనాకు ప్లాస్మా చికిత్స.. యూకే ప్రభుత్వం యోచన

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని శత్రువుతో యావత్ ప్రపంచం పోరాటం చేస్తోంది.

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని శత్రువుతో యావత్ ప్రపంచం పోరాటం చేస్తోంది. 2019 డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో కరోనా వెలుగుచూసింది. కానీ ఇంతవరకు ఈ మహమ్మారికి మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ కనుక్కోలేదు. దానిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వైద్యనిపుణులు, వైరాలజిస్టులు, భౌతిక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వ్యాక్సిన్ తయారీకి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో ప్రత్యామ్నాయ చికిత్సా విధానంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. అందులో ఒకటి ప్లాస్మా(plasma) థెరపీ. ప్లాస్మా థెరపీ అంటే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మా(యాంటీబాడీస్) సేకరిస్తారు. దాని ద్వారా కరోనా బాధితులకు చికిత్స చేస్తారు.

కరోనా వైరస్‌కు ప్లాస్మా థెరపీతో కళ్లెం:
కరోనా వైరస్‌కు ప్లాస్మా థెరపీతో(plasma therapy) కళ్లెం వేయచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మందులకు లొంగని వైరస్‌లను, అదే వైరస్‌ నుంచి బయటపడిన వ్యక్తి రక్తంలోని ప్లాస్మా ద్వారా చికిత్స చేయవచ్చని అంటున్నారు. సార్స్‌, మెర్స్‌, ఎబోలా వంటి రోగాలకు ఇదే పద్ధతిలో చికిత్స అందించామని చెబుతున్నారు. కరోనా వ్యాధి సోకిన వ్యక్తి శరీరంలో వైరస్‌ ప్రభావం పెరిగి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటే.. ప్లాస్మా చికిత్స ద్వారా నయం చేయవచ్చని వైద్యులు తెలిపారు. ఇటీవల చైనాలో విషమ పరిస్థితిలో ఉన్న ఐదుగురు కరోనా రోగులపై చేసిన ఈ ప్రయోగం సత్ఫలితాలనిచ్చిందని తెలుస్తోంది.

ప్లాస్మా చికిత్స ఏమిటి?
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తాన్ని సేకరించి, దానిలో నుంచి ప్లాస్మాను వేరుచేస్తారు. దాన్ని కన్వల్సెంట్‌ ప్లాస్మా అంటారు. ఈ ప్లాస్మాను విషమ పరిస్థితిలో ఉన్న కరోనా రోగులకు ఎక్కిస్తారు. తద్వారా సదరు రోగిలో వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీస్‌ తయారవుతాయి. అవే వైరస్‌ను అంతం చేసేందుకు దోహదపడతాయి.

ప్లాస్మా ఎవరి నుంచి సేకరిస్తారు?
కరోనా నుంచి కోలుకొని, 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉన్నవారిలో ప్రధానంగా 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారి నుంచి మాత్రమే ప్లాస్మాను సేకరిస్తారు. వారు ఆరోగ్యవంతులై గత ఆరు నెలల్లో ఎటువంటి శస్త్రచికిత్స జరగనివారై ఉండాలి. రక్తాన్నిచ్చే దాతలకు శ్వాస సంబంధమైన వ్యాధులు, గుండె, కిడ్నీ జబ్బులు ఉండకూడదు. తప్పనిసరైతేనే మహిళల నుంచి రక్తాన్ని సేకరించాలి.

ప్లాస్మా థెరపీలో యాంటీబాడీస్ కీలకం:
కరోనా బారిన పడిన వాళ్లల్లో చాలామంది కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారు. కరోనా రోగులు కోలుకోవడానికి వాళ్ల శరీరంలోని బలమైన యాంటీ బాడీస్ సహకరిస్తాయి. శరీరంలోని మంచి సూక్ష్మజీవులు, మంచి బ్యాక్టీరియా కరోనా నుంచి కోలుకోడానికి సహాయపడుతోంది. ప్లాస్మా చికిత్స విధానంలో…ఇలా కరోనా నుంచి కోలుకున్న వారి శరీరం నుంచి వారి అనుమతి మేరకు ఇలాంటి యాంటీ బాడీస్‌ను డాక్టర్లు సేకరించి కరోనా పాజిటివ్ రోగుల శరీరంలోకి ఎక్కిస్తారు. రక్తం ఒకరి నుంచి ఒకరికి ఎక్కించే విధానంలోనే ఈ చికిత్స జరుగుతుంది. 

ప్లాస్మా చికిత్స దిశగా యూకే:
ప్రస్తుతం యూకే ప్రభుత్వం కరోనా బాధితులకు ప్లాస్మా చికిత్స అందించేందుకు సన్నద్దమవుతోంది. ఇందులో భాగంగా కరోనా నుంచి కోలుకున్న వారు రక్తం, ప్లాస్మా దానం చేయాల్సిందిగా కోరుతున్నారు. అందులో ఉన్న యాంటీబాడీస్ కరోనా వైరస్ ని అంతం చేయడానికి సాయపడుతుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా ప్లాస్మా చికిత్సపై స్టడీ చేస్తోంది. 1500కు పైగా ఆసుపత్రుల్లో ప్లాస్మా చికిత్సను అనుసరిస్తోంది.

సార్స్‌, ఎబోలా రోగులకు ప్లాస్మా తరహా ట్రీట్మెంట్‌:
1918లో ఫ్లూ జ్వరం మహమ్మారిలా వ్యాపించినప్పుడు దానికి ఆధునిక వైద్యం అందుబాటుకు రాలేదు. అప్పుడు కోలుకున్న రోగుల ప్లాస్మాను వ్యాధిగ్రస్తుల రక్తంలోకి ఎక్కించి నయం చేశారు వైద్యులు. 2002లో సార్స్‌ వచ్చినప్పుడు, 2014లో ఎబోలా వచ్చినప్పుడు కూడా ఇదే తరహా ట్రీట్మెంట్‌ చేశారు. ఇప్పుడు కోవిడ్ 19 వైరస్‌కు కూడా ప్లాస్మా థెరపీ సమర్థంగా పనిచేస్తుందంటున్నారు వైద్యనిపుణులు. ఇలా చైనా, దక్షిణ కొరియాలో చికిత్స చేసిన పేషెంట్లకు నయం కాగా.. భారీ స్థాయిలో దాన్ని వాడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలోనూ దీనిపై పెద్ద ఎత్తున ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

ప్లాస్మా చికిత్సపై ఆశలు:
కరోనా వైరస్ సోకిన వ్యక్తిలో యాంటీబాడీస్ ఉత్పత్తి చేయడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. ఆ యాంటీబాడీస్ వైరస్ పై దాడి చేస్తాయి. అలాంటి యాంటీబాడీస్ బ్లడ్ లోని ప్లాస్మాలో ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న వారిని యూకేకి చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ అధికారులు సంప్రదిస్తున్నారు. వారి నుంచి ప్లాస్మా సేకరించి కరోనా బాధితులకు చికిత్స అందించే యోచనలో ఉన్నారు. ప్లాస్మా ట్రీట్ మెంట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ఒక వేళ ఆ చికిత్స విధానం సక్సెస్ అయితే ఆ తరహా చికిత్సను మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు. కాగా, క్లినికల్ ట్రయల్స్ కు ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఉండాలని స్పష్టం చేశారు. కాగా, పలు దేశాలు ఇప్పటికే ప్లాస్మా చికిత్సను ప్రయోగించాయి. అవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో అందరూ ప్లాస్మా ట్రీట్ మెంట్ పైనే ఆశలు పెట్టుకున్నారు.