స్పెయిన్ ను కాటేసిన కరోనా…ఒక్కరోజులో 838మంది మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : March 29, 2020 / 10:29 AM IST
స్పెయిన్ ను కాటేసిన కరోనా…ఒక్కరోజులో 838మంది మృతి

ప్ర‌పంచ‌దేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్(COVID-19)5కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న స్పెయిన్ ను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. స్పెయిన్ లో గడిచిన 24గంటల్లో 838మంది కరోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆదివారం(మార్చి-29,2020) ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. వరుసగా మూడో రోజు స్పెయిన్ లో రికార్డు స్థాయి మరణాలు నమోదైనట్లు తెలిపింది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు ఇటలీ తర్వాత స్పెయిన్ లోనే నమోదయ్యాయి. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 10వేలు దాటింది.

అయితే ఒక్కరోజులో నమోదైన మరణాలు కూడా ఇటలీ కన్నా స్పెయిన్ లోనే ఎక్కువ. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూ పోతుంది. స్పెయిన్‌ లో అయితే పరిస్థితులు మరింత భీతావహంగా ఉన్నాయి. స్పెయిన్ లో కరోనా వైరస్‌ మరణాల సంఖ్య కరోనా పుట్టిల్లు చైనాను దాటిపోయింది. అంతేకాకుండా రోజురోజుకీ రికార్డు మరణాలు స్పెయిన్ లో నమోదవడం అందరినీ టెన్షన్ కు గురిచేస్తోంది.

కాగా,ఇప్పటివరకు స్పెయిన్ లో కరోనా మరణాల సంఖ్య 6వేల 528కి చేరింది. ఇప్పటివరకు దాదాపు 79వేలమంది స్పెయిన్ వాసులకు కరోనా సోకినట్లు తేలింది. రాత్రికి రాత్రే స్పెయిన్ లో వేల సంఖ్యల్లో కరోనా కేసుతు నమోదవుతున్నాయి. రోజుకి దాదాపు 7వేల మంది వరకు కరోనా బారిన పడుతున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. కరోనా టెస్టింగ్ రేటు కూడా భారీగా పెరిగింది. స్పెయిన్ లో 14వేలమందికి కరోనా నుంచి కోలుకోగా, దాదాపు 5వేల మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల నుంచి లక్షల కరోనా టెస్టింగ్ కిట్ ల కోసం స్పెయిన్ ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల 60 వేల మంది ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడగా.. 30 వేల మందికి పైగా మరణించారు. మృతుల్లో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారే అధికంగా ఉండటం గమనార్హం. కరోనాపై యుద్ధంలో భాగంగా మార్చి-15,2020 నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ ను స్పెయిన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ ను జాతీయం చేసేసింది. అంతేకాకుండా దేశంలోని నాలుగో ఏడాది చదువుతున్న మెడికల్ విద్యార్థులందరినీ స్పెయిన్ హెల్త్ సర్పీస్ కు సాయం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే కోరింది.

మరోవైపు కరోనాకు స్పెయిన్‌ యువరాణి మారియా థెరీసా(86) బలయ్యారు. వైరస్‌ బారిన పడిన యువరాణి పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన మారియా స్పెయిన్‌ రాజు ఫెలిప్‌-6కు సోదరి. 1933 జులై 28 న ఆమె జన్మించారు. ఫ్రాన్స్‌లో చదువుకున్న మారియా సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించి ‘రెడ్‌ ప్రిన్సెస్‌’గా పేరు సంపాదించారు. ఇక ఇటీవల జరిగిన వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో కింగ్‌ ఫెలిప్‌-6కు నెగెటివ్‌ అని వచ్చింది.